Worlds slowest cities : ట్రాఫిక్ వల్ల ఇక్కడ ఏదైనా 'స్లో'నే! టాప్ 4లో మూడు భారత నగరాలు..
ప్రపంచవ్యాప్తంగా వాహనాల రాకపోకలు చాలా నెమ్మదిగా సాగే నగరాల జాబితాలో బెంగళూరులు 3వ స్థానంలో నిలిచింది. అంతేకాదు టాప్ 4లో మూడు నగరాలు భారత్‌కు చెందినవే ఉన్నాయి.
బెంగళూరులో ట్రాఫిక్ రద్దీ మరోసారి వార్తల్లో నిలిచింది. 2024 టామ్‌టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ ప్రకారం.. ఈ నగరం వరల్డ్స్ స్లోయెస్ట్ సిటీస్‌లో మూడో స్థానంలో ఉంది. ఇక్కడి ట్రాఫిక్ వల్ల ఏదైనా నెమ్మదిగా సాగాల్సిందే! అంతేకాదు.. ఈ ర్యాంకింగ్స్‌లోని టాప్ 4లో భారత్‌కు చెందిన నగరాలు మూడు ఉండటం గమనార్హం!

ట్రాఫిక్ వల్ల ఇక్కడ ఏదైనా ‘స్లో’నే!
డచ్‌కి చెందిన లొకేషన్ టెక్నాలజీ సంస్థ టామ్‌టామ్.. ప్రతియేటా ప్రపంచవ్యాప్తంగా ప్రధాన నగరాల్లోని ట్రాఫిక్ పరిస్థితులను పరిశీలించి, ట్రాఫిక్ ప్రవాహంలో నెమ్మదిగా ఉన్న నగరాల లిస్ట్‌ని తయారు చేస్తుంది. 2024కి సంబంధించి బెంగళూరు మూడొవ స్థానంలో ఉంది. కాగా మొదటి స్థానంలో కొలంబియాకు చెందిన బారాన్క్విల్లా ఉంది. ఇక రెండో స్థానంలో కోల్‌కతా నిలిచింది.
పెరుగుతున్న ప్రైవేటు వాహనాలతో బెంగళూరు ట్రాఫిక్ కష్టాలు మరింత తీవ్రమవుతున్నాయి. కొన్నేళ్ల క్రితమే.. ప్రైవేటు వాహనాల సంఖ్యలో ఈ నగరం దిల్లీని అధిగమించింది. ఇక తీవ్రమైన ట్రాఫిక్ జామ్‌లకు పేరుగాంచింది. ప్రస్తుతం బెంగళూరులో సుమారు 2.5 మిలియన్ల ప్రైవేట్ కార్లు ఉన్నాయి. దీనికితోడు రోజుకు దాదాపు 2,000 కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు నగరంలో ఇప్పటికే భారంగా మారిన మౌలిక సదుపాయాలపై ఒత్తిడిని పెంచుతున్నాయి.
టామ్‌టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ ఏం చెప్పింది?
బెంగళూరులో 10 కిలోమీటర్లు ప్రయాణించడానికి పట్టే సగటు సమయం ఇప్పుడు 30 నిమిషాల 10 సెకన్లు! ఇది 2023 తో పోలిస్తే 50 సెకన్లు ఎక్కువ. బరాన్క్విల్లాలో 10 కిలోమీటర్ల దూరానికి ప్రయాణికులు సగటున 36 నిమిషాల 6 సెకన్లు ప్రయాణిస్తారు. కోల్‌కతాలో ఇది 34 నిమిషాల 33 సెకన్లుగా ఉంది. వాహనాల రాకపోకలకు ప్రపంచంలోనే అత్యంత నెమ్మదిగా ఉన్న నగరాల్లో పుణె నాలుగో స్థానంలో నిలవడం గమనార్హం!
ఇండియా విషయానికొస్తే.. అత్యంత రద్దీ నగరంగా కోల్‌కతాను హైలైట్ చేసింది టామ్‌టామ్ డేటా. బెంగళూరు రెండొవ స్థానంలో ఉంది. 2023లో బెంగళూరు సగటున 10 కిలోమీటర్లు ప్రయాణించడానికి 28 నిమిషాల 10 సెకన్ల సమయం పట్టేది. 2022లో ఇది 29 నిమిషాల 9 సెకన్లతో కొద్దిగా తక్కువగా ఉండేది. ఆ సమయంలో బెంగళూరు ప్రపంచవ్యాప్తంగా రెండొవ నెమ్మది ప్రయాణం గల నగరంగా నిలిచింది. 2022 లో నగరం సగటు వేగం గంటకు 18 కిలోమీటర్లు. ఇది భారతీయ నగరాల్లో అత్యంత నెమ్మదిగా ఉంది.
ప్రపంచవ్యాప్తంగా, లండన్ గంటకు సగటున 14 కిలోమీటర్ల వేగంతో అత్యంత రద్దీగా ఉండే నగరంగా తన స్థానాన్ని నిలుపుకుంది. డబ్లిన్ (16 కి.మీ/గం), మిలన్ (17 కి.మీ/గం), లిమా (17 కి.మీ/గం), టొరంటో (18 కి.మీ/గం) వంటి ఇతర ప్రధాన నగరాలు కూడా బెంగళూరు కంటే ముందు ఉన్నాయి.
ఈ నివేదికలు, లిస్ట్‌లు.. పట్టణ ట్రాఫిక్ రద్దీ విస్తృత సమస్యను నొక్కిచెబుతోంది.
సంబంధిత కథనం