భారీ వర్షాలకు బెంగళూరు అతలాకుతలం- వ్యవస్థపై ప్రజల్లో అసహనం-bengaluru rains update garden city witnesses severe waterlogging flooding in resident ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  భారీ వర్షాలకు బెంగళూరు అతలాకుతలం- వ్యవస్థపై ప్రజల్లో అసహనం

భారీ వర్షాలకు బెంగళూరు అతలాకుతలం- వ్యవస్థపై ప్రజల్లో అసహనం

Sharath Chitturi HT Telugu

బెంగళూరులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత కొన్ని గంటల్లో బెంగళూరులో 40 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది.

హొరమావులో పరిస్థితి ఇలా.. (ANI - X)

గత రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు గార్డెన్​ సిటీగా, భారత దేశ సిలికాన్​ వ్యాలీగా పేరొందిన బెంగళూరు అల్లాడిపోతోంది. అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. వీధులే కాదు, ఇళ్లల్లోకి నీరు చేరడంతో ప్రజలు కష్టాలు పడుతున్నారు. రోడ్డు మీద నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్​ సమస్యలు తీవ్రంగా మారాయి.

బెంగళూరులో భారీ వర్షాలు..

బెంగళూరులో భారీ వర్షాల కారణంగా హోరమావు ప్రాంతంలో ఇళ్లలోకి నీరు చేరిందని, దీంతో ప్రజలు చిక్కుకుపోయారని, తమ వస్తువులను కాపాడుకునేందుకు నానా అవస్థలు పడ్డారని తెలుస్తోంది.

గ్రౌండ్ ఫ్లోర్ ఇళ్లలోకి నీరు చేరడంతో పాటు హోరమవు ప్రాంతంలోని ఫర్నిచర్, ఉపకరణాలు ధ్వంసమయ్యాయి. నీరు నిలిచిపోవడంతో పలు రహదారులు అగమ్యగోచరంగా మారడంతో పాటు ప్రజారవాణా సేవలు మందగించడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు.

గత 24 గంటల్లో (ఆదివారం రాత్రి నాటికి) బెంగళూరులో 40 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది!

అకస్మాత్తుగా కురిసిన వర్షాన్ని తట్టుకోవడంలో నగరంలోని డ్రైనేజీ వ్యవస్థ విఫలమైంది. ఫలితంగా ప్రజలు మోకాలి లోతు నీటిలో ప్రయాణిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. వీధులు వాగులుగా మారడంతో పలు వాహనాలు పాక్షికంగా నీట మునిగాయి.

దీనికితోడు బెంగళూరులోని పలు ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగిపడటంతో ఇప్పటికే నిలిచిపోయిన ట్రాఫిక్​ను క్లియర్ చేయడం మరింత కష్టంగా మారింది.

మురుగు కాల్వలు మూసుకుపోయాయని, పదేపదే ఫిర్యాదు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపించారు.

ఇంకా వర్షా కాలం మొదలవ్వనే లేదని, ఇప్పుటే పరిస్థితి ఇలా ఉంటే, అప్పుడు మరింత అద్వానంగా ఉంటుందని ప్రజలు మండిపడుతున్నారు.

సోషల్​ మీడియాలో వీడియోలు వైరల్​..

“పది నిమిషాల వర్షం పడింది. హెన్నూర్ మెయిన్ రోడ్ 12 గంటలు స్తంభించిపోయింది. మన అధికారులు, ప్రజాప్రతినిధులు పూర్తిగా నిరుపయోగంగా ఉన్నారు,” అని ఓ వ్యక్తి ఎక్స్​లో పోస్ట్​ చేశాడు.

మరో యూజర్ ఔటర్ రింగ్ రోడ్డులోని పనత్తూరు ప్రాంతంలో పరిస్థితిని ఎత్తిచూపుతూ.. "చిరుజల్లులు కూడా ఈ ప్రాంతాన్ని సముద్రంలా మారుస్తాయి. అయినా ఇక్కడ భారీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు వస్తున్నాయి. ఓషన్ పార్క్, పనత్తూర్​కు స్వాగతం!" అని అన్నాడు.

వరద ప్రభావిత ప్రాంతంగా పేరొందిన పణత్తూరు రైల్వే అండర్ బ్రిడ్జి (ఆర్ యూబీ) మరోసారి జలదిగ్బంధంలో చిక్కుకుంది.

"మేము అసిస్టెంట్ ఇంజనీర్ల నుంచి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల వరకు ప్రతి ఒక్కరినీ సంప్రదించడానికి ప్రయత్నించాము - ఒక్క కాల్ లేదా టెక్స్ట్ కూడా తిరిగి రాలేదు," అని మరొక యూజర్ తమ నిరాశను వ్యక్తం చేశారు.

ఇక ఉత్తర కన్నడ, ఉడిపి, బెళగావి, ధార్వాడ్, గదగ్, హవేరి, శివమొగ్గ జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

కేరళ, ముంబైలో కూడా వర్షాలు..

బెంగళూరు మాత్రమే కాదు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ప్రీ-మాన్సూన్​ వర్షాలు కురుస్తున్నాయి. ముంబై, థానే, రాయ్​గఢ్​తో పాటు మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, మోస్తరు వర్షాలు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 21 వరకు ఇదే పరిస్థితి ఉంటుందని స్పష్టం చేసింది.

ఇక నైరుతి రుతుపవనాల ప్రవేశం నేపథ్యంలో కేరళలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో భారత వాతావరణ శాఖ ఆదివారం వెల్లడించింది. ఈ మేరకు మూడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

రాష్ట్రంలోని తిరువనంతపురం, కొల్లం, పతనంతిట్ట జిల్లాల్లో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని అలప్పుజ, కొట్టాయం, ఇడుక్కి, ఎర్నాకుళం, కన్నూర్, కాసర్గోడ్ జిల్లాల్లో యెల్లో అలర్ట్ జారీ చేసింది.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.