‘ఈ రోడ్ల వల్ల మానసిక క్షోభ అనుభవించా’- అధికారులకు రూ. 50లక్షల నోటీసు ఇచ్చిన ట్యాక్స్ ​పేయర్!-bengaluru rains man sends 50 lakh notice to civic body over poor roads ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  ‘ఈ రోడ్ల వల్ల మానసిక క్షోభ అనుభవించా’- అధికారులకు రూ. 50లక్షల నోటీసు ఇచ్చిన ట్యాక్స్ ​పేయర్!

‘ఈ రోడ్ల వల్ల మానసిక క్షోభ అనుభవించా’- అధికారులకు రూ. 50లక్షల నోటీసు ఇచ్చిన ట్యాక్స్ ​పేయర్!

Sharath Chitturi HT Telugu

రోడ్లు అద్వానంగా ఉండటం వల్ల తాను భౌతికంగా, మానసికంగా క్షోభకు గురయ్యానని, బీబీఎంపీకి నోటీసు పంపించారు ఓ ట్యాక్స్​ పేయర్​! తనకు రూ. 50లక్షల పరిహారాన్ని చెల్లించాలని తేల్చిచెప్పారు.

మున్సిపల్​ కార్పొరేషన్​ అధికారులకు రూ. 50లక్షల నోటీసులు! (PTI/ Representative image)

బెంగళూరు రోడ్ల దుస్థితి వల్ల తాను భౌతికంగా- మానసికంగా క్షోభకు గురయ్యానని, తనకు రూ. 50లక్షల పరిహారాన్ని చెల్లించాలని.. ఓ 43ఏళ్ల వ్యక్తి బీబీఎంపీ (బృహత్​ బెంగళూరు మహానగర పాలిక)కి నోటీసు పంపించారు. ఎప్పటికప్పుడు పన్నులు చెల్లిస్తున్నప్పటికీ, కనీస మౌలికవసతులను సరిగ్గా నిర్వహించలేకపోతున్న పురపాలక సంఘం వల్ల చాలా కష్టాలు పడినట్టు ఆ వ్యక్తి వివరించారు.

బీబీఎంపీకి రూ. 50లక్షల నోటీసు..

బెంగళూరు రిచ్​మాండ్​ టౌన్​ నివాసి ధివ్య కిరణ్​ బీబీఎంపీకి ఈ నోటీసు పంపించారు. రోడ్ల మీద గుంతల వల్ల తన ఆరోగ్యం దెబ్బతిందని, విపరీతమైన మెడ- వెన్ను నొప్పుల వల్ల ఐదుసార్లు ఆర్థోపెడిక్​ దగ్గరికి, నాలుగుసార్లు హాస్పిటల్స్​కి ఎమర్జెన్సీ విజిట్​ కోసం వెళ్లినట్టు చెప్పారు.

"దారణమైన రోడ్ల మీద ప్రయాణం వల్ల ట్రౌమాకి గురయ్యా," అని కిరణ్​ చెప్పుకొచ్చారు.

ఈ రూ. 50లక్షల నోటీసులపై బీబీఎంపీ ఇంకా స్పందిచలేదు.

బెంగళూరులో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనేక ప్రాంతాలు నీటమునిగాయి. బెంగళూరు రోడ్లు వెనిస్​ని తలపిస్తున్నాయంటూ, బీబీఎంపీ వైఫల్యాలపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అనేక చోట్ల రోడ్లు దెబ్బతిన్నారు. ఈసారే కాదు, ఎప్పుడు వర్షం పడినా ఇదే పిరిస్థితి ఉంటోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ వర్షాలు పడకపోయినా, ఎక్కడిక్కడ గుంతలు కనిపిస్తూనే ఉంటాయి.

నొప్పి కారణంగా తాను 2 వీలర్​, ఆటోల్లో తిరగలేకపోతున్నట్టు కిరణ్​ వివరించారు. రోడ్లు అద్వానంగా ఉండటం వల్ల తన వెన్ను, మెడ పరిస్థితి బాగోలేదన్నారు. క్యాబ్​లో వెళ్లడమూ కష్టంగానే ఉందని, కానీ ఆటో- బైక్​ కన్నా బెటర్​ అని వివరించారు. ఫలితంగా ఎక్కడికైనా వెళ్లే స్వేచ్ఛను కోల్పోయినట్టు పేర్కొన్నారు. ఇది తన వ్యక్తిగత జీవితంతో పాటు ప్రొఫెషనల్​ లైఫ్​ని కూడా దెబ్బతీసిందని వెల్లడించారు.

"విపరీతమైన నొప్పి కారణంగా నా క్లెయింట్​ ఐదుసార్లు ఆర్థోపెడిక్​ స్పెషలిస్ట్​ దగ్గరికి వెళ్లారు. 4సార్లు సెంట్​ ఫిలోమెనా హాస్పిటల్​కి వెళ్లి ఇంజెక్షన్లు చేయించుకున్నారు. చాలా రోజుల పాటు మందులు, పెయిన్​కిల్లర్లను వాడారు," అని కిరణ్​ తరపు న్యాయవాది కేవీ లవీన్​ మీడియాకు తెలిపారు.

"నొప్పి వల్ల ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. చాలా బాధపడ్డారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. ఒత్తిడి- మానసిక క్షోభకు గురయ్యారు. వీటి వల్ల ఆయన రోజువారీ కార్యకలాపాలు దెబ్బతిన్నాయి," అని న్యాయవాది వివరించారు.

"బాధ్యత నిర్వహణలో బీబీఎంపీ నిర్లక్షం, వైఫల్యం వల్లే కిరణ్​కి భౌతికంగా- ఎమోషనల్​గా ట్రౌమా వచ్చింది. ఆర్థికంగా ఇబ్బందులు వచ్చాయి," అని నోటీసులో ఉంది. ఈ క్షోభకు రూ. 50లక్షల పరిహారం చెల్లించాలని నోటిసు తేల్చిచెప్పింది. లేకపోతే చట్టపరమైన చర్యలకు వెళతామని స్పష్టం చేసింది.

బీబీఎంపీపై లీగల్​ నోటీసు వేసినందుకు అయిన ఖర్చులు రూ. 10వేలు కూడా ఇవ్వాలని నోటీసులే కిరణ్​ తేల్చిచెప్పారు.

"బెంగళూరు రోడ్లు దారుణంగా ఉంటాయి. చిన్న గుంతతో కూడా పెద్ద నష్టం వాటిల్లుతుంది. చాలాసార్లు అధికారులకు ఈ విషయం చెప్పాను. కానీ ఎవరూ పట్టించుకోలేదు. మౌలికవసతులను పట్టించుకోకపోవడం బాధాకరం. అందుకే అధికారులకు నోటీసు ఇచ్చాను. అవసరమైతే పిల్​ కూడా వేస్తాను. నేను ఎందుకు బాధపడాలి? మంచి రోడ్లు ఇవ్వడం ప్రభుత్వ కనీస బాధ్యత," అని కిరణ్​ మీడియాకు వెల్లడించారు.

ఒక్క బెంగళూరు మాత్రమే కాదు హైదరాబాద్​ సహా దేశంలోని అనేక నగరాల్లో పరిస్థితులు ఇలానే ఉన్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూనే ఉన్నారు.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.