Thief Gifted 3 Crore House : ఇతను అదోటైపు దొంగ.. చోరీలు చేసిన సొమ్ముతో ప్రియురాలికి 3 కోట్ల ఇల్లు-bengaluru police arrest thief who gifted 3 crore rupees worth home to his actress girl friend ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Thief Gifted 3 Crore House : ఇతను అదోటైపు దొంగ.. చోరీలు చేసిన సొమ్ముతో ప్రియురాలికి 3 కోట్ల ఇల్లు

Thief Gifted 3 Crore House : ఇతను అదోటైపు దొంగ.. చోరీలు చేసిన సొమ్ముతో ప్రియురాలికి 3 కోట్ల ఇల్లు

Anand Sai HT Telugu

Thief Gifted 3 Crore House : దొంగల్లో పలు రకాలు. ఒక్కో దొంగ.. ఒక్కో విధంగా ఉంటాడు. కొంతమంది జల్సాలు చేసేందుకు చోరీలు చేస్తే.. మరికొందరు దానినే వృత్తిగా ఎంచుకుంటారు. అయితే ఓ వ్యక్తి మాత్రం తాను దొంగతనం చేసిన సొమ్ముతో ప్రియురాలికి 3 కోట్లు పెట్టి ఇల్లు కొన్నాడు.

పంచాక్షరి స్వామి

దొంగతనం చేయగా వచ్చిన డబ్బుతో ఓ వ్యక్తి తన ప్రియురాలికి మూడు కోట్లు పెట్టి ఇల్లు కొనిచ్చాడు. ఇప్పుడు ఈ విషయం తెలిసి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జనాలు వామ్మో అనుకుంటున్నారు. ఈ దొంగను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

రెండు దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా అనేక దొంగతనాలకు పాల్పడిన మహారాష్ట్రకు చెందిన 37 ఏళ్ల దొంగను బెంగళూరు పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఈ అరెస్టును బెంగళూరు పోలీస్ కమిషనర్ బి.దయానంద ధృవీకరించారు. అరెస్టయిన నిందితుడిని మహారాష్ట్రలోని షోలాపూర్ కు చెందిన పంచాక్షరి ఎస్ స్వామిగా గుర్తించారు. జనవరి 9న బెంగళూరులోని మారుతీ నగర్ లోని ఓ ఇంట్లో రూ.14 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను దొంగిలించిన కేసులో అరెస్టయ్యాడు.

కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు 200కు పైగా సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించగా వాటి ఆధారంగా నిందితుడిని గుర్తించారు. స్వామి నుంచి 181 గ్రాముల బంగారు బిస్కెట్లు, 33 గ్రాముల వెండి ఆభరణాలు, ఆయుధాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

గిఫ్ట్‌గా 3 కోట్ల ఇల్లు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్వామి 2003లో దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. 2009 నాటికి ప్రొఫెషనల్ దొంగగా మారి కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టాడు. 2014-15లో ఓ నటితో సన్నిహితంగా మెలిగి ఆమెపై డబ్బును నీళ్లలా ఖర్చు చేశాడు. కోల్‌కతాలో తన ప్రేయసి కోసం రూ.3 కోట్ల విలువైన ఇంటిని కొనుగోలు చేసి, రూ.22 లక్షల విలువైన అక్వేరియంను బహుమతిగా ఇచ్చాడు.

గతంలో అరెస్టు

స్వామిని 2016లో గుజరాత్ పోలీసులు అరెస్టు చేసి అహ్మదాబాద్ లోని సబర్మతి సెంట్రల్ జైలులో ఆరేళ్ల శిక్ష విధించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత మళ్లీ దొంగతనాలు చేస్తూ మహారాష్ట్ర పోలీసులకు పట్టుబడ్డాడు. 2024లో జైలు నుంచి విడుదలైన తర్వాత బెంగళూరుకు వచ్చి తన దొంగతనాలు తిరిగి ప్రారంభించాడు. అతనిపై బెళగావిలో కేసు కూడా నమోదైంది.

అమ్మాయిల కోసం ఖర్చు

స్వామికి అమ్మాయిలపై ఇష్టం ఎక్కువ అని, వారి కోసం చాలా డబ్బు ఖర్చు పెడతాడని విచారణలో పాల్గొన్న ఓ పోలీసు అధికారి తెలిపారు. అతనికి భార్యాపిల్లలు కూడా ఉన్నారు. అయితే కోల్‌కతాలోని తన గర్ల్ ఫ్రెండ్ కు రూ.3 కోట్ల విలువైన ఇంటిని గిఫ్ట్ గా ఇచ్చాడు. అతను ఎక్కువగా ఒంటరిగా దొంగతనాలు చేస్తాడు. ఖాళీ ఇళ్లను టార్గెట్ చేసుకుంటాడు. కరాటేలో బ్లాక్ బెల్ట్ హోల్డర్ కూడా. స్వామికి పలువురు నటీమణులతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు.

ఇంటికి మాత్రం లోన్

నేరం చేసిన తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా స్వామి తరచూ బట్టలు మార్చుకునేవాడని పోలీసులు తెలిపారు. తండ్రి మరణానంతరం స్వామి తల్లికి రైల్వేలో ఉద్యోగం వచ్చింది. తన తల్లి పేరు మీద ఇల్లు కొన్నప్పటికీ బకాయిలు చెల్లించకపోవడంతో ఆస్తిని వేలం వేయాలని బ్యాంకు నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం నిందితుడిని విచారిస్తున్న పోలీసులు ఇతర కేసుల్లో అతని ప్రమేయంపై కూడా ఆరా తీస్తున్నారు.

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.