Bengaluru Metro : బెెంగళూరు ప్రజలపై మరో పిడుగు- భారీగా పెరగనున్న మెట్రో టికెట్ రేట్లు..!
Bengaluru Metro ticket price hike : బెంగళూరు మెట్రో టికెట్ ధరలు భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. టికెట్ రేట్లు 45శాతం వరకు పెరగొచ్చు. దీనిపై శనివారమే ఒక ప్రకటన వెలువడనుందని సమాచారం.
బెంగళూరు ప్రజలకు మరో షాక్! ఇప్పటికే బస్సు ఛార్జీల పెంపుతో ఇబ్బందిపడుతున్న నగరవాసులపై బెంగళూరు మెట్రో రూపంలో మరో పిడుగు పడనుంది! బెంగళూరు మెట్రో టికెట్ ధరలు భారీగా పెరగడం దాదాపు ఖరారైపోయింది. ఈ వ్యవహారంపై ఇంకొన్ని గంటల్లో ఒక ప్రకటన సైతం వెలువడనుందని సమాచారం. మొత్తం మీద నమ్మ మెట్రో టికెట్ ధరలు 40శాతం నుంచి 45శాతం వరకు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

బెంగళూరు మెట్రో టికెట్ ధరలు పెంపు..
మీడియా కథనాల ప్రకారం.. బెంగళూరు మెట్రో టికెట్ రేట్లను పెంచాలని ప్రభుత్వ కమిటీ చేసిన సిఫార్సును బీఎంఆర్సీఎల్ (బెంగళూరు మెట్రో రైల్ కర్పొరేషన్ లిమిటెడ్) ఆమోదించింది. జనవరి 20 నుంచి కొత్త టికెట్ రేట్లు అమల్లోకి వస్తాయి.
నమ్మ బెంగళూరు టికెట్ రేట్లు ప్రస్తుతం రూ. 10 నుంచి రూ.60 మధ్యలో ఉన్నాయి. అయితే బేస్ ప్రైజ్ పెరగదని, కానీ గరిష్ఠ ధర రూ. 85కి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.
మెట్రో ద్వారా బీఎంఆర్సీఎల్కి రోజుకు రూ. 2 కోట్ల ఆదాయం వస్తోంది. ఇక మెట్రో టికెట్ ధరల పెంపుతో రోజూ అదనంగా మరో రూ. 80లక్షలు- రూ. 90 లక్షల వరకు ఆదాయం పెరగొచ్చని అంచనాలు ఉన్నాయి. అయితే ప్రయాణికులకు ఉపశమనం కలిగించేందుకు పీక్ హవర్స్‌లో 5శాతం డిస్కౌంట్ ఇవ్వాలని బీఎంఆర్సీఎల్ యోచిస్తోంది. అంతేకాదు ఆదివారాలు, జనవరి 16, ఆగస్ట్ 15, అక్టోబర్ 2న కూడా డిస్కౌంట్లు ఇవ్వాలని ప్లాన్ చేస్తోంది. ఇక స్మార్ట్‌కార్డ్స్ , క్యూఆర్ కోడ్స్ ద్వారా టికెట్లు కొనేవారికి 5శాతం డిస్కౌంట్ ఇప్పటికే ఉంది.
చివరిగా.. 2017 జూన్‌లో బెంగళూరు మెట్రో టికెట్ రేట్లు పెరిగాయి.
ప్రయాణికుల్లో అసంతృప్తి!
కొన్ని రోజుల క్రితం కర్ణాటక ప్రభుత్వం బస్సు ప్రయాణాల ఛార్జీలను పెంచిన విషయం తెలిసిందే. ఇంధన ధరలు, సిబ్బందిపై వ్యయం పెరగడం వంటి నిర్వహణ ఖర్చులు గణనీయంగా పెరిగిన దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి హెచ్‌కే పాటిల్ తెలిపారు.
బెంగళూరు మెట్రో టికెట్ ధరల పెంపు వార్తలపై పలువురు ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బస్సు ఛార్జీలు ఇటీవలే పెంచారని, ఇప్పుడు మెట్రో ధరలు కూడా పెరగడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
సంబంధిత కథనం