Crime news: భార్య, కూతురు, మేనకోడలిని పాశవికంగా హత్య చేసి, తాపీగా పోలీసులకు సమాచారమిచ్చిన హోం గార్డ్
Bengaluru Crime news: ఒక వ్యక్తి భార్య, కూతురు, మేనకోడలిని పాశవికంగా హత్య చేసి, ఆ తరువాత తాపీగా పోలీసు హెల్ప్ లైన్ నంబర్ కు ఫోన్ చేశాడు. బెంగళూరులోని జాలహళ్లికి చెందిన నిందితుడు తన భార్య భాగ్య (36), కుమార్తె నవ్య (19), మేనకోడలు హేమావతి (23)లను దారుణంగా హత్య చేశాడు.
Bengaluru Crime news: బెంగళూరులో స్థానికంగా హోంగార్డు గా పని చేస్తున్న 42 ఏళ్ల వ్యక్తి బుధవారం తన ముగ్గురు కుటుంబ సభ్యులను దారుణంగా హత్య చేశాడు. అనంతరం, హెల్ప్ లైన్ నంబర్ 112 కు ఫోన్ చేసి సమాచారమిచ్చాడు. పోలీసులు ఘటనా స్థలికి వచ్చేసరికి బాధితులు విగత జీవులుగా, రక్తపు మడుగులో పడి ఉన్నారు.
కొడవలితో నరికి..
తన భార్య, కూతురు, మేనకోడలిని కొడవలితో నరికి, హత్య చేసిన అనంతరం గంగరాజు అనే నిందితుడు హత్యకు ఉపయోగించిన ఆయుధంతో పాటు పీణ్య పోలీస్ స్టేషన్ కు వచ్చి నేరాన్ని అంగీకరించి, లొంగిపోయాడు. జాలహళ్లి క్రాస్ సమీపంలోని చొక్కసంద్రకు చెందిన నిందితుడు గంగరాజు తన భార్య భాగ్య (36), కుమార్తె నవ్య (19), మేనకోడలు హేమావతి (23)లను హత్య చేశాడు. ఉత్తర బెంగళూరులోని వారి అద్దె ఇంట్లో ఈ దారుణం జరిగింది. ఆయనను అరెస్టు చేసి భారతీయ న్యాయ సంహిత కింద అభియోగాలు మోపారు. పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, హెబ్బగోడి పోలీస్ స్టేషన్ లో హోం గార్డుగా విధులు నిర్వహిస్తున్న గంగరాజు బుధవారం సాయంత్రం 4 గంటలకు ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నంబర్ 112 కు ఫోన్ చేసి, తను తన కుటుంబంలోని ముగ్గురిని హత్య చేసినట్లు తెలిపాడు. వెంటనే ఆయన నివాసానికి చేరుకున్న పోలీసు బృందాలకు అక్కడ రక్తపు మడుగులో పడి ఉన్న మూడు మృతదేహాలు కనిపించాయి. అయితే, ఆ సమయంలో నిందితుడు ఘటనాస్థలంలో లేడు. నిందితుడు గంగరాజు లొంగిపోవడానికి పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు.
ఈ హత్యలకు కారణమేంటి?
కుటుంబ కలహాలే ఈ హత్యలకు కారణమని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఫోరెన్సిక్ బృందాలు ఇంటి నుంచి ఆధారాలు సేకరించాయని, అయితే కచ్చితమైన కారణం ఇంకా తెలియాల్సి ఉందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (నార్త్) సైదులు అదావత్ తెలిపారు. గంగరాజు తన భార్యకు అక్రమ సంబంధం ఉందని అనుమానించాడని, ఇది తరచూ గొడవలకు దారితీసిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. బుధవారం వాగ్వాదం ముదరడంతో ఆగ్రహానికి గురై భాగ్యపై దాడి చేశాడు. ఆమెను రక్షించేందుకు నవ్య, హేమావతి జోక్యం చేసుకోవడంతో వారు కూడా ఈ దాడికి బలయ్యారని పోలీసులు తెలిపారు. నేలమంగళకు చెందిన గంగరాజు ఉద్యోగరీత్యా బెంగళూరు (bengaluru news) లో ఉంటున్నాడు.