firecracker: ఆటోను సొంతం చేసుకోవడం కోసం.. టపాసుల డబ్బాపై కూర్చుని..; చాలెంజ్ లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు-bengaluru man dies after sitting on a firecracker box as a part of challenge ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Firecracker: ఆటోను సొంతం చేసుకోవడం కోసం.. టపాసుల డబ్బాపై కూర్చుని..; చాలెంజ్ లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు

firecracker: ఆటోను సొంతం చేసుకోవడం కోసం.. టపాసుల డబ్బాపై కూర్చుని..; చాలెంజ్ లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు

Sudarshan V HT Telugu
Nov 05, 2024 04:12 PM IST

Bengaluru news: దీపావళి సందర్భంగా బెంగళూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. చాలెంజ్ లో గెలిచి, ఆ డబ్బుతో ఆటో కొనుక్కోవాలనుకున్ ఒక యువకుడు.. ఏకంగా ప్రాణాలే కోల్పోయాడు.ఈ ఘటన బెంగళూరులోని కోననకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకోగా, ఆరుగురిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు.

బెంగళూరు వ్యక్తి మృతి
బెంగళూరు వ్యక్తి మృతి (Screengrab from viral video)

Bengaluru news: బెంగళూరుకు చెందిన 32 ఏళ్ల వ్యక్తి బాణసంచా పెట్టెపై కూర్చొని ఉండగా, అతడి స్నేహితులు ఆ టపాసుల పెట్టెను పేల్చడంతో, తీవ్రగాయాల పాలైన ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. బాణాసంచా పెట్టెపై కూర్చోవాలని, దాన్ని తాము వెలిగిస్తామని, ఈ సవాలులో గెలిస్తే, ఆటో రిక్షా సొంతమవుతుందని అతడి స్నేహితులు చాలెంజ్ చేయడంతో ఆ యువకుడు ఆ దుస్సాహసానికి ఒడిగట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

వైరల్ గా వీడియో

టపాసుల పెట్టెపై ఆ యువకుడు కూర్చోవడం, దాన్ని అతడి స్నేహితులు వెలిగించడం, అవి భారీ శబ్దంతో పేలడం వంటి దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డయ్యాయి. ఆ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది. సమాచారం తెలియడంతో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. మృతుడిని శబరీష్ గా గుర్తించారు.

దీపావళి రాత్రి

ఈ సంఘటన దీపావళి (deepavali) రాత్రి జరిగింది. శబరీష్ తన స్నేహితులతో కలిసి మద్యం మత్తులో ఈ ప్రమాదకర ఆట ఆడాలని నిర్ణయించుకున్నాడు. వైరల్ వీడియోలో, శబరీష్ శక్తివంతమైన టపాసుల పెట్టెపై కూర్చుని చుట్టూ భారీ మంటలతో పేలుతున్నాడు. దట్టమైన పొగ మధ్య అక్కడే కుప్పకూలిపోయిన ఆయనను ఆస్పత్రికి తరలించారు. చికిత్స ఫలించకపోవడంతో శబరీష్ నవంబర్ 2న మృతి చెందాడు. ఈ ఘటన కోననకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకోగా, ఆరుగురిని బెంగళూరు (bengaluru) పోలీసులు అరెస్టు చేశారు. నిందితులందరిపై హత్యానేరం కింద కేసు నమోదు చేశారు.

కేసు నమోదు

ఆరుగురిని అరెస్టు చేశామని, వారిని కోర్టులో హాజరుపరుస్తామని డిప్యూటీ పోలీస్ కమిషనర్ (దక్షిణ బెంగళూరు) విలేకరులకు తెలిపారు. దీనిపై తదుపరి విచారణ కొనసాగుతోంది' అని పేర్కొన్నారు. దీపావళి రోజు రాత్రి టపాసుల సంబంధిత ప్రమాదాల కారణంగా బెంగళూరులో 150 మందికి పైగా గాయపడ్డారని కర్ణాటక ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. వీరు బెంగళూరులోని వివిధ ప్రాంతాల్లో చికిత్స పొందుతున్నారని, వీరిలో ఎక్కువ మంది కంటికి సంబంధించిన ప్రమాదాలేనని తెలిపారు. మరో ఘటనలో రోడ్డుపై టపాసులు కాల్చి ఇతరులపైకి విసిరిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.

Whats_app_banner