బెంగళూరులోని యలహంక సమీపంలోని శివనహళ్లికి చెందిన 36 ఏళ్ల వైద్యురాలు క్యాబిన్ సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాన్ని కూల్చివేస్తానని బెదిరించినందుకు ఆమెను పోలీసులు విమానం నుంచి కిందకు దింపి, కేసు నమోదు చేశారు.
మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో సూరత్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి బయల్దేరాల్సిన ఐఎక్స్ 2749 విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వ్యాస్ హీరాల్ మోహన్ భాయ్ అనే ప్రయాణికురాలు తన 20ఎఫ్ సీటు వద్ద తన సామానును దారి మధ్యలో పెట్టారు. ఆ లగేజీని తీసి తన సీటుకు సమీపంలో ఉన్న ఓవర్ హెడ్ కంపార్ట్ మెంట్ లో ఉంచాలని సిబ్బంది కోరగా, ఆమె నిరాకరించారు. సిబ్బంది పలుమార్లు హెచ్చరించినా, పైలట్ జోక్యం చేసుకున్నా మోహన్ భాయ్ సహకరించకుండా దురుసుగా ప్రవర్తించడం ప్రారంభించారు. తనను శాంతింపజేసేందుకు ప్రయత్నించిన తోటి ప్రయాణికులపై కూడా ఆమె కేకలు వేశారు.
చివరకు, విమానాన్ని పేల్చి వేస్తానని ఆమె బెదిరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పైలట్, క్యాబిన్ సిబ్బంది సెక్యూరిటీ, సీఐఎస్ఎఫ్ సిబ్బందిని అప్రమత్తం చేయడంతో వారు వెంటనే ఆమెను విమానం నుంచి ఆమెను కిందకు దింపేశారు. ఆమెపై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 351 (4) (అజ్ఞాత కమ్యూనికేషన్ ద్వారా నేరపూరిత బెదిరింపు) మరియు 353 (1) (బి) (బహిరంగ దుశ్చర్య ప్రకటనలు) అలాగే విమానంలో ఒక వ్యక్తిపై హింసా చర్య, పౌర విమానయాన భద్రతకు వ్యతిరేకంగా చట్టవ్యతిరేక చర్యలను అణచివేయడం కింద కేసు నమోదు చేశారు. మరో ఘటనలో శ్రీనగర్ కు చెందిన సదాద్ మహమ్మద్ బాబా (22) బెంగళూరు విమానాశ్రయంలోని టెర్మినల్ 1లోని డిపార్చర్ గేట్ 8 గుండా వెళ్లేందుకు ప్రయత్నించాడు. అనధికారిక ప్రవేశాన్ని ఆపడానికి సీఐఎస్ఎఫ్ సిబ్బంది జోక్యం చేసుకోవడంతో బాబా భద్రతా సిబ్బందిలో ఒకరిని తోసేశాడు.
సంబంధిత కథనం