కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన ఒక అత్యంత దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది! సిగరెట్ కొనివ్వలేదన్న కోపంతో, ఓ వ్యక్తి- మరో వ్యక్తిని తన కారుతో ఢీకొట్టి చంపేశాడు. వీరిద్దరికి అసలు పరిచయమే లేకపోవడం గమనార్హం.
విజరహళ్లికి చెందిన 29ఏళ్ల సంజీవ్ ఓ టెక్ కంపెనీలో పనిచేస్తున్నాడు. మే10న సంజయ్, తన స్నేహితుడు చేతన్ పుజామథ్తో కలిసి సిగరెట్ తాగేందుకు అర్థరాత్రి వేళ ఆఫీస్ నుంచి బైక్ మీద బయటకు వెళ్లాడు. ఇద్దరు కలిసి కనకపుర రోడ్డు దగ్గర ఉన్న వసంతపుర క్రాసింగ్ వద్ద సిగరెట్ కొని, తాగుతున్నారు. ఆ సమయంలో వారి ముందు ఒక కారు వచ్చి ఆగింది. విండో తీసిన డ్రైవర్, కారు దిగకుండానే.. తనకు ఒక సిగరెట్ కొనివ్వాలని సంజయ్‌ని అడిగాడు. సంజయ్ ఒప్పుకోలేదు. అంతేకాదు, కారులో నుంచి బయటకి రావడానికి బద్ధకమా అన్నట్టు మాట్లాడాడని సమాచారం.
ఇది కారులో కూర్చున్న వ్యక్తికి కోపం తెప్పించింది. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇద్దరిని విడదీసేందుకు చేతన్ సహా స్థానికులు ప్రయత్నించారు. కొంతసేపటికి ఇద్దరు అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
అయితే, సంజీవ్- చేతన్‌లను ఆ వ్యక్తి వెంబడించాడు. సంజీవ్ తన బైక్ తీసి ఆఫీసుకు వెళుతుండగా, ఆ వ్యక్తి వెనుక నుంచి ఆ వెహికిల్‌ని బలంగా ఢీకొట్టాడు.
ఈ ఘటనలో సంజీవ్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు. ఘటన జరిగిన సమయంలో బైక్ వెనక కూర్చున్న చేతన్‌కి కూడా బలమైన గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. స్థానిక సీసీటీవీ ఫూటేజ్ని పరిశీలించారు. నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో నిందితుడి ఆచూకీ లభించింది. అతని పేరు ప్రతీక్. వయస్సు 31ఏళ్లు. రాజరాజేశ్వరి నగర్లో నివాసముంటున్నాడు. అతను ఒక ప్రైవేట్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు.
కాగా ఘటన జరిగిన సమయంలో ప్రతీక్ మద్యం మత్తులో ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీ తర్వాత తన భార్యతో కలిసి ఇంటికి తిరిగి వెళుతున్నప్పుడు ఈ ఘటన జరిగిందని సమాచారం.
పోలీసులు ప్రతీక్‌ని అరెస్ట్ చేశారు.
ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు వైరల్ మారింది. ఈ వార్త విన్న ప్రజలు షాక్‌కి గురువుతున్నారు.
సంబంధిత కథనం