Crime news: బ్లాక్ మెయిల్ చేసి క్లాస్ మేట్ నుంచి రూ.35 లక్షలు లాక్కున్న టెంత్ క్లాస్ విద్యార్థులు
Bengaluru Crime news: పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు తన క్లాస్ మేట్ ను బ్లాక్ మెయిల్ చేసి, అతడి నుంచి రూ.35 లక్షల విలువైన బంగారు ఆభరణాలు తీసుకున్నారు. ఈ నేరంతో సంబంధం ఉన్న అనుమానిత విద్యార్థులు, ఇతర వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
Bengaluru Crime news: సహ విద్యార్థిని బెదిరించి, అతడి నుంచి ఇద్దరు విద్యార్థులు రూ. 35 లక్షల విలువైన బంగారు ఆభరణాలను లాక్కున్న ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. ఈ నేరం వెలుగు చూడడంతో నిందితులను, వారికి సహకరించిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆన్ లైన్ గేమింగ్ వ్యసనం
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరులోని ఒక ప్రముఖ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి ఆన్ లైన్ గేమ్ లకు బానిస అయ్యాడు. ఆ వ్యసనంతో తన తల్లిదండ్రులకు చెందిన కొంత డబ్బును నష్టపోయాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న అతడి క్లాస్ మేట్స్ ఇద్దరు ఆ విద్యార్థిని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించారు. అతడి నుంచి పలు విడతలుగా రూ.35 లక్షల విలువైన 700 గ్రాముల బంగారు ఆభరణాలను ఆ ఇద్దరు విద్యార్థులు లాక్కున్నారు. ఇంట్లో ఆభరణాలు మిస్ కావడం గమనించిన తల్లిదండ్రులు ఆ విద్యార్థిని ప్రశ్నించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దాంతో, వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని జువైనల్ ఫెసిలిటీలో ఉంచారు. ఆ బంగారు ఆభరణాలను అమ్మడానికి సహకరించిన మరో నిందితుడు జువైనల్ కస్టడీలో ఉన్నాడు.
సహకరించిన వారిని కూడా..
నిందితులైన విద్యార్థులతో పాటు, వారికి సహకరించిన ఇతర వ్యక్తులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో వడ్డారహళ్లికి చెందిన ఎం.కార్తీక్ కుమార్ (32), ఎస్ .సునీల్ (32)లను పోలీసులు అరెస్టు చేశారు. వీరిద్దరూ కాకుండా, మరో ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేరంలో ఓ కాలేజ్ స్టూడెంట్ ప్రమేయం కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బంగారు ఆభరణాలను విక్రయించడానికి నిందితుడికి ఆ కాలేజ్ స్టుడెంట్ సహాయం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
బ్లాక్ మెయిలింగ్ ద్వారా దోపిడీ
బెంగళూరులో నివసిస్తున్న సివిల్ కాంట్రాక్టర్ కుమారుడి నుంచి నిందితులు డబ్బులు, నగలు వసూలు చేస్తున్నట్లు తమకు ఫిర్యాదు అందిందని పోలీసులు తెలిపారు. పోలీసులు ఇప్పటివరకు నిందితుల నుంచి దాదాపు 23 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 300 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. బాధిత కుటుంబానికి చెందిన డైమండ్ నెక్లెస్ ఆచూకీ ఇంకా తెలియరాలేదు. పిల్లల ప్రవర్తన, వారి ఫ్రెండ్స్ పట్ల కొంత అప్రమత్తంగా ఉండాలని బెంగళూరు పోలీసు కమిషనర్ బి.దయానంద తల్లిదండ్రులను కోరారు. సోషల్ మీడియాలో తమ పిల్లల యాక్టివిటీ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని కోరారు.