DK Shivkumar : నిబంధనలు అతిక్రమించిన డిప్యూటీ సీఎంకు రూ. 50వేల ఫైన్!
DK Shivkumar latest news : కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు అధికారులు ఫైన్ విధించారు. అసలు విషయం ఏంటంటే..
DK Shivakumar latest news : అధికార పక్షంలోని సీనియర్ నేతకు జరిమానా పడిన అరుదైన సంఘటనకు బెంగళూరు వేదికగా నిలిచింది! కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద అక్రమంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారన్న కారణంగా.. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు రూ. 50వేల జరిమానా విధించారు అధికారులు.
ట్రెండింగ్ వార్తలు
ఇదీ జరిగింది..
కర్ణాటకలో కొన్ని నెలల క్రితమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది. పార్టీ సీనియర్ నేత డీకే శివకుమార్ డిప్యూటీ సీఎంగాను, బెంగళూరు అభివృద్ధి మంత్రిగాను ప్రమాణం చేశారు. కాగా.. బెంగళూరులో ఫ్లేక్సీ సమస్యలకు సంబంధించి ఆయన ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. నగరంలో అక్రమంగా ఫ్లేక్సీల ఏర్పాటును నిషేధించారు. ఫ్లేక్సీలను ఏర్పాటు చేయకూడదని రాజకీయ నేతలను అభ్యర్థించారు. ఒక వేళ నిబంధనలను అతిక్రమించి అక్రమంగా ఫ్లేక్సీలు ఏర్పాటు చేస్తే, బృహత్ బెంగళూరు మహానగర పాలిక.. సంబంధిత వ్యక్తులపై రూ. 50వేల ఫైన్ విధిస్తుందని తేల్చిచెప్పారు.
ఫైన్ గురించి డీకే శివకుమార్ ప్రకటన చేసిన 13 రోజుల తర్వాత.. క్వీన్స్ రోడ్‌లోని కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఓ భారీ ఫ్లెక్సీ వెలిసింది! రాజీవ్ గాంధీ, మాజీ సీఎం డీ దేవరాజ్‌ల జయంతి నేపథ్యంలో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. పార్టీ నేతల ఫొటోలు కూడా ఆ ఫ్లెక్సీలో ఉన్నాయి. మరి శివకుమార్ ఆదేశించారో లేదో తెలియదు కానీ.. పార్టీకి చెందిన వెనకబడిన వర్గాల విభాగం, ఈ భారీ ఫ్లెక్సీని కార్యాలయం ఎదుట పెట్టింది.
ఇదీ చూడండి:- KSRTC: ఉచిత ప్రయాణం తిప్పలు.. సీటు కోసం బస్సులో మహిళల రచ్చ..!
ఈ విషయం బీబీఎంపీ దృష్టికి వెళ్లింది. అనుమతులు లేకుండా ఫ్లెక్సీని ఏర్పాటు చేశారని తెలుసుకుంది. వసంత్‌నగర్ సబ్ డివిజన్లోని ఏఆర్ఓ (అసిస్టెంట్ రెవెన్యూ ఆఫీసర్) నేతృత్వంలోని ఓ బృందం.. కేపీసీసీ కార్యాలయానికి వెళ్లి, ఫ్లెక్సీని పరిశీలించింది. అనంతరం డీకే శివకుమార్‌పై రూ. 50వేల ఫైన్‌ను విధించింది.
BBMP fines DK Shivakumar : "కేపీసీసీ కార్యాలయం వద్ద ఓ భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేసినట్టు మా దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్‌పై రూ. 50వేల జరిమానా విధిస్తున్నాము," అని బీబీఎంపీ ఓ ప్రకటనలో తెలిపింది.
కర్ణాటకలో విపక్ష పార్టీలు, ప్రజలకే కాదు అధికారంలో ఉన్న నేతలకు కూడా నిబంధనలు ఒకే విధంగా వర్తిస్తాయని ఈ సంఘటన చెబుతోంది.