సోమవారం కురిసిన భారీ వర్షాల కారణంగా బెంగళూరు నగరంలో చాలా ప్రధాన రహదారులపై నీరు నిలిచిపోయింది. దీనితో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. మంగళవారం, బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. సిల్క్ బోర్డు జంక్షన్ నుండి రూపేనా అగ్రహార వరకు హోసూరు రోడ్డును తీవ్రమైన వరదల కారణంగా తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు తెలిపారు.
"భారీగా నీరు నిలిచినందున, సిల్క్‌బోర్డ్ మరియు రూపేనా అగ్రహార మధ్య హోసూరు రోడ్డును తాత్కాలికంగా మూసివేశాం. ఎలివేటెడ్ ఫ్లైఓవర్‌ను కూడా మూసివేశాం" అని ప్రకటనలో పేర్కొన్నారు. ప్రయాణికులు హోసూరు రోడ్డును పూర్తిగా నివారించాలని, తదుపరి సూచన వచ్చే వరకు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు కోరారు.
ట్రాఫిక్ పోలీసులు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు. దారి మళ్లింపులను క్రమబద్దీకరించడానికి, చిక్కుకున్న వాహనదారులకు సహాయం చేయడానికి సిబ్బందిని నియమించారు. ట్రాఫిక్ పోలీసుల నుండి వచ్చే సమాచారాన్ని అనుసరించాలని, తమ ప్రయాణాన్ని దాని ప్రకారం ప్లాన్ చేసుకోవాలని ప్రయాణికులకు సూచించారు.
సోమవారం కురిసిన ఎడతెరిపి లేని వర్షాల కారణంగా బెంగళూరులో విద్యుత్ షాక్‌తో 12 ఏళ్ల బాలుడితో సహా ఇద్దరు వ్యక్తులు మరణించారు.
మరణించిన వారిని ఎన్ఎస్ పాల్యలోని మధువన్ అపార్ట్‌మెంట్స్‌లో నివాసం ఉండే మన్మోహన్ కామత్ (63), బీటీఎం సెకండ్ స్టేజ్ డాలర్స్ కాలనీలోని ఒక అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న నేపాల్ జాతీయుడు భరత్ కుమారుడు దినేష్ (12)గా గుర్తించారు.
బెంగళూరు సౌత్ ఈస్ట్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) సారా ఫాతిమా తెలిపిన వివరాల ప్రకారం, కామత్ తన అపార్ట్‌మెంట్ బేస్‌మెంట్ నుండి నీటిని బయటకు పంపడానికి మోటారును కనెక్ట్ చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురయ్యారు. సమీప ప్రాంతంలో దినేష్ కూడా విద్యుత్ షాక్‌తో మరణించాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు దర్యాప్తులో ఉన్నాయి.
కాగా, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ, నగరంలో 104 మిమీ వర్షపాతం నమోదైందని, ఇది "అంచనా వేసిన దానికంటే ఎక్కువ" అని అన్నారు. ఈ వర్షాల కారణంగా ఒక గోడ కూలి ఒక వ్యక్తి మరణించాడని ఆయన తెలిపారు. మృతుని కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ₹5 లక్షల పరిహారం అందిస్తుంది.
"మే 21న ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, నేను బెంగళూరు వ్యాప్తంగా వర్షాల వల్ల ప్రభావితమైన ప్రాంతాలను నగర ఎమ్మెల్యేలందరితో కలిసి పరిశీలిస్తాం," అని సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
ఈ మరణాలు నగరంలోని శిథిలమైన పట్టణ మౌలిక సదుపాయాలు, వర్షాకాలంలో పౌర సన్నద్ధత గురించి మరోసారి ఆందోళనలు రేకెత్తించాయి.