Death sentence for rape: మైనర్ పై హత్యాచారం చేసిన వ్యక్తికి మరణశిక్ష; నేరం జరిగిన రెండు నెలల్లోనే తీర్పు
Death sentence for rape: మైనర్ ను రేప్ చేసి, ఆ తరువాత దారుణంగా హత్య చేసిన ఒక 19 ఏళ్ల యువకుడికి పశ్చిమ బెంగాల్ లోని ఒక కోర్టు మరణశిక్ష విధించింది. నేరం జరిగిన రెండు నెలల్లోనే ఈ తీర్పు వెలువడడం గమనార్హం. ఈ కేసులో దోషిగా తేలిన ముస్తాకిన్ సర్దార్ ను నేరం జరిగిన కొన్ని గంటల్లోపే అరెస్టు చేశారు.
Death sentence for rape: పశ్చిమబెంగాల్లోని దక్షిణ 24 పరగణాల్లో అక్టోబర్ 4న తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన 19 ఏళ్ల యువకుడికి స్థానిక కోర్టు మరణశిక్ష విధించింది. కుల్తాలీ ప్రాంతంలో నేరం జరిగిన కొన్ని గంటల్లోనే నిందితుడు ముస్తాకిన్ సర్దార్ ను అక్టోబర్ 5న తెల్లవారుజామున 3 గంటలకు అరెస్టు చేశారు. దేశాన్ని కుదిపేసిన కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ఆగస్టు 9న 31 ఏళ్ల జూనియర్ డాక్టర్ పై అత్యాచారం, హత్య జరిగిన రెండు నెలల తర్వాత ఈ ఘటన జరిగింది.
స్థానికుల ఆగ్రహంం
బాధిత బాలికను అత్యాచారం చేసి, దారుణంగా హింసించి హత్య చేసిన ఘటనపై స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. అక్టోబర్ 5న గ్రామస్తులు స్థానిక పోలీసులపై దాడి చేసి స్థానిక మహిష్మారీ పోలీస్ ఔట్ పోస్టులోని కొంత భాగాన్ని తగలబెట్టారు. స్థానిక తృణమూల్ కాంగ్రెస్ లోక్ సభ సభ్యురాలు ప్రతిమా మొండల్ ను బాలిక కుటుంబాన్ని కలవకుండా అడ్డుకున్నారు. నిందితుడిని ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే అరెస్ట్ చేసిన పోలీసులు అతడిపై బీఎన్ఎస్ (భారతీయ న్యాయ సంహిత) సెక్షన్ 103, 66, పోక్సో (లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ) చట్టంలోని సెక్షన్ 6 కింద కేసులు నమోదు చేశారు.
ప్రైవేటు క్లాస్ కు వెళ్లి వస్తుండగా..
బాధిత బాలిక ప్రైవేట్ ట్యుటోరియల్ క్లాసుకు హాజరై తన ఇంటికి నడుచుకుంటూ తిరిగి వెళ్తోంది. నిందితుడు ముస్తాకిన్ సర్దార్ తన సైకిల్ పై ఆమెను ఇంటి వద్ద దింపుతానని చెప్పి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి, అత్యాచారం చేసి హత్య చేశాడు. సర్దార్ చిన్నారిని ఎత్తుకోవడాన్ని తాను చూశానని ఈ కేసులోని సాక్షుల్లో ఒకరు కోర్టులో చెప్పారు. ఆ వ్యక్తి సర్దార్ ను ప్రశ్నించగా కుటుంబ సభ్యుల సూచన మేరకు ఆమెను ఇంటి వద్ద డ్రాప్ చేయడానికి తీసుకువెళ్తున్నానని చెప్పాడు.
బాలిక శరీరంపై తీవ్ర గాయాలు..
బాధితురాలిని ముస్తాకిన్ సర్దార్ దారుణంగా హింసించినట్లు పోస్ట్ మార్టం నివేదికలో తేలింది. బాధితురాలి శరీరంపై 38 గాయాలు కనిపించాయి. ఆమె పుర్రె పగిలిపోయింది. చేయి విరిగిపోయింది. శాస్త్రీయ ఆధారాలు, డీఎన్ఏ పరీక్షల్లో సర్దార్ ఈ దారుణానికి పాల్పడినట్లు నిర్ధారణ అయింది. ఈ ఘటనపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అయ్యాయి. ఈ నేరంపై దర్యాప్తు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం బరూయిపూర్ పోలీసు సూపరింటెండెంట్ పలాష్ చంద్ర ధాలి నేతృత్వంలో ఎనిమిది మంది సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది.
61 రోజుల్లో తీర్పు
ఆ తరువాత 61 రోజుల పాటు కోర్టులో విచారణ సాగింది. పోక్సో కోర్టు న్యాయమూర్తి సుబ్రతా ఛటోపాధ్యాయ శుక్రవారం దోషికి మరణ శిక్ష విధిస్తున్నట్లు ప్రకటించారు. శిక్షను ప్రకటించే సమయంలో దోషిలో ఎటువంటి పశ్చాత్తాపం కనిపించలేదన్నారు. దోషికి మరణ శిక్ష తో పాటు బాధిత కుటుంబానికి రూ.10 లక్షల పరిహారాన్ని కోర్టు ప్రకటించింది. ‘‘మరణశిక్షతో మేం సంతోషంగా ఉన్నాం. అయితే దోషి ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి బెయిల్ పొందవచ్చు. ఇలాంటి ఘటనలు సర్వసాధారణం’’ అని బాధితురాలి తండ్రి మీడియాకు తెలిపారు.