Bengal coal scam: బొగ్గు స్కామ్‌లో 8 మంది ఐపీఎస్‌లకు ఈడీ పిలుపు-bengal coal scam ed summons 8 ips officers ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Bengal Coal Scam: Ed Summons 8 Ips Officers

Bengal coal scam: బొగ్గు స్కామ్‌లో 8 మంది ఐపీఎస్‌లకు ఈడీ పిలుపు

Praveen Kumar Lenkala HT Telugu
Aug 11, 2022 04:00 PM IST

Bengal coal scam: పశ్చిమ బెంగాల్ బొగ్గు కుంభకోణం కేసులో 8 మంది ఐపీఎస్ అధికారులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు పిలిచింది.

బొగ్గు స్కామ్‌లో 8 మంది ఐపీఎస్ అధికారులకు సమన్లు జారీచేసిన ఈడీ
బొగ్గు స్కామ్‌లో 8 మంది ఐపీఎస్ అధికారులకు సమన్లు జారీచేసిన ఈడీ (HT_PRINT)

పశ్చిమ బెంగాల్ బొగ్గు కుంభకోణం కేసులో జ్ఞానవంత్ సింగ్, కోటేశ్వరరావు, ఎస్.సెల్వమురుగన్, శ్యామ్ సింగ్, రాజీవ్ మిశ్రా, సుకేష్ కుమార్ జైన్, తథాగత బసు సహా ఎనిమిది మంది ఐపీఎస్ అధికారులకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసినట్లు సమాచారం. న్యూఢిల్లీ వచ్చి విచారణలో పాల్గొనాల్సిందిగా దర్యాప్తు సంస్థ అధికారులను కోరింది.

ట్రెండింగ్ వార్తలు

ఈడీ ముందు హాజరుకావడానికి ఐపీఎస్‌ అధికారులకు నిర్దిష్ట తేదీలు ఇచ్చారని వార్తా సంస్థ పీటీఐ నివేదించింది. వారిని ఆగస్టు 21 నుంచి ఆగస్టు 31 మధ్య ప్రశ్నించే అవకాశం ఉందని వార్తా సంస్థ ఏఎన్ఐ నివేదించింది.

‘బొగ్గు స్కామ్ కేసులో ఈ ఐపీఎస్ అధికారులు కీలక పాత్ర పోషించారు. ఈ అధికారులు కుంభకోణంతో లబ్ధి పొందినట్లు ఆధారాలు ఉన్నాయి. వీరంతా స్మగ్లింగ్ జరిగిన ప్రాంతాల్లోనే నియమితులయ్యారు..’ అని ఈడీ అధికారిని ఉటంకిస్తూ పీటీఐ పేర్కొంది.

ఎనిమిది మంది అధికారులలో ఏడుగురిని 2021లో కూడా ఏజెన్సీ పిలిపించింది. అధికారిక వాహనాల్లో జరిగిన నగదు రవాణాలో కొంతమంది పోలీసు అధికారులు కూడా పాల్గొన్నారని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఏఎన్ఐ నివేదించింది.

పశ్చిమ బెంగాల్ బొగ్గు కుంభకోణం కేసు ఏమిటి?

తృణమూల్ కాంగ్రెస్ యువనేత వినయ్ మిశ్రా ఈ కేసులో ప్రధాన నిందితుడు. స్థానిక బొగ్గు ఆపరేటర్ అనుప్ మాఝీ కూడా ఈ కేసులో ప్రధాన నిందితుడు.

ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి ఈయన అత్యంత సన్నిహితుడు. మార్చిలో ఈడీ అభిషేక్ బెనర్జీని కూడా ప్రశ్నించింది.

బొగ్గు అక్రమ రవాణా కేసుపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విచారణ ప్రారంభించగా, ఈడీ సమాంతర దర్యాప్తు ప్రారంభించింది.

నవంబర్ 2020లో సీబీఐ కేసు నమోదు చేసింది. ‘ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ పశ్చిమ బెంగాల్‌లోని పశ్చిమ ప్రాంతాల్లో అనేక గనులు నడుపుతోంది. ఈప్రాంతంలోనే ఓ ముఠా వేల కోట్ల రూపాయల విలువైన బొగ్గును అక్రమంగా తవ్వి అనేక సంవత్సరాలుగా బ్లాక్ మార్కెట్‌లో బొగ్గు విక్రయిస్తోంది’ అని ఆరోపించింది.

ఫిబ్రవరి 21, 2021న సీబీఐ బృందం అభిషేక్ ఇంటికి వెళ్లి అతని భార్య రుజీరా, అతని కోడలు మేనకా గంభీర్‌లకు ఈ కేసులో సంబంధం ఉందనే ఆరోపణలపై సమన్లు పంపింది.

రాష్ట్రంలోని కునుస్టోరియా, కజోరా ప్రాంతాల్లో అసన్సోల్, చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ గనులకు సంబంధించిన బొగ్గు దోపిడీకి గురవుతోందని సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా పీఎంఎల్ నిబంధనల ప్రకారం ఈడీ కూడా కేసు నమోదు చేసింది.

అభిషేక్ బెనర్జీ ఈ అక్రమ వ్యాపారం నుండి నిధులు పొందాడని ఈడీ అభియోగాలు మోపింది. ఈ కేసులో ఇప్పటి వరకు ఇద్దరిని అరెస్ట్ చేసింది.

IPL_Entry_Point