బళ్ళారి: కర్ణాటకలో బర్డ్ ఫ్లూ భయం రోజురోజుకు పెరుగుతోంది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. మొదట ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బర్డ్ ఫ్లూ వ్యాపించింది. తరువాత మహారాష్ట్ర, కర్ణాటకలో కూడా వ్యాపిస్తోంది. ఇది పౌల్ట్రీ పరిశ్రమపైనా ప్రభావం చూపింది. చికెన్ ధరలు తగ్గించినప్పటికీ, ప్రజలు కొనడానికి వెనుకాడుతున్నారు. బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందే భయం ఉన్నందున చికెన్ కొనడానికి వెనుకాడుతున్నారు.
ఉత్తర కర్ణాటకలోని అనేక ప్రాంతాల్లో కోళ్లు చనిపోతున్నాయి. బళ్ళారి జిల్లాలో బర్డ్ ఫ్లూ భయం ఎక్కువగా ఉంది. కప్పగల్లు గ్రామంలో ఓ వ్యక్తికి చెందిన 8000 కోళ్లు చనిపోయాయి. ఈ ఘటన తర్వాత అధికారులు అప్రమత్తమయ్యారు. కోళ్ల ఫామ్‌కు వచ్చి అధికారులు పరిశీలించారు. మూడు రోజుల వ్యవధిలో 8000 కోళ్లు చనిపోయినట్టు గుర్తించారు.
ఫామ్‌లో మొత్తం 15000 కోళ్లు ఉన్నాయి. వీటిలో 8000 కోళ్లు చనిపోవడంతో మిగిలిన 7000 కోళ్లను ముందు జాగ్రత్తగా చంపేశారు. బలహీనంగా ఉన్న కోళ్లు చనిపోయే దశలో ఉన్నందున జాగ్రత్త చర్యగా వాటిని పూడ్చేసినట్టు స్థానిక వార్తాపత్రికలు నివేదించాయి.
కోళ్లను నిర్మూలించిన తర్వాత కప్పగల్లు గ్రామంలో కోళ్ల దుకాణాలను మూసివేశారు. బ్లీచింగ్ పౌడర్‌ను చల్లించి శుభ్రతకు ప్రాధాన్యతనిచ్చారు. గ్రామంలో ఆశా కార్యకర్తలు సర్వే చేసి ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఎవరికీ జ్వరం లక్షణాలు కనిపించలేదు. పరీక్ష కోసం పంపిన కోళ్ల నమూనాల నివేదిక, నేడు (సోమవారం) రానుందని అధికారులు తెలిపారు.
ఇటీవలే బళ్ళారి జిల్లా సండూరు తాలూకా కురేకుప్ప గ్రామం సమీపంలోని ప్రభుత్వ పౌల్ట్రీ ఫామ్‌లో సుమారు 2100 కోళ్లు బర్డ్ ఫ్లూతో చనిపోయాయి. కేసులు ధృవీకరించిన తర్వాత అధికారులు కురేకుప్ప గ్రామం చుట్టుపక్కల ఒక కిలోమీటర్ దూరాన్ని ప్రమాదకర ప్రాంతంగా గుర్తించారు. అలాగే 10 కిలోమీటర్ల వ్యాప్తిలోని ప్రాంతాన్ని పర్యవేక్షణ ప్రాంతంగా గుర్తించారు.
సంబంధిత కథనం
టాపిక్