Ranveer Allahabadia : ‘తల్లిదండ్రులు అది చేస్తుంటే చూస్తావా’?- ప్రముఖ యూట్యూబర్ వ్యాఖ్యలపై దుమారం!
Beerbiceps controversy : తల్లిదండ్రుల లైంగిక సంబంధంపై ప్రముఖ యూట్యూబర్ రణ్వీర్ అలహాబాదియా చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. ఆయనతో పాటు ఇండియాస్ గాట్ లేటెంట్ షోపై పోలీసులకు ఫిర్యాదు అందింది. అసలేం జరిగిందంటే..

ప్రముఖ యూట్యూబ్ ఛానెల్ బీర్బైసెప్స్కి చెందిన రణ్వీర్ అలహాబాదియా చిక్కుల్లో పడ్డారు! ‘ఇండియాస్ గాట్ లేటెంట్ షో’లో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవ్వడం ఇందుకు కారణం. "తల్లిదండ్రులు శృంగారం చేస్తున్న సమయంలో చూస్తావా?" అంటూ ఆయన అడిగిన ప్రశ్నపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ముంబై కమిషనర్, మహారాష్ట్ర మహిళా కమిషన్‌కు రణ్‌వీర్‌కి వ్యతిరేకంగా ఫిర్యాదులు అందాయి.
అసలేం జరిగింది..?
సమయ్ రైనా నిర్వహించే ఇండియాస్ గాట్ లేటెంట్ షోలో కంటెంట్ క్రియేటర్లు ఆశిష్ చంచ్లానీ, జస్ప్రీత్ సింగ్, అపూర్వ ముఖిజాతో పాటు బీర్‌బైసెప్స్ పాడాక్యాస్టర్ రణ్వీర్ అలహాబాదియా పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఒక కంటెస్టెంట్‌కి ఆయన వేసిన ప్రశ్న వివాదాస్పదంగా మారింది.
“మీ తల్లిదండ్రులు శృంగారంలో పాల్గొనడాన్ని జీవితం మొత్తం చూస్తావా? లేక ఒకసారి జాయిన్ అయ్యి, జీవితం మొత్తం చూడకుండా ఉంటావా?” అని రణ్వీర్ అడిగారు. అక్కడనున్న వారందరు ఈ మాటలు విని ఒక్కసారిగా షాక్ అయ్యారు. డార్క్ హ్యూమర్ చేసే సమయ్ రైనా కూడా షాక్‌కి గురయ్యారు. 'రణ్‌వీర్‌కి ఏమైంది?" అని అన్నారు.
షోలో పాల్గొన్నవారందరు బీర్‌బైసెప్స్ రణ్వీర్ మాటలను ఫన్నీగా తీసుకుని ఉండొచ్చు. కానీ ఆ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అది చూసిన చాలా మంది నెటిజన్లు రణ్‌వీర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రుల మధ్య లైంగిక లేదా సన్నిహిత సంబంధం గురించి తప్పుగా మాట్లాడారని విమర్శిస్తున్నారు.
“ఈ రణ్వీర్ తన పాడ్‌క్యాస్ట్‌లో సనాతనం గురించి మాట్లాడతాడు. కానీ అది ఆయన పాటించడు. ఆ టాపిక్ ట్రెండింగ్‌లో ఉంది కాబట్టి, కేవలం డబ్బుల కోసమే సనాతన ధర్మాన్ని పాటించే వారిని తీసుకొస్తాడు. అతని విలువలు, అతని ప్రవర్తనకు సంబంధమే లేదు. ఆధ్యాత్మికత గురించి మర్చిపోండి, ఈయన వ్యూస్ సమాజానికి మంచివి కావు. ఏ జోక్ వేయాలి? ఎలాంటి జోక్ వేయాలి? అన్నది కూడా ఈయనకు తెలియదు," అని ఒకరు కామెంట్ చేశారు.
రణ్వీర్తో పాటు ఇతరులపై కేసు..!
బీర్‌బైసెప్స్ రణ్వీర్ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఇద్దరు ముంబై లాయర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇండియాస్ గాట్ లేటెంట్ షోలో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముంబై కమిషనర్, మహారాష్ట్ర మహిళా కమిషన్‌కి ఫిర్యాదు చేశారు.
రణ్వీర్ అలహాబాదియా సహా ఇతర కామిక్స్‌పై ఎఫ్ఐఆర్ వేయాలని లాయర్లు ఆశిష్ రాయ్, పంకజ్ మిశ్రాలు డిమాండ్ చేశారు. వారి వ్యాఖ్యలు మహిళను కించపరిచే విధంగా ఉన్నాయని, కచ్చితంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
దేవేంద్ర ఫడణవీస్ స్పందన..
బీర్‌బైసెప్స్ రణ్వీర్ చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ని విలేకరులు ప్రశ్నించారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. 'ఈ విషయం నాకు ఇందాకే తెలిసింది. నేను ఇంకా చూడలేదు. కొన్ని విషయాలను తప్పుగా చెప్పి ప్రెజెంట్ చేశారు. ప్రతి ఒక్కరికీ వాక్ స్వాతంత్ర్యం ఉంటుంది. కానీ ఇతరుల స్వేచ్ఛను ఆక్రమించినప్పుడు మన స్వేచ్ఛ ముగుస్తుంది," అని అన్నారు.
భారతీయ సమాజానికి కొన్ని నిబంధనలు ఉన్నాయని, ఎవరైనా వాటిని ఉల్లంఘిస్తే అది పూర్తిగా తప్పని, వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.
సంబంధిత కథనం