పరీక్షలో తప్పు రాశాడని కొట్టిన టీచర్.. విద్యార్థి మృతి!
అతనో టీచర్. విద్యార్థులు తప్పు చేస్తే మందలించాల్సిన బాధ్యత అతనిది. ఆ బాధ్యతను అతను చాలా సీరియస్‌గా తీసుకున్నాడు! పరీక్షలో తప్పులు రాశాడన్న కారణంతో.. ఓ విద్యార్థిని చితకబాదేశాడు. ఆ 15ఏళ్ల బాలుడు.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వీడాడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పరీక్షలో తప్పు రాశాడన్న కారణంతో.. ఓ విద్యార్థిని చితకబాదాడు ఓ టీచర్. ఆ 15ఏళ్ల విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు!
పరీక్షలో తప్పు రాశాడని..!
ఔరయాలోని వైషోలి గ్రామంలో నివాసముంటున్న 15ఏళ్ల నిఖిల్.. ఫపుండ్ రోడ్డులోని ఆదర్శ్ ఇంటర్ కాలేజీలో చదువుకుంటున్నాడు. అతని తండ్రి రాజు దోహ్రే సమాచారం ప్రకారం.. సోషల్ టీచర్ అశ్విని సింగ్.. ఈ నెల 7న ఓ పరీక్ష నిర్వహించాడు. పరీక్షలో నిఖిల్ ఓ తప్పు రాశాడు. అందుకు కోపం తెచ్చుకున్న అశ్విని సింగ్.. నిఖిల్‌పై విరుచుకుపడ్డాడు. దారుణంగా కొట్టాడు. బాలుడు స్పృహ తప్పి పడిపోయాడు.
ఘటనపై సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు.. స్కూల్‌కు చేరుకున్నారు. కానీ బాలుడిని చూసేందుకు యాజమాన్యం ఒప్పుకోలేదు! కొద్దిసేపు జరిగిన నిరసనల తర్వాత చివరికి బాలుడిని అప్పజెప్పారు కాలేజీ సిబ్బంది.
తీవ్ర గాయాలపాలైన బాలుడిని స్థానికంగా ఉండే ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబసభ్యులు. అక్కడి నుంచి సైఫై ప్రాంతంలోని మరో ఆసుపత్రికి తీసుకెళ్లారు.
చికిత్స పొందుతున్న క్రమంలో.. బాలుడు, టీచర్ గురించి కొన్ని విషయాలు తండ్రికి చెప్పాడు. 'టీచర్ నన్ను చాలా సార్లు బెదిరించాడు. కులం పేరుతో దూషించాడు,' అని తండ్రికి చెప్పాడు నిఖిల్.
కాగా.. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న నిఖిల్.. సోమవారం మరణించాడు.
ఘటనపై స్థానికులు, బాలుడి కుుటంబసభ్యులు తీవ్రంగా స్పందించారు. నిరసనకు దిగారు. ఫలితంగా వైషోలి గ్రామంలో పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు ఔరయా పోలీసులు. టీచర్‌ను అరెస్ట్ చేయాలంటూ.. భీమ్ ఆర్మీ సభ్యులు గ్రామంలో నిరసనలు చేపట్టారు.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు అశ్విన్‌ని పట్టుకునేందుకు ప్రయత్నించారు. కానీ అతను అప్పటికే పారిపోయాడు! అతడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలను చేపట్టినట్టు అధికారులు స్పష్టం చేశారు.
మరోవైపు కాలేజీకి వెళ్లిన పోలీసులు.. క్లాస్‌రూమ్‌ను, సంబంధిత ఆన్సర్ షీట్లు ఉన్న గదిని సీజ్ చేశారు.
సంబంధిత కథనం