మావోయిస్ట్ అగ్రనేత బసవరాజు అలియాస్ నంబాల కేశవరావు హతమైనట్లు ప్రకటించిన అమిత్ షా; ఎవరు ఈ నంబాల కేశవరావు?-basavaraju backbone of maoist movement killed in bastar who is basavaraju alias nambala keshav rao ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  మావోయిస్ట్ అగ్రనేత బసవరాజు అలియాస్ నంబాల కేశవరావు హతమైనట్లు ప్రకటించిన అమిత్ షా; ఎవరు ఈ నంబాల కేశవరావు?

మావోయిస్ట్ అగ్రనేత బసవరాజు అలియాస్ నంబాల కేశవరావు హతమైనట్లు ప్రకటించిన అమిత్ షా; ఎవరు ఈ నంబాల కేశవరావు?

Sudarshan V HT Telugu

భద్రతాబలగాలతో బుధవారం తెల్లవారుజామున చత్తీస్ గఢ్ లోని నారాయణ పూర్ అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో మావోయిస్ట్ అగ్రనేత, మావో ఉద్యమానికి వెన్నెముక వంటి బసవరాజు అలియాస్ నంబాల కేశవరావు మరణించాడని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు.

మావోయిస్ట్ అగ్రనేత బసవరాజు అలియాస్ నంబాల కేశవరావు

ఛత్తీస్ గఢ్ లోని అబూజ్ మఢ్ అడవుల్లో భద్రతా దళాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో సీపీఐ (మావోయిస్టు) ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు హతమైనట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఛత్తీస్ గఢ్ లోని బస్తర్ ప్రాంతంలో బుధవారం భద్రతా దళాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో మరణించిన 27 మంది మావోయిస్టుల్లో బసవరాజు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు.

ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్

బసవరాజు మావోయిస్టు ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచారని అమిత్ షా అన్నారు. నక్సలిజాన్ని నిర్మూలించే పోరాటంలో బసవరాజు మరణం ఒక మైలురాయిగా హోం మంత్రి అభివర్ణించారు. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ పూర్తయిన తర్వాత 54 మంది నక్సలైట్లను అరెస్టు చేశామని, ఛత్తీస్ గఢ్, తెలంగాణ, మహారాష్ట్రల్లో 84 మంది నక్సలైట్లు లొంగిపోయారని తెలిపారు. 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని నిర్మూలించాలని మోదీ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని అమిత్ షా తెలిపారు.

ప్రధాని మోదీ స్పందన

భద్రతా దళాలు అద్భుత విజయం సాధించడం గర్వకారణమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. "మావోయిజం ముప్పును తొలగించడానికి, మా ప్రజలకు శాంతి మరియు పురోగతితో కూడిన జీవితాన్ని నిర్ధారించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది" అని షా ప్రకటనను ఉటంకిస్తూ ఆయన ఒక పోస్ట్ లో పేర్కొన్నారు.

ఎవరు ఈ మావోయిస్ట్ అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు?

భారత్ మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేతల్లో ఒకడైన బసవరాజు తలపై రూ.1.5 కోట్ల రివార్డు ఉంది. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా జియ్యన్నపేట గ్రామానికి చెందిన ఇతడు వరంగల్ లోని రీజనల్ ఇంజినీరింగ్ కళాశాల (ఆర్ ఈసీ)లో బీటెక్ పట్టా పొందాడు.1970వ దశకంలో మావోయిస్టు ఉద్యమంలో చేరి గంగన్న, కృష్ణ, నరసింహ, ప్రకాశ్ వంటి పలు మారుపేర్లతో పనిచేశాడు.

ముప్పాళ్ల లక్ష్మణ్ రావు స్థానంలో

2004లో పీపుల్స్ వార్ గ్రూప్, మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్ (ఎంసీసీ) విలీనం తర్వాత పార్టీ తొలి ప్రధాన కార్యదర్శిగా ఉన్న ముప్పాళ్ల లక్ష్మణ్ రావు స్థానంలో 2018లో సీపీఐ (మావోయిస్టు) ప్రధాన కార్యదర్శి అయ్యారు. బసవ రాజు భారతదేశంలోని కొన్ని కీలకమైన మావోయిస్ట్ దాడుల సూత్రధారి అని భావిస్తున్నారు. 2010లో ఛత్తీస్ గఢ్ లోని చింతల్ నార్ లో 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను ఊచకోత కోయడం, 2013లో జిరామ్ ఘాటి వద్ద జరిగిన దాడిలో మావోయిస్టు నాయకుడు బసవరాజు అలియాస్ కేశవరావు కీలక పాత్ర పోషించాడు.

లేటెస్ట్ ఫొటో కూడా లేదు

మావోయిస్టు నాయకుడు బసవరాజు అలియాస్ కేశవరావు కు సంబంధించిన లేటెస్ట్ ఫొటో కూడా ఎవరి వద్ద లేదు. దాంతో అతన్ని ట్రాక్ చేయడం భద్రతా బలగాలకు చాలా కష్టంగా మారింది. ప్రధానంగా చత్తీస్ గఢ్, తెలంగాణ, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో ఆయన కార్యకలాపాలు కొనసాగించారు. బసవరాజు 1992లో నాటి పీపుల్స్ వార్ కేంద్ర కమిటీలో సభ్యుడిగా ఎదిగారు. 2004లో సిపిఐ (మావోయిస్టు)గా విలీనం తరువాత సెంట్రల్ మిలటరీ కమిషన్ కార్యదర్శిగా నియమితులై సాయుధ కార్యకలాపాలు, వ్యూహాలను పర్యవేక్షించారు. బసవరాజు ఎనిమిదేళ్లుగా అబుజ్మాద్ లో మకాం వేసినట్లు సమాచారం.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.