ట్రంప్ చిన్న కుమారుడికి హార్వర్డ్ యూనివర్సిటీ అడ్మిషన్ ఇవ్వలేదా? అందుకే కక్ష సాధింపా?-barron trump got rejected by harvard claims surface after harvards sevp revoked ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  ట్రంప్ చిన్న కుమారుడికి హార్వర్డ్ యూనివర్సిటీ అడ్మిషన్ ఇవ్వలేదా? అందుకే కక్ష సాధింపా?

ట్రంప్ చిన్న కుమారుడికి హార్వర్డ్ యూనివర్సిటీ అడ్మిషన్ ఇవ్వలేదా? అందుకే కక్ష సాధింపా?

Sudarshan V HT Telugu

ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయం హార్వర్డ్ తో ట్రంప్ వైరం వెనుక వ్యక్తిగత కక్ష దాగి ఉందా? డోనాల్డ్ ట్రంప్ చిన్న కుమారుడు బారెన్ ట్రంప్ కు హార్వర్డ్ యూనివర్సిటీ అడ్మిషన్ ఇవ్వలేదా? అందుకే ట్రంప్ ఆ యూనివర్సిటీపై కక్ష గట్టారా?.. ప్రస్తుతం అమెరికాలో, సోషల్ మీడియాలో ఈ వార్త సంచలనంగా మారింది.

డోనాల్డ్ ట్రంప్ చిన్న కుమారుడు బారెన్ ట్రంప్ (AFP)

అమెరికాలోని ప్రతిష్టాత్మక హార్వర్డ్ యూనివర్సిటీకి ఉన్న విదేశీ విద్యార్థులను చేర్చుకునే హక్కును ట్రంప్ ప్రభుత్వం రద్దు చేసింది. అందులో చదువుతున్న భారతీయ విద్యార్థులు సహా విదేశీ విద్యార్థులు వేరే విద్యా సంస్థల్లో అడ్మిషన్లు తీసుకోవాలని, లేదంటే వారు అమెరికాలో నివసించే హక్కును కోల్పోతారని డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ హెచ్చరించింది.

హమాస్ అనుకూల వాతావరణం

హార్వర్డ్ వర్సిటీ తన కళాశాలల్లో చదువుతున్న విదేశీ విద్యార్థుల వివరాలను ఇవ్వడానికి నిరాకరించిందని, క్యాంపస్ లో యూదు వ్యతిరేక, హమాస్ అనుకూల వాతావరణం సృష్టిస్తోందని డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ ఆరోపిస్తోంది. అందువల్లనే హార్వర్డ్ యూనివర్సిటీకి ఉన్న విదేశీ విద్యార్థులను చేర్చుకునే హక్కును ట్రంప్ ప్రభుత్వం రద్దు చేసిందని చెబుతోంది. అయితే, ఈ నిర్ణయం వెనుక ట్రంప్ వ్యక్తిగత కక్ష దాగి ఉందని వార్తలు వస్తున్నాయి.

అడ్మిషన్ ఇవ్వనందుకేనా?

ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం.. డొనాల్డ్ ట్రంప్ చిన్న కుమారుడు బారెన్ ట్రంప్ కు తమ బిజినెస్ స్కూల్ లో అడ్మిషన్ ఇవ్వడానికి మూడు ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు నిరాకరించాయి. అవి హార్వర్డ్ యూనివర్సిటీ, కొలంబియా యూనివర్సిటీ, స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీ. అందువల్లనే ట్రంప్ ఆ వర్సిటీలపై కక్ష గట్టారు. అయితే, ప్రముఖ ఫ్యాక్ట్ చెకింగ్ అవుట్ లెట్ అయిన స్నోప్స్ ఈ వార్తలను ధృవీకరించలేమని పేర్కొంది. అయితే, ట్రంప్ ప్రభుత్వం హార్వర్డ్ కు బిలియన్ల ఫెడరల్ గ్రాంట్లను స్తంభింపజేయడం, స్టాన్ ఫోర్డ్, కొలంబియా యూనివర్సిటీలపై దర్యాప్తులను ప్రారంభించడం వంటి చర్యలు అనుమానాలకు తావిస్తున్నాయి.

బారెన్ ట్రంప్ అడ్మిషన్ ఎక్కడ?

ప్రస్తుతం బారెన్ ట్రంప్ న్యూయార్క్ విశ్వవిద్యాలయానికి చెందిన స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో చదువుతున్నారు. సాధారణంగా, ట్రంప్ కుటుంబ సభ్యులు పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం లేదా జార్జ్ టౌన్ వర్సిటీల్లో విద్యాభ్యాసం చేస్తారు. డోనాల్డ్, ఇవాంకా, డాన్ జూనియర్, ఎరిక్, చివరకు టిఫానీ ట్రంప్ కూడా పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం లేదా జార్జ్ టౌన్ వర్సిటీల్లోనే చదివారు. కాబట్టి సహజంగానే బారెన్ ఎంపిక ప్రత్యేకంగా కనిపించింది.

నా కుమారుడు చాలా తెలివైన వాడు..

అయితే, 2024 లో డొనాల్డ్ ట్రంప్ తన కుమారుడు బారెన్ ట్రంప్ అడ్మిషన్ గురించి డైలీ మెయిల్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తన కుమారుడు చాలా తెలివైన వాడని, అతడికి చాలా కాలేజీల్లో అడ్మిషన్ వచ్చిందని వెల్లడించాడు. అయితే, అతడు న్యూయార్క్ లో ఉండడానికి ఇష్టపడడం వల్ల న్యూయార్క్ విశ్వవిద్యాలయానికి చెందిన స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో చేర్చామని తెలిపారు.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.