Kannada language : ‘దొంగతనం జరుగుతోందని ఎమర్జెన్సీ కాల్ చేస్తే.. కన్నడలో మాట్లాడమన్నారు!’
బెంగళూరులోని తన ఫ్లాట్‌లో చోరీ జరిగినప్పుడు ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్‌కి కాల్ చేయగా.. ఆపరేటర్ తనను కన్నడలో మాట్లాడాలని కోరాడని ఓ స్పానిష్ టూరిస్ట్ ఆరోపించాడు. అనంతరం కాల్ డిస్కనెక్ట్ అయ్యిందని స్పెయిన్ పర్యాటకుడు తెలిపాడు.
కర్ణాటకలో కన్నడ భాష వ్యవహారం మరోమారు వార్తల్లో నిలిచింది. కన్నడ మాట్లాడలేని వారిని టార్గెట్ చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఒక స్పానిష్ టూరిస్ట్‌కి చేదు అనుభవం ఎదురైంది. ఇంట్లో దొంగలు పడ్డారని ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్‌కి కాల్ చేస్తే, కన్నడలో మాట్లాడాలని సమాధానమిచ్చారని ఆ టూరిస్ట్ చెప్పుకొచ్చాడు.
అసలేం జరిగింది..?
తన ఇంట్లో దొంగతనం జరుగుతున్న సమయంలో ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ ఆపరేటర్ తనకు ఫోన్ చేసినప్పుడు కన్నడలో మాట్లాడాలని కోరాడని స్పెయిన్ పర్యాటకుడు ఆరోపించారు.
టూరిస్ట్‌గా ఇండియాకు వచ్చిన జీసస్ అబ్రియల్.. బెంగళూరులోని రిచ్ మండ్ టౌన్‌లోని ఓ ఫ్లాట్‌లో బస చేశాడు. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం జనవరి 15 తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఇద్దరు దొంగలు ఆయన అపార్ట్మెంట్లోకి చొరబడ్డారు.
దొంగలు పడకగది కిటికీ ద్వారా ఇంట్లోకి ప్రవేశించారు. ల్యాప్‌టాప్, ఉంగరం, కొన్ని డాక్యుమెంట్లు వంటి పలు విలువైన వస్తువులను దొంగిలించి స్లైడింగ్ కిటికీ గుండా పారిపోయారు.
భయపడిన అబ్రియల్ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి పరిస్థితిని వివరించే ప్రయత్నం చేయగా ఆపరేటర్ కన్నడలో మాట్లాడాలని కోరాడు. ఆ తర్వాత కాల్ డిస్కనెక్ట్ చేశాడని టూరిస్ట్ చెప్పుకొచ్చాడు.
ఉదయం వరకు బెడ్ రూంలోనే ఉన్న అబ్రియెల్ పోలీసులకు ఫోన్ చేసి పరిస్థితిని వివరించాడు.
'అబ్రియెల్ నుంచి ఫోన్ రాలేదు'
అయితే చోరీ సమయంలో అబ్రియెల్ నుంచి ఎలాంటి కాల్ రాలేదని బెంగళూరు పోలీసులు తెలిపారు. ఉదయం 9:18 గంటలకు హెల్ప్‌లైన్‌కు మొదటి కాల్ వచ్చిందని, ఎటువంటి సంభాషణ లేకుండా అది డిస్కనెక్ట్ అయిందని వారు తెలిపారు.
కొన్ని నిమిషాల తరువాత, రెండొవ కాల్ వచ్చిందని, పరిమిత సమాచారాన్ని అందించారని పోలీసులు వివరించారు. హెల్ప్‌లైన్ ఆపరేటర్ కన్నడలో సమాధానం ఇచ్చిన తర్వాత కాల్ డిస్కనెక్షన్ అయ్యిందని పేర్కొన్నారు.
ఇరుగుపొరుగు వారు సయ్యద్ అష్ఫాక్, సయ్యద్ అబ్దుస్ సలాం ఎమర్జెన్సీ నంబర్‌కి డయల్ చేయగా, ఆ తర్వాతే ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఘటనాస్థలానికి పోలీసు వాహనాన్ని పంపామని, అయితే పర్యాటకుడు స్పందించకపోవడంతో కరెక్ట్ లొకేషన్ కనుగొనలేకపోయామని పోలీసులు తెలిపారు.
రోజుకు 15,000-20,000 ఎమర్జెన్సీ కాల్స్ వస్తున్నాయని ఓ పోలీసు అధికారి చెప్పారు. వీటిలో కేవలం 1,500 మాత్రమే నిజమైనవి అని వివరించారు.
తప్పుడు కమ్యూనికేషన్ సాధారణమని, కొన్నిసార్లు నిజమైన కాల్స్‌ని గుర్తించడం కష్టమని ఆయన అన్నారు. అయితే, కేసు పరిష్కారమయ్యే వరకు పోలీసు బృందం కేసును మూసివేయదని స్పష్టం చేశారు.
సంబంధిత కథనం