Ban on onion exports: ఇటీవల నిత్యావసర వస్తువుల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఉల్లి ధర అనూహ్యంగా పెరగసాగింది. దాంతో, ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది.
దేశవ్యాప్తంగా పెరుగుతున్న నిత్యావసరాల ధరలను తగ్గించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఉల్లి గడ్డల ఎగుమతులపై నిషేధం (Ban on onion exports) విధించింది. అదే విధంగా, గోధుమలను నిల్వ చేసే విషయంలో మరిన్ని ఆంక్షలను విధించింది. మరో ఆరు నెలల లోపే సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో, పెరుగుతున్న ధరలు తమపై ప్రతికూల ప్రభావం చూపకూడదన్న అభిప్రాయంలో ప్రభుత్వం ఉంది. గతంలో భారీగా పెరిగిన ఉల్లి ధరలు ఎన్నికలలో ప్రభుత్వాలనే మార్చిన అనుభవం ఉంది. దాంతో, వచ్చే సంవత్సరం మార్చి నెల వరకు ఉల్లి గడ్డల ఎగుమతులపై నిషేధం విధించారు. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుంది.
మరో ప్రధాన ఆహార ధాన్యమైన గోధుమలను అక్రమంగా పెద్ద మొత్తంలో నిల్వ చేయకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. హోల్ సేల్ ట్రేడర్డు, రిటైల్ ట్రేడర్లు, ఇతర సంబంధిత సంస్థలు గోధుమలను నిల్వ చేసే విషయంలో గతంలో ఉన్న పరిమితులను సవరించారు. ఈ నూతన పరిమితులు కూడా తక్షణమే అమల్లోకి వస్తాయి. కృత్రిమ కొరతను సృష్టించి, ధరలు పెరిగేలా చూడడాన్ని నిరోధించడం కోసమే నూతన పరిమితులు విధించామని ఆహార శాఖ సెక్రటరీ సంజీవ్ చోప్రా తెలిపారు.
నవంబర్ నెలలో ఉల్లి ధర 58% పెరిగింది. దిగుబడి తగ్గడంతో పాటు పండుగ సీజన్ లో డిమాండ్ ఎక్కువగా ఉన్న కారణంగా ఉల్లి ధరలు భారీగా పెరిగాయి. మరోవైపు, గోధుమల ధర కూడా అక్టోబర్ నెలలో గత 8 నెలల గరిష్టానికి చేరింది.