Baltimore bridge collapse: అమెరికాలో కుప్పకూలి నదిలో పడిపోయిన వంతెన; భారీగా మరణాలు; వైరల్ అయిన వీడియో-baltimore bridge collapses after being struck by ship 7 people in the water ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Baltimore Bridge Collapse: అమెరికాలో కుప్పకూలి నదిలో పడిపోయిన వంతెన; భారీగా మరణాలు; వైరల్ అయిన వీడియో

Baltimore bridge collapse: అమెరికాలో కుప్పకూలి నదిలో పడిపోయిన వంతెన; భారీగా మరణాలు; వైరల్ అయిన వీడియో

HT Telugu Desk HT Telugu
Mar 26, 2024 05:39 PM IST

Baltimore bridge collapse: అమెరికా తూర్పు తీరంలో పటాప్స్కో నదిపై నిర్మించిన బాల్టిమోర్ బ్రిడ్జి మంగళవారం ఉదయం కుప్పకూలింది. నదిలో ప్రయాణిస్తున్న ఒక భారీ నౌక ఢీ కొట్టడంతో బాల్టిమోర్ వంతెన కుప్పకూలింది. దాంతో, పదుల సంఖ్యలో వాహనాలు నదిలో పడిపోయాయి.

బాల్టిమోర్ వంతెన కుప్పకూలుతున్న దృశ్యం
బాల్టిమోర్ వంతెన కుప్పకూలుతున్న దృశ్యం

US bridge collapse: కంటైనర్ నౌక ఢీకొనడంతో బాల్టిమోర్ (ఫ్రాన్సిస్ స్కాట్ కీ) వంతెన పాక్షికంగా కూలిపోయింది. ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. స్థానిక కాలమానం ప్రకారం మార్చి 26వ తేదీ మంగళవారం తెల్లవారు జామున 1.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.

ముఖ్యమైన రహదారి వంతెన

అమెరికాలో పటాప్స్కో నదిపై నిర్మించిన ఫ్రాన్సిస్ స్కాట్ కీ వంతెన 3 కి.మీ పొడవు ఉంటుంది. ఇది ఐ-95 అంతరాష్ట్ర రహదారిలో భాగంగా ఉంది. ఇది అమెరికా తూర్పు తీరంలోని మయామి, ఫ్లోరిడాను, మైనేను కలిపే ప్రధాన ఉత్తర-దక్షిణ రహదారి. మంగళవారం తెల్లవారు జామున 1.30 గంటల సమయంలో పటాప్స్కో నదిపై ఒక సరకు రవాణా నౌక అదుపుతప్పి బాల్టిమోర్ వంతెన పిల్లర్ ను ఢీకొన్నది. దాంతో, బాల్టిమోర్ వంతెన ఒక్కసారిగా, పాక్షికంగా కూలిపోయింది. మరోవైపు, వంతెనను ఢీ కొన్న తరువాత ఆ సరకు రవాణా నౌకలో మంటలు చెలరేగాయి.

నదిలో పడిన వాహనాలు..

ఫ్రాన్సిస్ స్కాట్ కీ వంతెన పాక్షికంగా కూలిపోవడంతో, ఆ సమయంలో ఆ బ్రిడ్జిపై ప్రయాణిస్తున్న పలు వాహనాలు నదిలో పడిపోయాయి. ఆ వాహనాల్లో ప్రయాణిస్తున్నవారిని కాపాడేందుకు కోస్ట్ గార్డ్స్ రంగంలోకి దిగారు. ఇద్దరు ప్రయాణికులను రక్షించినట్లు కోస్ట్ గార్డ్స్ ప్రకటించింది. అయితే, ఎన్ని వాహనాలు నదిలో పడిపోయాయి? వాటిలో ఎంతమంది ప్రయాణిస్తున్నారనే విషయంలో స్పష్టత లేదు. కానీ, పెద్ద సంఖ్యలోనే మరణాలు సంభవించినట్లు తెలుస్తోంది. వంతెన కుప్పకూలడంతో ఆ బ్రిడ్జి వైపు వెళ్లే అన్ని దారులను మూసివేశారు. దాంతో, ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఒక్కసారిగా నిలిచిపోయింది.

చాలా మందే చనిపోయి ఉండవచ్చు

బాల్టిమోర్ సిటీ ఫైర్ డిపార్ట్మెంట్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ చీఫ్ కెవిన్ కార్ట్రైట్ బీబీసీతో మాట్లాడుతూ బాల్టిమోర్ వంతెన కూలిన తర్వాత "ఏడుగురు వ్యక్తులు, అనేక వాహనాలు" నదిలో పడిపోయాయని ధృవీకరించారు. ప్రస్తుతం మల్టీ ఏజెన్సీ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని తెలిపారు. మృతుల సంఖ్య ఎక్కువగానే ఉండవచ్చని తెలిపారు.

Whats_app_banner
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.