Kazakhstan Plane Crash : కజకిస్థాన్‌లో కుప్పకూలిన ప్రయాణికుల విమానం.. అందులో సుమారు 72 మంది!
Azerbaijan Airlines plane crash : కజకిస్థాన్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న విమానం క్రాష్ అయింది. దీంతో చాలా మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది.
కజకిస్థాన్‌లో ఘోర విమానం ప్రమాదం జరగడంతో చాలా మంది ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తోంది. అజర్‌బైజాన్‌కు చెందిన ఓ విమానం బుధవారం కజకిస్థాన్‌లోని అక్టౌ నగరానికి సమీపంలో కూలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో 67 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బంది ఉన్నారు. అయితే 42 మంది ప్రాణాలు కోల్పోయినట్టుగా చెబుతున్నారు. కానీ వీరిలో ఆరుగురు మాత్రమే ప్రాణాలతో బయటపడినట్టుగా వార్తలు కూడా వస్తున్నాయి. ఎంత మంది మృతి చెందారనే విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ప్రస్తుతం మృతదేహాలను వెలికి తీసే పనిలో అధికారులు ఉన్నారు.
అజర్‌బైజాన్‌లోని బాకు నుంచి విమానం ప్రయాణికులతో బయల్దేరింది. రష్యా రిపబ్లిక్ చెచెన్యా రాజధాని గ్రోజ్నీ వైపునకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. పట్టణంలో దట్టమైన పొగమంచు కారణంతో విమానం దారి మళ్లించారు. అక్టౌ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విమానం కుప్పకూలింది. విమానం గాలిలో చక్కర్లు కొడుతున్న వీడియో బయటకు వచ్చింది.
ప్రయాణికులలో 37 మంది అజర్‌బైజాన్ పౌరులు, 16 మంది రష్యన్ పౌరులు, 6 మంది కజఖ్ పౌరులు, 3 కిర్గిజ్ పౌరులు ఉన్నారని అజర్‌బైజాన్ ఎయిర్‌లైన్స్ తన X హ్యాండిల్‌లో రాసింది. ఆపై విమానంలోని ప్రయాణికుల పేర్ల పూర్తి జాబితాను విడుదల చేసింది. అజర్‌బైజాన్ ఎయిర్‌లైన్స్ విమానం ప్రమాదంలో జరిగిన ప్రాణనష్టంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అజర్‌బైజాన్ అధ్యక్షుడు ఇల్హామ్ అలియేవ్‌తో మాట్లాడారు. ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్ ఫ్లైట్ రాడార్ 24 ఆన్‌లైన్ పోస్ట్‌లో విమానం బలమైన జీపీఎస్ జామింగ్ ఎదుర్కొన్నట్లు పేర్కొంది. దీంతో ప్రమాదం జరిగిందని తెలిపింది.