మద్యం మత్తులో ఉన్న యువతిపై ఆటో డ్రైవర్ల పాశవిక దాడి
ఎక్కడ చూసినా మహిళలపై దాడులు కొనసాగుతున్నాయి. ప్రతీరోజూ ఏదో ఒక చోట మహిళ బాధితురాలిగా నిలుస్తుంది. తాజాగా రెండు వేర్వేరు ఘటనల్లో మహిళలపై దాడిచేసిన ఆటో డ్రైవర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.
Jaipur | రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో ఓ 25 ఏళ్ల మహిళ యువతి బాగా మద్యం సేవించి ఒళ్లు మరిచిపోయింది. తాను ఏం చేస్తుందో తనకే తెలియని స్థితిలో రాత్రి పూట ఓ ఇద్దరు ఆటోడ్రైవర్‌లతో గొడవకు దిగింది. దుర్భాషలాడుతూ వారిపై రెచ్చిపోయింది. సమయానికి అటుగా పోలీసులు వచ్చి ఆమెను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆటో డ్రైవర్లు మాత్రం ఊరికే వదిలిపెట్టలేదు.
పోలీసుల సమక్షంలోనే ఆమెపై దాడికి దిగారు. ఆ యువతిని తోసేసి కాళ్లతో తన్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆటో డ్రైవర్లపై ఐపిసి సెక్షన్ 324 (దాడి చేయడం), 341 (అభ్యంతరకరంగా ప్రవర్తించడం), 354 (వేధింపులు) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
అలాగే మద్యం మత్తులో ఉన్న ఆ యువతి కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్ కు పిలిపించి ఆమెపై న్యూసెన్స్ కేసు కింద చర్యలకు ఉపక్రమించినట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు. ఈ ఘటన బుధవారం రాత్రి జరగగా ఇందుకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఈరోజు గురువారం పోలీసులు మీడియాకు వెల్లడించారు.
ఇక, కర్ణాటకలోని మంగళూరు పట్టణంలో జరిగిన మరొక ఘటనలో ఓ మహిళా ప్రయాణికురాలిపై ఆటోడ్రైవర్ లైంగిక వేధింపులకు గురిచేశాడు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనలో నిందితుడు సమీర్ (22)ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఉదయం 7 గంటలకు తన ఆటో ఎక్కిన మహిళా ప్రయాణికురాలితో అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడటం ప్రారంభించాడు. ఆమెపై అభ్యంతకర రీతిలో ప్రవర్తించాడు. జరిగిన విషయాన్ని బాధితురాలు తన కొడుకుతో చెప్పగా, అతణ్ని కూడా బెదిరించడంతో వారిరువురు కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నారు.
సంబంధిత కథనం
టాపిక్