Social media ban : ఈ వయస్సులోపు పిల్లలు ఇక ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వాడలేరు- పూర్తిస్థాయిలో నిషేధం..!
Social media ban for children : 16ఏళ్ల వయస్సులోపు పిల్లలు సోషల్ మీడియా వాడటాన్ని నిషేధించే విధంగా ఆస్ట్రేలియా ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఇది పిల్లల మానసిక ఆరోగ్యం కోసమని ప్రకటించింది.
16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాను ఉపయోగించడాన్ని నిషేధించే చట్టాన్ని ప్రవేశపెట్టే ప్రణాళికలను ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది. మానసిక ఆరోగ్యం, భద్రత మీద సోషల్ మీడియా ప్రభావంపై పెరుగుతున్న ఆందోళనలను పరిష్కరించడానికి ఒక కొత్త చట్టాన్ని వచ్చే వారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్టు తెలిపింది.
పిల్లలకు సోషల్ మీడియా బంద్..!
16 ఏళ్లలోపు పిల్లల కోసం సోషల్ మీడియాను నిషేధించే కార్యక్రమానికి నేతృత్వం వహించారు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్. ఆన్లైన్లో పిల్లలను రక్షించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని నొక్కి చెప్పారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. “ఇది అమ్మ, నాన్నల కోసమే! ఆన్లైన్లో పిల్లల భద్రత గురించి నాలాగే వారు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం మీకు అండగా ఉందని ఆస్ట్రేలియా కుటుంబాలు తెలుసుకోవాలి,” అని ఆయన అన్నారు.
ఈ ఏడాది చివరిలో ప్రవేశపెట్టనున్న ఈ కొత్త చట్టం పిల్లలు, టీనేజర్లకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ చేస్తున్న నష్టానికి ప్రత్యక్ష ప్రతిస్పందనగా భావిస్తున్నారు.
"సోషల్ మీడియా మా పిల్లలకు హాని చేస్తోంది. తక్షణమే చర్యలు తీసుకోవాలి," అని అల్బనేస్ అన్నారు.
సోషల్ మీడియాపై నిషేధం: చట్టంలోని కీలక వివరాలు..
ప్రతిపాదిత సోషల్ మీడియా నిషేధం కింద, 16 ఏళ్లలోపు పిల్లలు తమ సైట్లను యాక్సెస్ చేయకుండా నిరోధించడానికి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు సహేతుకమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా తల్లిదండ్రుల అంగీకారం ఉన్నా, పిల్లలకు ఎలాంటి మినహాయింపులు ఉండవు. బాధ్యతల భారం సోషల్ మీడియా సంస్థలపై పడుతుంది తప్ప తల్లిదండ్రులు, యువ వినియోగదారులపై కాదు.
యాక్సెస్‌ను నిరోధించడానికి సహేతుకమైన చర్యలు తీసుకుంటున్నామని నిరూపించుకోవాల్సిన బాధ్యత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై ఉంటుందని అల్బనీస్ వివరించారు. పిల్లలకు సురక్షితమైన ఆన్లైన్ వాతావరణాన్ని నిర్ధరించడానికి టెక్ కంపెనీలను జవాబుదారీగా ఉంచాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని ఈ చర్యలు ప్రతిబింబిస్తాయి.
ఎప్పుడు అమల్లోకి వస్తుంది?
ఆస్ట్రేలియా పార్లమెంట్లో ఆమోదం పొందిన 12 నెలల తర్వాత నిబంధనలు అమల్లోకి వస్తాయని తెలుస్తోంది. అయితే ఈ చట్టం అమల్లోకి వచ్చే సమయానికి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న పిల్లలపై ఎలాంటి నిషేధం ఉండదు.
ఈ చట్టం అమలును ఆస్ట్రేలియాకు చెందిన ఈ-సేఫ్టీ కమిషనర్ పర్యవేక్షిస్తారు. యువ యూజర్లకు ఎలాంటి జరిమానాలు ఉండవని, అయితే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ మాత్రం రూల్స్ పాటించకపోతే, బాధ్యత వహించాల్సి ఉంటుందని అల్బనీస్ ధృవీకరించింది.
విమర్శలు- ఆందోళనలు..
ఆస్ట్రేలియా ప్రభుత్వ చర్యను కొంతమంది తల్లిదండ్రులు, పిల్లల భద్రతా న్యాయవాదులు స్వాగతించినప్పటికీ, సంపూర్ణ నిషేధం ప్రభావవంతంగా ఉంటుందని మరికొందరు నిపుణులు నమ్మడం లేదు. ప్రాప్యతను పరిమితం చేయడం ఆన్లైన్ డేంజర్ మూల కారణాలను పరిష్కరించడానికి బదులుగా పిల్లలు సోషల్ మీడియాకు గురికావడాన్ని ఆలస్యం చేస్తుందని కొందరు వాదిస్తున్నారు.
ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా యాప్స్ వాడకంపై యూరోపియన్ యూనియన్ సహా అనేక దేశాలు గతంలో చేసిన ప్రయత్నాలు గణనీయమైన సవాళ్లను ఎదుర్కొన్నాయి. చాలా మంది పిల్లలు వయస్సు-ధృవీకరణ సాధనాలను సులభంగా దాటవేయగలరని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది నిషేధాలను చాలావరకు అసమర్థంగా చేస్తుంది!
సంబంధిత కథనం