Assad Family Rule In Syria : సిరియాలో 54 ఏళ్ల అసద్ కుటుంబ పాలన ముగియడంతో తర్వాత ఏం జరగనుంది?-assad family 54 year long rule ends what next for syria check in details ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Assad Family Rule In Syria : సిరియాలో 54 ఏళ్ల అసద్ కుటుంబ పాలన ముగియడంతో తర్వాత ఏం జరగనుంది?

Assad Family Rule In Syria : సిరియాలో 54 ఏళ్ల అసద్ కుటుంబ పాలన ముగియడంతో తర్వాత ఏం జరగనుంది?

Anand Sai HT Telugu
Dec 09, 2024 08:22 PM IST

Assad Family Rule In Syria : సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ కుటుంబ సభ్యులతో కలిసి రష్యాకు వెళ్లినట్టుగా వార్తలు వస్తున్నాయి. మరోవైపు తిరుగుబాటు దళాల ఆధీనంలో రాజధాని డమాస్కస్‌ ఉంది. 54 ఏళ్ల అసద్ కుటుంబ పాలన ముగిసిందని రెబల్స్ ప్రకటించారు. తర్వాత ఏం జరుగుతుందని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

హఫీజ్ అల్ అసద్‌, బషర్ అల్ అసద్
హఫీజ్ అల్ అసద్‌, బషర్ అల్ అసద్

తిరుగుబాటు దళాలు సిరియా రాజధాని డమాస్కస్‌ను స్వాధీనం చేసుకున్నాయి. 24 ఏళ్లుగా అధ్యక్ష పదవిలో ఉన్న బషర్ అల్ అసద్ పాలనకు ముగింపు పలికామని ప్రకటించాయి. ఇది 1970లో బషర్ తండ్రి హఫీజ్ అల్ అసద్‌తో ప్రారంభమైన అసద్ కుటుంబం పాలనకు చెక్ పెట్టినట్టైంది. 54 ఏళ్ల సుదీర్ఘ అధికారాన్ని చూసింది అసద్ ఫ్యామిలీ.

yearly horoscope entry point

తిరుగుబాటు కూటమికి నాయకత్వం వహిస్తున్న ఇస్లామిస్ట్ గ్రూప్ హయత్ తహ్రీర్ అల్ షామ్ (HTS) టెలిగ్రామ్‌లో ఒక ప్రకటనలో డమాస్కస్ విముక్తి పొందింది అని ప్రకటించింది. 'మేం మా నగరం స్వేచ్ఛను, నిరంకుశ అసద్ పతనాన్ని ప్రకటిస్తున్నాం.' అని తెలిపారు. ఇది చీకటి అధ్యాయానికి ముగింపు, సిరియాకు కొత్త శకానికి నాంది అని తిరుగుబాటు దారులు ప్రకటించారు.

డమాస్కస్ పతనం నవంబర్ 27న మెుదలైందని చెప్పాలి. ఊహించని వేగవంతమైన తిరుగుబాటు దాడిని సిరియా రాజధాని చూసింది. ఇది ప్రభుత్వ దళాలకు ఇబ్బందిని కలిగించింది. బషర్ అల్ అసద్ తండ్రి హఫీజ్ అల్ అసద్ 1970 అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. అసద్‌ది నిరంకుశ పాలన అంటూ చాలా మంది వ్యతిరేకించారు. క్రూరమైన అణిచివేతలు, కఠినంగా వ్యవహరించే భద్రతా యంత్రాంగాన్ని చూసి భయపడేవారు. అరబ్ జాతీయవాదం, లౌకికవాదాన్ని ప్రోత్సహించే బాతిస్ట్ పాలనను స్థాపించాడు. అతని పాలనలో సిరియా ఇరాన్‌కు కీలకమైన మిత్రదేశంగా, ఇజ్రాయెల్, యునైటెడ్ స్టేట్స్‌కు విరోధిగా మారింది.

బషర్ అల్ అసద్ తన తండ్రి మరణం తరువాత 2000లో 34 సంవత్సరాల వయస్సులో అధికారాన్ని చేపట్టారు. ప్రారంభంలో అతని పాశ్చాత్య విద్య, కొన్ని నిర్ణయాలతో ప్రశంసలు అందుకున్నాడు.

కానీ 2011 అరబ్ స్ప్రింగ్ నిరసనలు అసద్ పాలనకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ప్రదర్శనలను జరిగాయి. ఈ సమయంలో తన తండ్రి పాటించిన అణచివేత వ్యూహాలను అసద్ అమలు చేయడంతో తర్వాత మెల్లగా నమ్మకం కోల్పోవడం మెుదలైంది. శాంతియుత నిరసనలను ప్రభుత్వం హింసాత్మకంగా అణచివేయడం, మెల్లగా అంతర్యుద్ధంగా మారింది. దీని ఫలితంగా చాలా మంది మరణించారు. సిరియా యుద్ధానికి ముందు ఉన్న 23 మిలియన్ల జనాభాలో సగం మంది వలస వెళ్లారని చెబుతారు. రష్యా, ఇరాన్, హిజ్బుల్లాతో సహా విదేశీ మిత్రదేశాలపై ఎక్కువగా ఆధారపడటం ద్వారా అసద్ అధికారాన్ని కొనసాగించాడు.

సిరియా అంతర్యుద్ధం నేపథ్యంలో తీవ్ర సంక్షోభాన్ని మిగిల్చింది. లక్షలాది మంది సిరియన్లు టర్కీ, జోర్డాన్, లెబనాన్ వంటి పొరుగు దేశాలకు పారిపోయారు. మరికొందరు ఐరోపాలో ఆశ్రయం పొందారు. కొందరు భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు. హింస, ఆర్థిక పతనం తీవ్రమైంది. 2013లో జరిగిన దాడిలో రసాయన ఆయుధాల వాడకంతో సహా అసద్ పాలన అనేక యుద్ధ నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ సంఘటనపై అంతర్జాతీయంగా వ్యతిరేఖత వచ్చింది. తర్వాతి కాలంలో తిరుగుబాటు దళాలు బలపడ్డాయి.

తాజాగా డమాస్కస్‌పై తిరుగుబాటు దళాలు జెండా ఎగరేసి విజయాన్ని సాధించాయి. అయితే సిరియా భవిష్యత్తు గురించి కూడా అనేక ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పుడున్న సంకీర్ణంలోని ప్రముఖ వర్గమైన హెచ్‌టీఎస్‌కు వివాదాస్పద చరిత్ర ఉంది. వాస్తవానికి అల్ ఖైదాతో అనుసంధానంగా ఉన్న ఈ బృందం 2016లో సంబంధాలను తెంచుకుంది. అప్పటి నుండి తనను తాను మరింత మితవాద శక్తిగా ప్రదర్శించడానికి ప్రయత్నించింది. అయినప్పటికీ ఇది యునైటెడ్ స్టేట్స్, ఐక్యరాజ్యసమితితో ఉగ్రవాద సంస్థగా గుర్తింపు పొందింది.

ప్రస్తుతం సిరియా సంకీర్ణ పాలనా సామర్థ్యం అనిశ్చితంగానే ఉంది. తిరుగుబాటు దళాల్లోని అనేక వర్గాలు విరుద్ధమైన భావజాలాలతో ఉన్నట్టుగా తెలుస్తోంది. వివిధ ఎజెండాలతో ఉన్నప్పటికీ ఏకీకృత ఫ్రంట్‌ను ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి.

అసద్ పాలన ముగింపు మధ్యప్రాచ్య భౌగోళిక రాజకీయాలలో ప్రధాన మార్పునకు కారణం అవుతుంది. దశాబ్దాలుగా అసద్ నేతృత్వంలోని సిరియా.. ఇరాన్‌కు కీలక మిత్రదేశంగా, ఈ ప్రాంతంలో రష్యా కోసం కూడా పనిచేసింది. కానీ ఉక్రెయిన్‌తో యుద్ధంపై రష్యా దృష్టి పెట్టడం, ఇజ్రాయెల్‌తో కొనసాగుతున్న వివాదం కారణంగా హిజ్బుల్లా బలహీనపడటం అసద్ పతనానికి దోహదపడింది. యూఏఈ, ఈజిప్ట్, జోర్డాన్ వంటి శక్తుల నుండి మద్దతు కోరేందుకు ప్రయత్నించినప్పటికీ అది కుదరలేదు.

అసద్.. రష్యా, ఇరాన్ సైనిక మద్దతుపై ఎక్కువగా నమ్మకం పెట్టుకున్నాడు. కానీ తిరుగుబాటు దళాలపై విజయాన్ని సాధించడంలో విఫలమయ్యాడు. దీంతో 54 ఏళ్లపాటు అసద్ కుటుంబ పాలన ముగిసింది. తర్వాత సిరియాలో ప్రభుత్వ ఏర్పాటు ఎలా జరుగుతుందనేది ఆసక్తిగా మారింది. తర్వాతి అధ్యక్షుడు ఎవరు అనేది ప్రపంచం ఎదురుచూస్తోంది.

Whats_app_banner
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.