Arvind Kejriwal: కోర్టుకు హాజరైన కేజ్రీవాల్; బెయిల్ మంజూరు చేసిన కోర్టు; సమన్లపై స్టే ఇవ్వడానికి నిరాకరణ
Arvind Kejriwal: ఈడీ సమన్ల కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టుకు హాజరయ్యారు. వాదనల అనంతరం, ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈడీ సమన్లు చట్టవిరుద్ధమని, రాజకీయ ప్రేరేపితమని అరవింద్ కేజ్రీవాల్ వాదించారు.
Arvind Kejriwal: ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సమన్ల కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం దేశ రాజధానిలోని రౌస్ అవెన్యూ కోర్టుకు హాజరయ్యారు. పలు దఫాలుగా ఈడీ పంపించిన సమన్లను కేజ్రీవాల్ పట్టించుకోకపోవడంతో, ఈడీ కోర్టులో కేసు వేసింది. సమన్లను దాటవేసినందుకు ఏజెన్సీ దాఖలు చేసిన కేసులో ఢిల్లీ లోని రౌస్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసుకు సంబంధించి కేజ్రీవాల్ భౌతికంగా కోర్టుకు హాజరుకావడం ఇదే తొలిసారి. గత విచారణలో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు.
లిక్కర్ స్కామ్
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో విచారణకు హాజరుకావాలని తాము ఇచ్చిన సమన్లను ధిక్కరించినందుకు కేజ్రీవాల్ (Arvind Kejriwal) పై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) రెండు ఫిర్యాదులు చేసింది. విధాన రూపకల్పన, అది ఖరారు కాకముందే జరిగిన సమావేశాలు, లంచాల ఆరోపణలు వంటి అంశాలపై అరవింద్ కేజ్రీవాల్ వాంగ్మూలాన్ని నమోదు చేయాలని ఈడీ భావిస్తోంది. అయితే ఈ సమన్లు చట్టవిరుద్ధమని, రాజకీయ ప్రేరేపితమని కేజ్రీవాల్ కొట్టిపారేస్తున్నారు.
బెయిల్ మంజూరు
రౌస్ అవెన్యూ కోర్టులో వాదనల అనంతరం కేజ్రీవాల్ కు బెయిల్ లభించింది. బెయిల్ మంజూరు చేస్తూ, రూ.50,000 మొత్తానికి బాండ్ ను, మరో స్యూరిటీ బాండ్ ను సమర్పించాలని కోర్టు అరవింద్ కేజ్రీవాల్ ను ఆదేశించింది. రెండు బాండ్లను సమర్పించిన తరువాత కేజ్రీవాల్ వెళ్లేందుకు అనుమతించారు. ఆ తర్వాత సీఆర్పీసీ 207, సీఆర్పీసీ 91 సెక్షన్ల కింద కాపీల కోసం దరఖాస్తు చేసుకున్నామని, దీనికి సమాధానం, వాదనలు ఏప్రిల్ 1వ తేదీకి వాయిదా వేశారని న్యాయవాది రమేశ్ గుప్తా తెలిపారు.
సమన్లపై స్టే ఇవ్వలేం..
కాగా, లిక్కర్ స్కామ్ లో విచారించడానికి ఈడీ తనకు సమన్లు జారీ చేయకుండా స్టే ఇవ్వాలన్న కేజ్రీవాల్ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. ఈడీ విచారణలో తన వైపు నుంచి ఉద్దేశపూర్వకంగా ఎటువంటి అవిధేయత జరగలేదని, తాను గైర్హాజరు కావడానికి గల కారణాలను తాను ప్రతీ సారి వివరిస్తూనే ఉన్నాని కేజ్రీవాల్ కోర్టుకు తెలిపారు.
కేజ్రీవాల్ పై బీజేపీ విమర్శలు
అరవింద్ కేజ్రీవాల్ చట్టాన్ని గౌరవించాలని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ సూచించారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తి చట్టాన్ని పాటించడం సముచితమని అన్నారు. కాగా, కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని ఆప్ నాయకురాలు రీనా గుప్తా అన్నారు. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అని, నిరాధారమైన కేసు అని తాము మొదటి నుంచి చెబుతున్నామని చెప్పారు. ఈ కేసులో ఈడీ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని అన్నారు.