Sweden School Shooting : స్వీడన్‌లోని ఓ పాఠశాలలో కాల్పుల కలకలం.. 10 మంది మృతి-around 10 people killed in shooting at a school in sweden know details inside ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Sweden School Shooting : స్వీడన్‌లోని ఓ పాఠశాలలో కాల్పుల కలకలం.. 10 మంది మృతి

Sweden School Shooting : స్వీడన్‌లోని ఓ పాఠశాలలో కాల్పుల కలకలం.. 10 మంది మృతి

Anand Sai HT Telugu

Sweden School Shooting : స్వీడన్‌లోని ఒరెబ్రో నగరంలోని ఒక పాఠశాలలో విచక్షణారహితంగా కాల్పులు జరిపిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో దాదాపు 10 మంది మరణించగా, చాలా మంది గాయపడ్డారు.

ప్రతీకాత్మక చిత్రం (Unsplash)

స్వీడన్‌లోని ఒరెబ్రో నగరంలోని ఒక పాఠశాలలో కాల్పుల కలకలం రేగింది. ఈ ఘటనలో 10 మంది మరణించారు. చాలా మంది గాయపడ్డారు. వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటన తర్వాత పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఈ ఘటనలో అనుమానితుడు కూడా మరణించినట్టుగా పోలీసులు చెబుతున్నారు. కాల్పుల ఘటనతో ఒర్రెబోలోని పాఠశాల ఉన్న ప్రాంతమంతా ఉలక్కి పడింది. వెంటన భద్రతా బలగాలు చేరుకుని సహాయక చర్యలు మెుదలుపెట్టాయి.

దాడి చేసిన వ్యక్తికి ఏ సంస్థతోనూ సంబంధం ఉందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ సంఘటన మంగళవారం మధ్యాహ్నం 1 గంటల ప్రాంతంలో జరిగింది. దీని కారణంగా ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం నెలకొంది. ఈ కాల్పుల్లో 10 మంది గాయపడ్డారు.

దర్యాప్తు, భద్రతా పనులకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండటానికి పాఠశాల దగ్గరకు వెళ్లవద్దని పోలీసులు స్థానిక ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఓరెబ్రో నగరాన్ని సాధారణంగా ప్రశాంతమైన, సురక్షితమైన ప్రదేశంగా పరిగణిస్తారు. అయితే ఈ సంఘటన ఆ ప్రాంతంలో భయానక వాతావరణాన్ని సృష్టించింది. స్వీడన్ చరిత్రలోనే అతిపెద్ద ఘటనలో ఒకటని చెబుతున్నారు. అడల్ట్ స్కూల్‌లో ఈ ఘటన జరిగింది. ఇక్కడ 20 ఏళ్ల పైబడినవారికి పాఠాలు బోధిస్తారు.

స్వీడిష్ హెరాల్డ్ ప్రకారం.. ఒరెబ్రో స్థానిక పోలీసు చీఫ్ రాబర్టో ఫారెస్ట్ మాట్లాడుతూ నష్టం చాలా ఎక్కువగా ఉన్నందున మేం ఈ సమయంలో మరింత సమాచారం ఇవ్వలేమని అన్నారు. మృతుడి గుర్తింపును నిర్ధారించే పనిలో ఉన్నారు. ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో ఇది ఉగ్రవాద దాడి అని తేలిందన్నారు. ఒకే వ్యక్తి దాడి చేశాడని పోలీసులు భావిస్తున్నారు. అతనికి ఏ సంస్థతోనూ సంబంధం ఉందో ఇంకా వెల్లడి కాలేదు.

బీబీసీ కథనం ప్రకారం.. స్వీడన్‌లోని ఒరెబ్రోలోని క్యాంపస్ రిస్‌బర్గ్స్కా స్కూల్‌లో కాల్పులు జరిగాయి. మొదట మేం కొన్ని బుల్లెట్ల శబ్దం విన్నామని పాఠశాల ఉపాధ్యాయులు కొందురు చెబుతున్నారు. ఆ తర్వాత కొంత సమయం తర్వాత కాల్పులు తీవ్రమయ్యాయని అన్నారు.

ఒరెబ్రో నగరం స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్ నుండి దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. చాలా మంది విద్యార్థులు పాఠశాలలో ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగిందని చెబుతున్నారు. ఈ దాడిలో విద్యార్థులు గాయపడ్డారా లేదా అనేది ప్రస్తుతం స్పష్టంగా తెలియదు. దాడి వెనుక కారణం కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం పోలీసులు సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.