HMPV In India : హెచ్ఎంపీవీతో చిన్నపిల్లలు, వృద్ధులకే ఎక్కువ ప్రమాదమా? నిపుణులు చెప్పేది ఇదే-are children and elders more risk with hmpv virus this is what experts say know in details ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Hmpv In India : హెచ్ఎంపీవీతో చిన్నపిల్లలు, వృద్ధులకే ఎక్కువ ప్రమాదమా? నిపుణులు చెప్పేది ఇదే

HMPV In India : హెచ్ఎంపీవీతో చిన్నపిల్లలు, వృద్ధులకే ఎక్కువ ప్రమాదమా? నిపుణులు చెప్పేది ఇదే

Anand Sai HT Telugu

HMPV In India : హెచ్ఎంపీవీ గురించి ప్రపంచం మెుత్తం భయపడుతుంది. మళ్లీ కరోనాలాంటి పరిస్థితులు వస్తాయా? అని ఆందోళన చెందుతుంది. అయితే ఈ వైరస్ గురించి నిపుణులు చెప్పేది మాత్రం వేరేలా ఉంది. ఆ వివరాలేంటో చూడండి.

ప్రతీకాత్మక చిత్రం

చైనాలో హెచ్ఎంపీవీ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు భారత్‌లో మూడు కేసులు వెలుగు చూశాయి. వీరిలో ఇద్దరు బెంగళూరు నగరానికి చెందిన వారు కాగా, మరో కేసు గుజరాత్‌లో నమోదైంది. నవజాత శిశువులకు ఈ వైరస్ సోకింది. వీరిలో మూడు నెలల చిన్నారి కోలుకోగా, 8 నెలల చిన్నారి ప్రస్తుతం చికిత్స పొందుతోంది. ఈ వైరస్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం పర్యవేక్షిస్తున్నామని భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇదిలావుండగా చైనా నుంచి ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్ పట్ల అప్రమత్తమైన పరిస్థితి నెలకొంది. 2020లో కరోనా దెబ్బకు ప్రపంచం అతలాకుతలమైంది. మరోసారి కొత్త మహమ్మారితో ఎలాంటి విధ్వంసం ఉంటుందోనని అందరూ భయపడుతున్నారు. ఈ హెచ్ఎంపీవీ వైరస్ ఎంత ప్రమాదకరమో తెలుసుకోవాలని కోరుకుంటున్నారు.

కరోనాలాంటి భయం

ఈ వైరస్ పిల్లలపై ఎక్కువగా ప్రభావం చూపుతుందని ఆస్ట్రేలియా ప్రజారోగ్య విభాగానికి చెందిన డాక్టర్ జాక్వెలిన్ స్టీఫెన్స్ అంటున్నారు. ముఖ్యంగా దగ్గు, జలుబు, న్యుమోనియా వంటి సమస్యలతో బాధపడే పిల్లలు. కరోనా వంటి జాగ్రత్తలు కూడా దీనికి అవసరమని ఆయన అంటున్నారు. ఒకే ఒక తేడా ఏమిటంటే కరోనావైరస్ పిల్లలను ఎక్కువ బాధితులుగా మార్చలేదు, కానీ ఈ వైరస్ చిన్న పిల్లలు, వృద్ధులకు ఎక్కువగా హాని కలిగిస్తుందని స్టీఫెన్స్ అన్నారు. చైనాలో ఈ వ్యాధి బారిన పడిన వారు పెద్ద సంఖ్యలో ఆసుపత్రులకు చేరుకుంటున్నారని, అందుకే ప్రపంచవ్యాప్తంగా కరోనా వంటి మహమ్మారి భయం ఉందన్నారు. అయితే దీనిపై చైనా విదేశాంగ మంత్రి మావో నింగ్ ను ప్రశ్నించగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.

జాగ్రత్తలు అవసరం

ఈ హెచ్ఎంపీవీ వైరస్ కరోనా అంత ప్రాణాంతకం కాకపోవడం ఊరట కలిగించే విషయం. హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు జలుబు, జ్వరం మాదిరిగానే ఉంటాయని డాక్టర్ స్టీఫెన్స్ చెప్పారు. హెచ్ఎంపీవీ వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని, భయపడాల్సిన అవసరం లేదని స్టీఫెన్స్ అంటున్నారు. దీనితో బాధపడుతున్న రోగులు కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని ఉపశమనం కలిగిస్తుందని అన్నారు. ఇప్పటికే శ్వాసకోశ వ్యాధి ఉన్నవారికి ఇబ్బందులు కలిగిస్తుందని స్టీఫెన్స్ పేర్కొన్నారు. అంతేకాకుండా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న యువతపై కూడా ప్రభావం చూపుతుంది.

వీరిపై ఎక్కువ ప్రభావం!

అదే సమయంలో బ్రోన్కైటిస్, న్యుమోనియా వంటి వ్యాధులతో బాధపడేవారికి సులభంగా సోకుతుంది. బ్రోన్కైటిస్ అనేది ఒక రకమైన ఛాతీ ఇన్ఫెక్షన్, ఇది కొన్నిసార్లు బలహీనమైన రోగనిరోధక శక్తి వల్ల వస్తుంది. ప్రస్తుతం ఈ వ్యాధికి వ్యాక్సిన్ లేదని నిపుణులు చెబుతున్నారు. 

ఈ విషయంలో అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. చిన్న పిల్లలు మరింత బలహీనంగా ఉంటారు. తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు తీసుకోవడం, సామాజిక దూరం పాటించడం అవసరం. అయితే హెచ్ఎంపీవీపై భయపడాల్సిన అవసరం లేదని ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు. హెచ్ఎంపీవీ వైరస్‌ను తొలిసారిగా 2001లో గుర్తించారని అన్నారు. ఎప్పటి నుంచో ఇది కొనసాగుతోంది కానీ కరోనా అంత ప్రమాదకరం కాదన్నారు.

అప్రమత్తంగా ప్రభుత్వం

హెచ్ఎంపీవీ కేసులపై నిఘా ఉంచామని ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెబుతోంది. ఇప్పటికే ఇండియాలో నమోదైన మూడు కేసులపై అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. ఈ కేసులపై ఐసీఎంఆర్ నిఘా పెట్టిందని ప్రభుత్వం చెబుతోంది. వీటితో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి కూడా ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ వస్తున్నాయి.

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.