HMPV Virus In India : గుజరాత్‌లో మరో హెచ్‌ఎంపీవీ కేసు.. ఇంతకీ భారత్‌లోని వైరస్ చైనా నుంచి వచ్చినదేనా?
HMPV Virus Cases In India : భారతదేశంలో మూడు హెచ్‌ఎంపీవీ కేసులు నమోదయ్యాయి. తాజాగా గుజరాత్‌లోనూ శిశువుకు ఈ వైరస్ సోకినట్టుగా గుర్తించారు. అయితే చైనాలో వచ్చిన వైరస్.. ఇండియాలో సోకిన కేసులు ఒకటేనా? అని కొందరికి అనుమానం ఉంది.
ఇప్పుడు ప్రపంచం మెుత్తం హెచ్ఎంపీవీ వైరస్ గురించి మాట్లాడుకుంటోంది. చైనాలో ఆసుపత్రుల ముందు జనాలు భారీగా ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. చైనాలోని ఆసుపత్రులలో ముసుగులు ధరించిన వ్యక్తుల ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో దర్శనమిస్తున్నాయి. కోవిడ్‌లాంటి పరిస్థితులు వస్తున్నాయేమోనని ప్రపంచం భయపడుతుంది.
భారత్‌లో మూడు కేసులు
ఇప్పటికే ఈ వైరస్ గురించి భారత్ అప్రమత్తమైంది. ఇప్పటివరకు ఇండియాలో మెుత్తం 3 హెచ్ఎంపీవీ వైరస్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. మరోవైపు కర్ణాటక ఆరోగ్య మంత్రి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం ఓ సలహా జారీ చేసింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వైరస్ గురించి జాగ్రత్తలు చెబుతున్నాయి.
కర్ణాటకలోని బెంగళూరు ఇద్దరు చిన్నారుల్లో హెచ్‌ఎంపీవీ ఇన్‌ఫెక్షన్ ఉన్నట్లు ఐసీఎంఆర్ గుర్తించిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇది కాకుండా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 2 నెలల చిన్నారికి కూడా వ్యాధి సోకింది. బెంగళూరు కేసుల విషయం వెలుగులోకి రావడంతో కర్ణాటక ఆరోగ్య మంత్రి అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. పిల్లలిద్దరూ రొటీన్ చెకప్ కోసం ఆసుపత్రికి వచ్చారు. పరీక్షలు చేయగా రిపోర్ట్ పాజిటివ్ వచ్చింది. చిన్నారుల శాంపిల్స్‌ను ప్రైవేట్ ఆస్పత్రికి పంపించామని కర్ణాటక ఆరోగ్య శాఖ ప్రకటించినా ప్రభుత్వ ల్యాబ్‌లో పరీక్షలు జరగలేదని అంటున్నారు.
చైనా నుంచి వచ్చిన వైరసేనా?
మరోవైపు హెచ్ఎంపీవీ పరీక్షలను నిర్వహించే ల్యాబ్‌ల సంఖ్యను ఐసీఎంఆర్ పెంచుతుంది. ఇది కాకుండా హెచ్ఎంపీవీ కేసులపై నిఘా ఉంచుతుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. వ్యాధి బారిన పడిన పిల్లలకు ప్రయాణం చేసిన చరిత్ర లేదు. ప్రస్తుతం చైనాలో వ్యాపిస్తున్న హెచ్ఎంపీవీకి చెందిన జాతి ఇదేనా అనేది ఇంకా స్పష్టంగా తెలియాలి.
2001 నుంచి ఈ వైరస్
హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్(HMPV) అనేది శ్వాసకోశ వైరస్. ఇది జలుబు, ఇన్ఫ్లుఎంజా వంటి లక్షణాలను కలిగిస్తుంది. స్వల్ప అనారోగ్యం ఉన్నప్పటికీ ఇది న్యుమోనియా వంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా శిశువులు, వృద్ధులు, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థలు ఉన్నవారిపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 2001లో మొదటిసారిగా హెచ్ఎంపీవీ గుర్తించారు. ఇది సింగిల్ స్ట్రాండెడ్ ఆర్ఎన్ఏ వైరస్. యునైటెడ్ కింగ్‌డమ్‌తో సహా వివిధ దేశాల్లో గతంలో కేసులు గుర్తించారు.
ప్రస్తుతం ఏం చేయకూడదు?
తుమ్మేటప్పుడు, దగ్గుతున్నప్పుడు రుమాలు, గుడ్డ ఉపయోగించండి.
దగ్గు, జలుబుతో బాధపడేవారు బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉండాలి.
శానిటైజర్ ఉపయోగించండి.
కరచాలనం చేయకండి.
ఒకే రుమాలు పదే పదే ఉపయోగించవద్దు.
బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం ఆపండి.
ఇన్ఫెక్షన్ వస్తే సొంతంగా మందులు తీసుకోకండి.