హై ఆల్టిట్యూడ్ వెపన్ టెస్ట్ కోసం అండమాన్ పై గగనతలం మూసివేత; రేపు కూడా..-andaman airspace closed today for high altitude weapon test ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  హై ఆల్టిట్యూడ్ వెపన్ టెస్ట్ కోసం అండమాన్ పై గగనతలం మూసివేత; రేపు కూడా..

హై ఆల్టిట్యూడ్ వెపన్ టెస్ట్ కోసం అండమాన్ పై గగనతలం మూసివేత; రేపు కూడా..

Sudarshan V HT Telugu

అండమాన్ నికోబార్ దీవుల్లోని గగనతలాన్ని శుక్రవారం ఉదయం మూడు గంటల పాటు మూసివేశారు. అత్యంత ఎత్తుకు వెళ్లే హై ఆల్టిట్యూడ్ వెపన్ టెస్ట్ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. మే 24 తేదీ ఉదయం కూడా అండమాన్ పై గగన తలాన్ని మూసివేసి, మరో పరీక్ష నిర్వహిస్తారు.

అండమాన్ పై గగనతలం మూసివేత (AP)

అండమాన్ నికోబార్ దీవుల్లోని గగనతలాన్ని త్రివిధ దళం నిర్వహించిన హై ఆల్టిట్యూడ్ ఆయుధ పరీక్షకు వీలుగా శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి మూడు గంటల పాటు మూసివేశారు. అండమాన్ నికోబార్ కమాండ్ సీనియర్ అధికారి ఒకరు పీటీఐతో మాట్లాడుతూ, "ఈ రోజు మాదిరిగానే, అండమాన్ మరియు నికోబార్ దీవుల చుట్టూ ఉన్న గగనతలాన్ని రేపు, అనగా మే 24వ తేదీ కూడా మూడు గంటలు (ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు) పాటు మూసివేస్తారు. మే 16న ఎయిర్ మెన్ (నోటామ్)కు నోటీసులు జారీ చేశాం. మే 23, 24 తేదీల్లో ఆ సమయంలో అండమాన్ మీదుగా పౌర విమానాలను అనుమతించబోము’’ అని వెల్లడించారు.

గరిష్టంగా 500 కిలోమీటర్లు

అండమాన్ నికోబార్ దీవులపై గరిష్టంగా 500 కిలోమీటర్ల కారిడార్ పొడవున్న గగనతలాన్ని మే 23, 24 తేదీల్లో యూనివర్సల్ టైమ్ కోఆర్డినేటెడ్ యూటీసీ ప్రకారం 01:30 నుంచి 04:30 (భారత కాలమానం ప్రకారం ఉదయం 7 నుంచి 10 గంటలు) వరకు పరిమితం చేయనున్నట్లు నోటామ్ తెలిపింది.

హై ఆల్టిట్యూడ్ వెపన్ టెస్ట్

ఈ రోజు హై ఆల్టిట్యూడ్ వెపన్ టెస్ట్ ను విజయవంతంగా నిర్వహించామని, రేపు కూడా ఇదే తరహా పరీక్ష నిర్వహిస్తామని ఆ అధికారి తెలిపారు. అండమాన్ నికోబార్ దీవుల్లో ఇది రొటీన్ పద్ధతి అని, గతంలో కూడా ఇలాంటి పరీక్షలు చేశామని చెప్పారు. ఈ హై ఆల్టిట్యూడ్ వెపన్ టెస్ట్ కోసమే గగనతలాన్ని మూసివేశామన్నారు. అండమాన్ నికోబార్ కమాండ్ (ఏఎన్ సీ) భారత్ లో ఉన్న ఏకైక త్రివిధ దళాల కమాండ్.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.