Anantnag encounter: కశ్మీర్లో కొనసాగుతున్న భారీ ఎన్ కౌంటర్; ఇప్పటికే అమరులైన ముగ్గురు అధికారులు
Anantnag encounter: దక్షిణ కశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. బుధవారం నుంచి ఈ ఎన్ కౌంటర్ కొనసాగుతోంది.
Anantnag encounter: కశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లాలో ఉన్న కొకెర్ నాగ్ ప్రాంతంలోని గడోలె అడవిలో లష్కరే తోయిబా ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎన్ కౌంటర్ కొనసాగుతోంది. ఇప్పటివరకు ఈ ఎన్ కౌంటర్ లో ముగ్గురు అధికారులు చనిపోయారు. మరో జవాను ఆచూకీ తెలియడం లేదు.

అమరులైన ముగ్గురు అధికారులు
లష్కరే తోయిబా ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో కశ్మీర్ పోలీసులతో కలిసి ఆర్మీ బుధవారం అనంత్ నాగ్ జిల్లాలోని గడోలె అటవీ ప్రాంతంలో గాలింపు చేపట్టింది. వారికి ఉగ్రవాదుల నుంచి అనూహ్యంగా పెద్ద ఎత్తున ఎదురు దాడి ప్రారంభమైంది. ఉగ్రవాదుల కాల్పుల్లో రాష్ట్రీయ రైఫిల్స్ కు చెందిన ఆర్మీ ఆఫీసర్స్ కల్నల్ మన్ ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్ దోంచక్ ప్రాణాలు కోల్పోయారు. జమ్మూకశ్మీర్ పోలీసు విభాగానికి చెందిన డీఎస్పీ హుమాయిన్ ముజమిల్ భట్ కూడా అమరుడయ్యాడు. ఈ ఎన్ కౌంటర్ లో పాల్గొంటున్న మరో జవాను కూడా శుక్రవారం ఉదయం నుంచి కనిపించడం లేదని పోలీసులు తెలిపారు.
కాల్పులు, బాంబు పేలుళ్లు
శుక్రవారం ఉదయం నుంచి కూడా ఎన్ కౌంటర్ జరుగుతున్న ప్రదేశం నుంచి పెద్ద ఎత్తున కాల్పులు, బాంబులు పేలిన శబ్దాలు వినిపిస్తున్నాయి. ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు భారీగా ఆయుధాలు, పేలుడు పదార్ధాలతో భద్రతా బలగాలపై కాల్పులు జరుపుతున్నారు. వారిలో స్థానిక కమాండ్ ఉజైర్ ఖాన్ కూడా ఉన్నాడు. ఉజైర్ ఖాన్ గత సంవత్సరమే ఈ ఉగ్ర సంస్థలో చేరాడు. స్థానికుడు కావడంతో అతడికి ఆ అడవిలో అణువణువు తెలుసు. దాంతో, వారిని మట్టుపెట్టడం భద్రతా బలగాలకు సమస్యగా మారింది. అయితే, ఉగ్రవాదులను భద్రతాదళాలు చుట్టుముట్టాయని, అతి త్వరలోనే వారిని మట్టు పెడ్తాయని పోలీసులు తెలిపారు. ఈ ఎన్ కౌంటర్ లో ఆర్మీ, జమ్మూకశ్మీర్ పోలీస్, సీఆర్పీఎఫ్ బలగాలు పాల్గొంటున్నాయి.