పంజాబ్ అమృత్‌సర్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మజితా బ్లాక్ పరిధిలోని గ్రామాల్లో కల్తీ మద్యం సేవించి 15 మంది మృతి చెందారు. మరో 10 మంది పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.
బాధితుల్లో ఎక్కువ మంది బ్లాక్‌లోని భంగలి కలాన్, తరివాల్, సంఘా, మరారీ కలాన్ ప్రాంతాలకు చెందినవారు ఉన్నారు. పరిస్థితి విషమంగా ఉన్న వారిని అమృత్సర్ సివిల్ ఆసుపత్రికి తరలించారు.
అమృత్సర్ డీసీ సాక్షి సాహ్ని ఆసుపత్రిని సందర్శించి పరిస్థితిని సమీక్షించి మృతుల సంఖ్యను ధృవీకరించారని, ఇది మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
“వీరంతా ఆదివారం సాయంత్రం ఒకే సోర్స్ నుంచి మద్యం కొనుగోలు చేసినట్లు తెలిసింది. వీరిలో కొందరు సోమవారం ఉదయం మృతి చెందగా స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వకుండా దహన సంస్కారాలు నిర్వహించారు. కొందరు ఈ విషయాన్ని దాచిపెట్టి బాధితులు గుండెపోటుతో చనిపోయారని చెప్పారు. మరణాలపై సోమవారం అర్థరాత్రి మాకు సమాచారం అందింది,” అని మజితా ఎస్‌హెచ్ అబ్తాబ్ సింగ్ తెలిపారు.
“ఇప్పటివరకు 10కిపైగా మంది చనిపోయారు. అన్ని విధాలుగా సాయం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మృతుల సంఖ్య పెరగకుండా చూసుకునేందుకు చర్యలు చేపట్టాము. ఘటనపై దర్యాప్తు జరుగుతోంది,” అని అమృత్సర్ డిప్యూటీ కమిషనర్ వెల్లడించారు.
రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని, ప్రధాన సరఫరాదారులు ప్రభ్‌జిత్ సింగ్, సాహిబ్ సింగ్‌లను రాజసంసిలో అరెస్టు చేశామని పంజాబ్ ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. సరఫరాదారుల నుంచి మద్యం కొనుగోలు చేసి గ్రామాలకు పంపిణీ చేసిన మరో నలుగురు నిందితులను కూడా అరెస్టు చేసినట్టు అధికారులు వివరించారు.
అక్రమ మద్యాన్ని సరఫరా చేస్తున్న వారిని పట్టుకునేందుకు దర్యాప్తు బృందాలు ఇతర రాష్ట్రాల్లోనూ దర్యాప్తు ప్రారంభించాయి.
ఐదేళ్ల క్రితం రాష్ట్రంలోని తార్న్ తరన్, అమృత్ సర్, గురుదాస్పూర్ జిల్లాల్లో పెను విషాదం చోటుచేసుకుంది. 2020 జులై, ఆగస్టు నెలల్లో మాఝా ప్రాంతంలోని మూడు జిల్లాలైన తార్న్ తరన్, గురుదాస్పూర్, అమృత్‌సర్‌లో కల్తీ మద్యం సేవించి సుమారు 130 మంది మరణించగా, డజను మంది చూపు కోల్పోయారు. ఒక్క తార్న్ తరన్ జిల్లాలోనే 80 మంది మరణించడం గమనార్హం.