Maharashtra Politics : ఢిల్లీ చేరుకున్న దేవేంద్ర ఫడ్నవీస్-amid power tussle in maharashtra bjp leader devendra fadnavis reaches delhi ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Maharashtra Politics : ఢిల్లీ చేరుకున్న దేవేంద్ర ఫడ్నవీస్

Maharashtra Politics : ఢిల్లీ చేరుకున్న దేవేంద్ర ఫడ్నవీస్

HT Telugu Desk HT Telugu
Jun 28, 2022 03:15 PM IST

మహారాష్ట్ర ప్రభుత్వం సంక్షోభంలో పడినప్పటి నుంచి అనేక మలుపులు తిరుగుతోంది. తాజాగా ఫడ్నవిస్ ఢిల్లీ వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.

<p>మంగళవారం రాజ్యసభ ఎంపీ మహేష్ జఠ్మలానీతో పాటు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్&nbsp;</p>
మంగళవారం రాజ్యసభ ఎంపీ మహేష్ జఠ్మలానీతో పాటు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ (ANI)

న్యూ ఢిల్లీ, జూన్ 28: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ మంగళవారం ఢిల్లీ చేరుకున్నారు. మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) ప్రభుత్వం రాజకీయ సంక్షోభంలో చిక్కుకున్న తరుణంలో ఆయన మరోసారి దేశ రాజధానికి వచ్చారు.

రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు సోమవారం మహారాష్ట్ర బీజేపీ యూనిట్‌లో కోర్ కమిటీ సమావేశం జరిగిన తరువాత ఆయన ఢిల్లీ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. 39 మంది శివ సేన రెబల్ ఎమ్మెల్యేలు సహా మొత్తం 48 మంది ఎమ్మెల్యేలు గౌహతిలోని రాడిసన్ బ్లూ హోటల్‌లో జూన్ 22 నుంచి క్యాంపు నడుపుతున్న సంగతి తెలిసిందే.

2019 అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా, ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఫ్లోర్ టెస్ట్ కాకముందే అజిత్ పవార్ వైదొలగడంతో కొత్త ప్రభుత్వం కొలువుదీరలేకపోయింది. ఆ నేపథ్యంలో ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్‌లు ఎన్నికల అనంతర పొత్తుల కూటమి ఏర్పాటు చేశాయి. ఉద్దవ్ థాకరేను ముఖ్యమంత్రిని చేశాయి. మొత్తం 288 స్థానాలు ఉండగా 2019 ఎన్నికల్లో బీజేపీకి 105 సీట్లు, శివసేనకు 56 సీట్లు, ఎన్సీపీకి 54 సీట్లు, కాంగ్రెస్‌కు 44 సీట్లు వచ్చాయి.

కాగా ఈ ఉదయం శివసేన నేత సంజయ్ రౌత్ బీజేపీకి, దేవేంద్ర ఫడ్నవిస్‌కు హెచ్చరిక జారీచేశారు. ప్రస్తుత సంక్షోభంలో జోక్యం చేసుకోరాదని హెచ్చరించారు. అలా చేస్తే బీజేపీకి, ఫడ్నవిస్‌కు, మోదీకి చెడ్డ పేరు వస్తుందని హితవు పలికారు.

శివసేనకు, ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని తిరుగుబాటు ఎమ్మెల్యేల బృందం మధ్య సాగుతున్న రాజకీయ సంక్షోభం నిన్న సుప్రీం కోర్టుకు చేరిన సంగతి తెలిసిందే. తమపై అనర్హత వేటు చర్యను సభాపతి నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఏక్‌నాథ్ షిండే, తిరుగుబాటు ఎమ్మెల్యేలు పిటిషన్లు దాఖలు చేశారు. అంతేకాకుండా తిరుగుబాటు ఎమ్మెల్యేల భద్రతపై షిండే మరో పిటిషన్ దాఖలు చేశారు.

ఆయా పిటిషన్లను విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు ధర్మాసనం సభాపతి పంపిన అనర్హత వేటు నోటీసులకు సమాధానం ఇచ్చేందుకు జూలై 12 వరకు గడువు ఇస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన అనంతరం ‘ఇది బాలాసాహెబ్ థాకరే హిందుత్వ, ఆనంద్ దిఘే ఆలోచనవిధానాల విజయం..’ అంటూ ఏక్‌నాథ్ షిండే ట్వీట్ చేశారు.

ఇక శివసేన నేత ఆదిత్య థాకరే శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు పార్టీకి ద్రోహం చేశారని, శివసేన నుంచి మురికి వెళ్లిపోయిందని వ్యాఖ్యానించారు.

ముంబైలో శివసేన కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ అసోం వరదల్లో ఇక్కట్లు పడుతుంటే తమ పార్టీ తిరుగుబాటు నేతలు గౌహతిలోని హోటల్లో ఎంజాయ్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

కాగా ఏక్‌నాథ్ షిండే శిబిరంలో ఉన్న 20 మంది ఎమ్మెల్యేలలో 15 మంది తమతో టచ్‌లో ఉన్నారని, వారిని గౌహతి నుంచి ముంబై తీసుకొస్తామని అన్నారు. మే నెలలోనే ఏక్‌నాథ్ షిండేకు ముఖ్యమంత్రి పీఠాన్ని ఆఫర్ చేసినప్పటికీ ఆయన డ్రామాలాడారని వ్యాఖ్యానించారు.

Whats_app_banner