American Plane Crash : ఘోర ప్రమాదం.. ఢీకొని నదిలో కూలిపోయిన విమానం, హెలికాప్టర్-american airlines flight collides with helicopter near washington reagan airport ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  American Plane Crash : ఘోర ప్రమాదం.. ఢీకొని నదిలో కూలిపోయిన విమానం, హెలికాప్టర్

American Plane Crash : ఘోర ప్రమాదం.. ఢీకొని నదిలో కూలిపోయిన విమానం, హెలికాప్టర్

Anand Sai HT Telugu
Jan 30, 2025 10:45 AM IST

US Plane Crash : అమెరికాలోని వాషింగ్టన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. 60 మందికిపైగా ప్రయాణికులతో వెళ్తున్న విమానం.. మరో హెలికాప్టర్‌ పరస్పరం ఢీకొన్నాయి. ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

ఘోర విమాన ప్రమాదం
ఘోర విమాన ప్రమాదం (Alex Brandon/AP)

వాషింగ్టన్ నేషనల్ ఎయిర్ పోర్టులో ఘోర ప్రమాదం జరిగింది. బుధవారం రాత్రి ల్యాండ్ అవుతుండగా అమెరికన్ ఎయిర్ లైన్స్ కు చెందిన ప్రాంతీయ జెట్… హెలికాప్టర్ ను ఢీకొంది. దీంతో విమానం, హెలికాప్టర్ పోటోమాక్‌ నదిలో కూలిపోయాయి. ఘటనాస్థలంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ప్రయాణీకుల విమానం, ఆర్మీ హెలికాప్టర్ ఢీకొన్నాయి. విమానంలో చాలా మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ విమాన ప్రమాదం విమానాశ్రయం సమీపంలో జరిగింది. విమానం అమెరికాలోని కాన్సాస్ సిటీ నుంచి వాషింగ్టన్‌కు వస్తోంది. మరోవైపు యూఎస్ ఆర్మీ హెలికాప్టర్ బ్లాక్‌హాక్(H-60) గాలిలో ఉంది. ఈ సమయంలో ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదం తర్వాత పొటోమాక్ నదిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

అమెరికన్ ఎయిర్ లైన్స్ విమానం -5342లో 60 మంది ప్రయాణికులతో పాటు నలుగురు సిబ్బంది ఉన్నట్లు సీబీఎస్ న్యూస్ పేర్కొంది. ఈ ప్రమాదం నేపథ్యంలో రోనాల్డ్ రీగన్ విమానాశ్రయంలో టేకాఫ్, ల్యాండింగ్ లను నిలిపివేశారు. ప్రయాణికుల గురించి ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఈ ఘటనకు సంబంధించి అమెరికా వైస్ ప్రెసిడెంట్ జెడి వాన్స్ ఎక్స్‌లో స్పందించారు. 'మేం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం, ప్రస్తుతానికి ఉత్తమంగా ఉంటుందని ఆశిస్తున్నాం.' అని అన్నారు.

కొనసాగుతున్న గాలింపు చర్యలు…

ఈ ప్రమాదంలో ఎంత మంది చనిపోయారనే దానిపై స్పష్టత రాలేదని అమెరికా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అమెరికా సెనేటర్ టెడ్ క్రూజ్ చెప్పారు. పోటోమాక్ నదిలో రెస్క్యూ బోట్లు సహాయక చర్యలు నిర్వహిస్తున్నాయి.

ప్రయాణికుల విమానాన్ని ఢీకొన్న హెలికాప్టర్ యూఎస్ మిలిటరీకి చెందినదని కాన్సాస్‌కు చెందిన యూఎస్ సెనేటర్ రోజర్ మార్షల్ తెలిపారు. విమానంలో 60 మంది ఉన్నారని కూడా చెప్పారు. 'ఈ రోజు మాకు చాలా విషాదకర వార్త వచ్చింది. అది ఒక పీడకలలాగా అనిపిస్తుంది. దాదాపు 60 మంది ప్రయాణికులతో దేశ రాజధానికి బయలుదేరిన విమానం మిలటరీ హెలికాప్టర్‌ను ఢీకొట్టింది.' అని ఎక్స్‌లో రోజర్ పోస్ట్ చేశారు.

Whats_app_banner
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.