US Plane Crash : అమెరికాలో మరో విమాన ప్రమాదం.. టెకాఫ్ అయిన కొద్దిసేపటికే
US Plane Crash : అమెరికాలో మరో విమాన ప్రమాదం జరిగింది. టెకాఫ్ అయిన కొత్తి సమయంలోనే ఈ ఘటన సంభవించింది.
అమెరికాలో మరో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఫిలడెల్ఫియాలోని షాపింగ్ మాల్ సమీపంపో ఓ చిన్న విమానం టేకాఫ్ అయిన 30 సెకన్లకే కుప్పకూలింది. దాని నుంచి మంటలు రావడం మొదలయ్యాయి. విమానంలో ప్రయాణిస్తున్న వ్యక్తుల ఆరుగురు అని ఎన్డీటీవీ పేర్కొంది. రాష్ట్ర గవర్నర్ జోష్ షాపిరో ఈ విషయాన్ని వెల్లడించారు. ఘటన అనంతరం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈశాన్య ఫిలడెల్ఫియా విమానాశ్రయానికి 4.8 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. కొన్ని ఇళ్లు కూడా అగ్నికి ఆహుతైనట్లు ప్రమాద స్థలంలోని చిత్రాల ద్వారా తెలుస్తోంది. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక శాఖ ప్రయత్నాలు చేస్తున్నది.

విమానంలో ఆరుగురు!
స్ప్రింగ్‌ఫీల్డ్-బ్రాన్సన్ నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే విమానం ఈశాన్య ఫిలడెల్ఫియా విమానాశ్రయం నుండి బయలుదేరింది. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం, లియర్‌జెట్ 55 ఎగ్జిక్యూటివ్ ఎయిర్‌క్రాఫ్ట్ ఆరుగురు వ్యక్తులతో ప్రయాణిస్తున్నది. నగరంలోని ఇళ్లు, దుకాణాలు, రద్దీగా ఉండే ప్రాంతంలో కూలిపోయింది. ప్రాణనష్టం గురించి సమాచారం లేదు.
ఇటీవలే ఘోర ప్రమాదం
ఇటీవలే అమెరికాలో ఘరో విమాన ప్రమాదం జరిగింది. దాదాపు 25 ఏళ్లలో అమెరికాలో జరిగిన అత్యంత ఘోరమైన విమాన ప్రమాదం అది. తాజాగా ఇప్పుడు మరో ప్రమాదం సంభవించింది. రెండ్రోజుల కిందట అమెరికన్ ఎయిర్ లైన్స్‌కు చెందిన 5342 విమానం బుధవారం రాత్రి విమానాశ్రయానికి సమీపంలో మిలటరీ హెలికాప్టర్‌ను ఢీకొట్టింది. రోనాల్డ్ రీగన్ జాతీయ విమానాశ్రయంలో మిలటరీ హెలికాప్టర్, ప్యాసింజర్ విమానం ఢీకొని నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 67 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు 40కి పైగా మృతదేహాలను వెలికితీశారు. దీనికి గల కారణాలపై తాము ఊహాగానాలు చేయబోమని ఫెడరల్ ఇన్వెస్టిగేటర్లు తెలిపారు.
ప్రమాదం జరిగిన సమయంలో సైనిక విమానం చాలా ఎత్తులో ఎగురుతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. 'ఇది 200 అడుగుల పరిమితిని మించి ఉంది.' అని ట్రంప్ శుక్రవారం ఉదయం తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేశారు. ప్రమాదానికి ఎత్తు కారణమని తెలుస్తోందని రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ తెలిపారు. పెంటగాన్ చీఫ్ పీట్ హెగ్సెత్ అమెరికా సైన్యానికి శిక్షణ కొనసాగించాల్సిన ఆవశ్యకతను ప్రస్తావించారు. హెలికాప్టర్ బ్లాక్ బాక్స్ ఇంకా దొరకలేదని చెప్పారు.