PM Modi congratulates Rishi Sunak: ‘భారత్, యూకే సంబంధాలకు నేనే ప్రత్యక్ష ఉదాహరణ’
PM Modi congratulates Rishi Sunak:బ్రిటన్ కు నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన భారత సంతతికి చెందిన రుషి సునాక్ తో ప్రధాని మోదీ గురువారం ఫోన్ లో సంభాషించారు.
PM Modi congratulates Rishi Sunak: భారత్, యూకేల మధ్య ఉన్న చారిత్రక సంబంధాలకు ప్రత్యక్ష ఉదాహరణ తనేనని ఈ సందర్భంగా రుషి సునక్ ప్రధాని మోదీతో వ్యాఖ్యానించారు.
PM Modi congratulates Rishi Sunak: ద్వైపాక్షిక సంబంధాలపై..
బ్రిటన్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రుషి సునక్ కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. వారిద్దరి మధ్య చోటు చేసుకున్న సంభాషణలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడం ప్రధానాంశంగా ఉంది. రెండు దేశాల మధ్య సమగ్ర స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (free trade agreement -FTA) సాధ్యమైనంత త్వరగా అమలు చేయాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. ఈ నవంబర్ లోపే FTA అమలు కావాల్సి ఉన్నా.. బ్రిటన్ లో నెలకొన్న రాజకీయ సంక్షోభం కారణంగా అది వాయిదా పడింది. భారత్, బ్రిటన్ ల మధ్య రక్షణ, ఆర్థిక సంబంధాలను మెరుగుపర్చుకోవాలని అభిప్రాయపడ్డారు.
PM Modi congratulates Rishi Sunak: ప్రధాని మోదీ ట్వీట్
బ్రిటన్ ప్రధాని రుషి సునక్ తో ఫోన్ సంభాషణ అనంతరం ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. యూకే నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రుషి సునక్ ను అభినందించానని తెలిపారు. ఇరుదేశాల మధ్య సహకారం మరింత బలోపేతమయ్యేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించామన్నారు. బ్రిటన్ ప్రధాని రుషి సునక్ కూడా ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు. కొత్త బాధ్యతలు ప్రారంభమవుతున్న సమయంలో ప్రేమపూరిత అభినందనలు అందాయని ఆయన వ్యాఖ్యానించారు. రెండు దేశాల మధ్య ఎన్నో సారూప్యాలు ఉన్నాయన్నారు. రెండు దేశాల మధ్య నెలకొన్న చారిత్రక సంబంధాలకు తానే ప్రత్యక్ష ఉదాహరణ అని వ్యాఖ్యానించారు.