All-woman bench in SC: సుప్రీంకోర్టులో ప్రత్యేక మహిళా ధర్మాసనం
All-woman bench in SC: సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తులతో ఒక ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటైంది. మహిళలకు సంబంధించిన అంశాలు, వైవాహిక వివాదాలు, మహిళలకు సంబంధించిన బెయిల్ కేసులను ఈ ధర్మాసనం విచారిస్తుంది.
All-woman bench in SC: సుప్రీంకోర్టు లో ప్రత్యేక మహిళా ధర్మాసనం ఏర్పాటైంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ డిసెంబర్ 1న ఈ మహిళా ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు.
All-woman bench in SC: ఇద్దరు న్యాయమూర్తులతో..
జస్టిస్ హిమ కొహ్లీ, జస్టిస్ బేలా ఎం త్రివేదీలు ఈ ప్రత్యేక మహిళా ధర్మాసనంలో న్యాయమూర్తులుగా ఉంటారు. వైవాహిక వివాదాలు, వారి బెయిల్ విచారణలు, ఇతర బదిలీ పిటిషన్లను ఈ ధర్మాసనం విచారిస్తుంది. సుప్రీంకోర్టు లోని కోర్టు నెంబర్ 11 లో ఈ ధర్మాసనం విచారణ జరుపుతుంది. ఈ ధర్మాసనం ముందు ప్రస్తుతం 32 పిటిషన్లు లిస్ట్ అయి ఉన్నాయి. వాటిలో 10 బెయిల్ పిటిషన్లు, 10 వైవాహిక వివాదాలకు సంబంధించిన బదిలీ పిటిషన్లు ఉన్నాయి. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ముగ్గురు మహిళా న్యాయమూర్తులు ఉన్నారు. వారు జస్టిస్ హిమ కొహ్లీ, జస్టిస్ బేలా ఎం త్రివేదీ, జస్టిస్ బీవీ నాగరత్న. వీరిలో జస్టిస్ నాగరత్న 2027లో సుప్రీంకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి కానున్నారు.
All-woman bench in SC: ఇది మూడోసారి..
అందరూ మహిళా న్యాయమూర్తులతో ఒక ధర్మాసనం ఏర్పాటు కావడం సుప్రీంకోర్టు చరిత్రలో ఇది మూడో సారి. మొదట 2013 లో తొలి మహిళా ధర్మాసనం ఏర్పాటైంది. ఆ ఆల్ విమన్ బెంచ్ లో జస్టిస్ జ్ఞాన సుధ మిశ్రా, జస్టిస్ రంజన ప్రకాశ్ దేశాయి సభ్యులుగా ఉన్నారు. ఆ తరువాత, రెండో మహిళా ధర్మాసనం 2018లో ఏర్పాటైంది. ఆ బెంచ్ లో న్యాయమూర్తులు జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ ఇందిర బెనర్జీ సభ్యులుగా ఉన్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో 27 మంది న్యాయమూర్తులు ఉన్నారు. సుప్రీంకోర్టులో మొత్తం ఉండాల్సిన న్యాయమూర్తుల సంఖ్య 34.