బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. ప్రశాంత్ కిషోర్ (పీకే) నేతృత్వంలోని జన్ సూరాజ్ పార్టీ తన తొలి విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. మొత్తం 51 మంది అభ్యర్థులతో కూడిన ఈ జాబితాలో డాక్టర్లు, న్యాయవాదులు, రిటైర్డ్ అధికారులు, పోలీసు అధికారులతో పాటు ఓ ట్రాన్స్‌జెండర్ మహిళ అయిన ప్రీతి కిన్నర్‌కు అవకాశం దక్కడం బిహార్ రాజకీయాల్లో సంచలనంగా మారింది.
జన్ సూరాజ్ పార్టీ ప్రీతి కిన్నర్‌ను గోపాల్‌గంజ్ జిల్లాలోని భోరే నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా ప్రకటించింది. ఇక్కడ.. ప్రీతి, రాష్ట్రంలోనే హై-ప్రొఫైల్ కలిగిన సిట్టింగ్ మంత్రితో పోటీ పడబోతున్నారు. భోరే ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే, నితీష్ కుమార్ మంత్రివర్గంలో బిహార్ విద్యాశాఖ మంత్రి అయిన సునీల్ కుమార్‌తో ఆమె పోటీ పడనున్నారు.
భోరే బ్లాక్ పరిధిలోని కల్యాణ్‌పూర్ గ్రామానికి చెందిన ప్రీతి, చాలా కాలంగా సామాజిక కార్యకర్తగా పనిచేస్తున్నారు. స్థానిక సమస్యలపై ఆమెకున్న అవగాహన, సాధారణ ప్రజల కష్టాలను శాసనసభ దృష్టికి తీసుకెళ్లడానికి ఉపయోగపడుతుందని ప్రశాంత్ కిశోర్ పార్టీ విశ్వసిస్తున్నట్లు సమాచారం.
రాజకీయ వ్యూహకర్త నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ప్రశాంత్ కిషోర్.. బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓ ప్రముఖ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రజల కోసం వారు చేసిన పని ఆధారంగా అభ్యర్థులను ఎంచుకున్నామని స్పష్టం చేశారు. ఒకవేళ తన అభ్యర్థులు ఎన్నికల్లో గెలవకపోతే, అది తన వైఫల్యం కాదని, బిహార్ ప్రజల వైఖరిని అది ప్రతిబింబిస్తుందని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.
"అలాంటి వ్యక్తులకు మీరు ఓటు వేయకపోతే, అది ప్రశాంత్ కిషోర్‌పై భారం కాదు. అది బిహార్ ప్రజల భుజాలపై ఉన్న భారం," అని పీకే పేర్కొన్నారు.
తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న జన్ సూరాజ్ పార్టీని ప్రస్తుతం చాలా మంది ఒక 'వైల్డ్ కార్డ్' పార్టీగా పరిగణిస్తున్నారు.
పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థుల్లో ప్రముఖ గణిత శాస్త్రవేత్త కేసీ సిన్హా కూడా ఉన్నారు. ఆయన గతంలో పట్నా విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా పనిచేశారు. ఆయన రచించిన పుస్తకాలను బిహార్ పాఠశాలల్లో దశాబ్దాలుగా అనుసరిస్తున్నారు!
మరో అభ్యర్థి వైబీ గిరి.. మాంఝీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన గతంలో బిహార్ మాజీ అదనపు అడ్వకేట్ జనరల్‌గా పట్నా హైకోర్టులో కేంద్ర ప్రభుత్వ కేసుల కోసం అదనపు సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా పనిచేశారు.
భారతదేశంలో ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులు దశాబ్ద కాలంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పటికీ, విజయం సాధించిన వారు చాలా తక్కువే!
ఈ సంవత్సరం ప్రారంభంలో దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఒక ట్రాన్స్‌జెండర్ అభ్యర్థికి కేవలం 85 ఓట్లు మాత్రమే లభించాయి.
గత సంవత్సరం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన ముగ్గురు ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులు తమ డిపాజిట్లను కోల్పోయారు. ఇది దేశంలో రాజకీయ ప్రాతినిధ్యం పొందడానికి ఆ వర్గం ఎదుర్కొంటున్న సవాళ్లను స్పష్టం చేస్తోంది.
సంబంధిత కథనం