Alexa Benefits: ‘‘అలెక్సా.. కుక్కలా మొరుగు’’- ఆ బాలిక తెలివికి హ్యాట్సాఫ్
Inspiring story: ఉత్తరప్రదేశ్ లోని బస్తీలో 13 ఏళ్ల బాలిక తనను, తన మేనల్లుడిని కోతుల దాడి నుంచి తెలివిగా కాపాడుకుంది. అమెజాన్ అలెక్సా సాయంతో ఆమె తెలివైన వ్యూహాన్ని ఉపయోగించి, కోతులను బెదరగొట్టింది. విషయం తెలుసుకున్న అందరూ ఆ బాలిక సమయస్ఫూర్తికి హ్యాట్సాఫ్ అంటున్నారు.

Alexa Benefits: ఉత్తరప్రదేశ్ లోని బస్తీకి చెందిన 13 ఏళ్ల బాలిక అమెజాన్ వర్చువల్ వాయిస్ అసిస్టెంట్ అలెక్సా (Alexa) సాయంతో ప్రమాదకరమైన కోతుల దాడి నుంచి తప్పించుకోగలిగింది. తనతో పాటు, తన మేనల్లుడి ప్రాణాలను కాపాడింది.
అసలు ఏం జరిగిందంటే..
ఉత్తర ప్రదేశ్ లోని బస్తీలో ఉన్న ఆవాస్ వికాస్ కాలనీలో నికిత అనే 13 ఏళ్ల బాలిక తన 15 నెలల మేనల్లుడితో కలిసి సోఫాలో ఆడుకుంటోంది. కుటుంబ సభ్యులు వేరే గదుల్లో ఉన్నారు. ఆ సమయంలో డోర్ తీసి ఉండడంతో ఒక్కసారిగా ఒక కోతుల గుంపు ఇంట్లోకి జొరబడి, కిచెన్ లో సామాన్లను చిందరవందర చేసింది. కొన్ని కోతులు నికిత కూర్చున్న సోఫా వైపు రాసాగాయి. దాంతో, నికిత తీవ్ర భయాందోళనలకు గురైంది. ఆమెకు ఫ్రిజ్ పై ఆమెజాన్ అలెక్సా డివైజ్ కనిపించింది.
అలెక్సా.. కుక్కలా అరువు
దాంతో, తెలివిగా ఆలోచించిన నికిత.. అలెక్సా (Alexa) కు వాయిస్ ఆర్డర్స్ ఇచ్చింది. ‘‘అలెక్సా కుక్కలా గట్టిగా మొరుగు’’ అని అలెక్సాకు వాయిస్ ఆర్డర్ ఇచ్చింది. దాంతో, వెంటనే అలెక్సా డివైజ్ నుంచి గట్టిగా కుక్క అరుపులు వినిపించడం ప్రారంభమైంది. దాంతో, భయపడిన ఆ కోతులు వెంటనే అక్కడి నుంచి పారిపోయాయి.
సమయస్ఫూర్తికి అభినందనలు
ప్రమాదకరమైన పరిస్థితి ఎదురైనా, భయపడకుండా, సమయస్ఫూర్తితో వ్యవహరించి, అలెక్సా సాయంతో కోతుల దాడి నుంచి బయటపడిన నికితను అంతా అభినందించారు. తన తెలివితో, సమయస్ఫూర్తితో తన ప్రాణాలతో పాటు తన మేనకోడలి ప్రాణాలు కూడా కాపాడిందని అంతా ప్రశంసించారు. ఈ ఘటనపై నికిత మాట్లాడుతూ.. ‘‘కొంతమంది అతిథులు మా ఇంటికి వచ్చారు. వారు వెళ్తున్న సమయంలో గేటును తెరిచే ఉంచారు. దాంతో, కోతులు వంటగదిలోకి ప్రవేశించి వస్తువులను అటూ ఇటూ విసిరేయడం ప్రారంభించాయి. పిల్లవాడు భయపడ్డాడు. నాకు కూడా భయమేసింది. కానీ అప్పుడు నేను ఫ్రిజ్ పై ఉన్న అలెక్సాను చూశాను. వెంటనే కుక్క శబ్దాన్ని ప్లే చేయమని అలెక్సాను అడిగాను. ఆ అరుపు శబ్దంతో కోతులు భయపడి పారిపోయాయి’’ అని వివరించింది.
టెక్నాలజీ సాయం
ఈ ఘటనలో టెక్నాలజీ సాయాన్ని కూడా మరవలేమని ఈ విషయం తెలుసుకున్నవారు వ్యాఖ్యానిస్తున్నారు. ఇద్దరు పిల్లలపై కోతులు దాడి చేసే ముప్పును ఎదుర్కోవడంలో టెక్నాలజీ సాయం చేసిందన్నారు. అలెక్సా అనేది అమెజాన్ (Amazon) క్లౌడ్ ఆధారిత వర్చువల్ అసిస్టెంట్. వాయిస్ కమాండ్స్ తో దీనిని వివిధ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. ఇది వాతావరణ వివరాలు తెలియజేయడం నుంచి, స్మార్ట్ హోమ్ పరికరాలను నియంత్రించడం వరకు అనేక పనులను చేయగలదు. ఇప్పుడు ఇది ఒక ప్రాణరక్షక సాధనంగా కూడా ఉపయోగపడుతుందని తేలింది.