విధిని ఎవరు మర్చలేరు! రెండుసార్లు లండన్​ ట్రిప్​ని రద్దు చేసుకున్న మాజీ సీఎం, చివరికి..-air india plane crash rupani deferred london visit twice because of ludhiana west bypoll ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  విధిని ఎవరు మర్చలేరు! రెండుసార్లు లండన్​ ట్రిప్​ని రద్దు చేసుకున్న మాజీ సీఎం, చివరికి..

విధిని ఎవరు మర్చలేరు! రెండుసార్లు లండన్​ ట్రిప్​ని రద్దు చేసుకున్న మాజీ సీఎం, చివరికి..

Sharath Chitturi HT Telugu

ఎయిరిండియా విమాన ప్రమాదం మృతుల్లో గుజరాత్​ మాజీ సీఎం విజయ్​ రూపానీ కూడా ఉన్నారు. కాగా, ఈయన ఈ నెలలో రెండుసార్లు తన లండన్​ ట్రిప్​ని రద్దు చేసుకుని, చివరికి గురువారం విమానం ఎక్కారు!

గుజరాత్​ మాజీ సీఎం విజయ్​ రూపానీ (ASHIS PRAMANIK)

అహ్మదాబాద్​లో గురువారం జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం యావత్​ భారత దేశంతో పాటు ప్రపంచాన్ని షాక్​కు గురిచేసింది. ఈ ఘటనలో విమానం లోపల ఉన్న 242 మంది ప్రాణాలు కోల్పోయరు. మృతుల్లో గుజరాత్​ మాజీ సీఎం, బీజేపీ పంజాబ్​ ఇంచార్జ్​ విజయ్​ రూపానీ కూడా ఉన్నారు. కూతురును కలిసేందుకు ఆయన లండన్​ బయలుదేరిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, రూపానీ.. ఈ నెలలో రెండుసార్లు లండన్​ ట్రిప్​ని రద్దు చేసుకుని, చివరికి జూన్​ 12న విమానం ఎక్కినట్టు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి!

రెండు సార్లు ట్రిప్​ రద్దు- చివరికి..

ఎయిరిండియా విమాన ప్రమాదంలో మరణించిన విజయ్ రూపానీ త్వరలో జరగనున్న లుధియానా వెస్ట్ అసెంబ్లీ ఉప ఎన్నికల కారణంగా తన లండన్ పర్యటనను రెండుసార్లు వాయిదా వేసుకున్నారు! రూపానీ తొలుత జూన్ 1న భార్యతో కలిసి లండన్ వెళ్లాల్సి ఉండగా, ఆ తర్వాత తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. కానీ తన భార్యను లండన్​కు పంపించారు.

రూపానీ జూన్ 5న మరోసారి తన లండన్​ ట్రిప్​ని ప్లాన్ చేసుకున్నారు. అయితే ఉప ఎన్నికల కోసం పార్టీ సన్నద్ధతను పర్యవేక్షించడానికి లుధియానాలో ఉండిపోవాల్సి రావడంతో ఆయన తన పర్యటనను మరికొన్ని రోజులు వాయిదా వేసుకున్నారు. చివరకు జూన్ 9న గుజరాత్​కు వెళ్లిన ఆయన లండన్ వెళ్తున్నట్లు అందరికీ తెలియజేశారు.

“రుపానీ ఇక లేరంటే నమ్మలేకపోతున్నాము. గురువారం జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో ఆయన కూడా ఉన్నారు,” అని పంజాబ్ బీజేపీ విభాగం సీనియర్ ఉపాధ్యక్షుడు సుభాష్ శర్మ తెలిపారు.

పంజాబ్ బీజేపీ చీఫ్ సునీల్ జాఖర్ గత కొన్ని నెలలుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండటంతో రూపానీ ఒంటరిగా పంజాబ్​లో పార్టీని నడిపిస్తున్నారు.

“అహ్మదాబాద్​లో కుప్పకూలిన ఎయిరిండియా విమానంలో విజయ్ రూపానీ ఉన్నారని తెలిసి చాలా బాధపడ్డాను. గుజరాత్ సీఎంగా ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆయన వినయపూర్వకమైన, దయగల వ్యక్తి. ఆయన పంజాబ్ బీజేపీ ఇంచార్జిగా ఉండటంతో ఆయనతో కలిసి పనిచేసే అదృష్టం నాకు దక్కింది. ఆయన నిజమైన 'జెంటిల్​మన్ పొలిటీషియన్'. గుజరాత్ ఆయనలోని గొప్ప నాయకుడిని కోల్పోవడమే కాదు, ఆయన సౌమ్య, మృదుస్వభావి నాకు ఎంతో ప్రీతిపాత్రంగా అనిపించడం నాకు వ్యక్తిగతంగా తీరని లోటు. ప్రజాజీవితంలో ఆయన తెలివితేటలు, నిరాడంబరత మిస్ అవుతాయి,” అని జాఖర్ పేర్కొన్నారు.

2023 సెప్టెంబర్​లో రూపానీని పంజాబ్ బీజేపీ ఇంచార్జీగా నియమించారు.

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ మాట్లాడుతూ రూపానీ మరణం తీరని విషాదమని అన్నారు.

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత అమరీందర్ సింగ్, శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్, పంజాబ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ప్రతాప్ సింగ్ బజ్వా, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా సింగ్, రాజ్యసభ సభ్యుడు సత్నామ్ సింగ్ సంధు తదితరులు రూపానీ మృతికి సంతాపం తెలిపారు.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.