Air India: ఎయిర్ ఇండియా విమానంలో సిబ్బందిపై ప్రయాణికుడి దౌర్జన్యం
విమానంలో ప్రయాణిస్తున్న వ్యక్తి విమాన సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించిన ఘటన ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో చోటు చేసుకుంది. గోవా నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానం ఏఐ882 లో సోమవారం ఈ ఘటన జరిగింది.

గోవా నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో సిబ్బందిపై ఒక ప్రయాణికుడు దౌర్జన్యం చేశాడు. బూతులు తిడుతూ ఒక ఉద్యోగిపై చేయి చేసుకున్నాడు. విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో, ఆ తరువాత విమానం ల్యాండ్ అయిన తరువాత కూడా దురుసు ప్రవర్తన కొనసాగించాడు. దాంతో, అతడిని విమాన సిబ్బంది ఢిల్లీ విమానాశ్రయంలోని సెక్యూరిటీకి అప్పగించారు.
దాడి చేసి, కొట్టి..
ఎలాంటి కారణం లేకుండానే ఆ ప్రయాణికుడు ఆగ్రహంతో ఊగిపోతూ, బూతులు తిడుతూ చెలరేగిపోయాడని విమాన సిబ్బంది తెలిపారు. అడ్డుకున్న తమపై దాడి చేశాడని, ఒక ఉద్యోగిపై చేయి చేసుకున్నాడని వివరించారు. దాంతో, విమానం ఢిల్లీలో ల్యాండ్ కాగానే, ఆ వ్యక్తిని ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీకి అప్పగించామని తెలిపారు. ఈ ఘటనను ఎయిర్ ఇండియా ఉన్నతోద్యోగులకు, డీజీసీఏ కు తెలియజేశామన్నారు. ఆ ప్రయాణికుడు ఎవరు? ఎందుకలా ప్రవర్తించాడనే విషయంపై పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. ‘‘మా సిబ్బంది, ప్రయాణికుల భద్రత మాకు అత్యంత ప్రాధాన్యతాంశం. ప్రయాణికుల నుంచి ఇలాంటి దౌర్జన్య పూరిత ప్రవర్తనను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రయాణికుడి చేతిలో దాడికి గురైన సిబ్బందికి అన్ని రకాలుగా సహకారం అందిస్తాం’’ అని ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది.
గతంలోనూ పలు ఘటనలు
విమానాల్లో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోవడం ఇటీవలి కాలంలో ఎక్కువయింది. ఏప్రిల్ 10వ తేదీన ఢిల్లీ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో ఇద్దరు మహిళా ఉద్యోగులపై ఒక ప్రయాణికుడు దాడి చేసి, గాయపర్చాడు. దాంతో ఆ ప్రయాణికుడిపై పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాకుండా, రెండేళ్ల పాటు విమాన ప్రయాణాలు చేయకుండా నిషేధం విధించారు. దురుసుగా ప్రవర్తించే ప్రయాణికులపై వారు విమాన ప్రయాణాలు చేయడానికి వీలు లేకుండా డీజీసీఏ నిషేధం విధిస్తుంది. మాటలు, సైగలతో అవమానకరంగా ప్రవర్తించడాన్ని లెవెల్ 1 గా, కొట్టడం, అసభ్యకరంగా దూషించడం, దాడి చేయడం వంటి వాటిని లెవెల్ 2గా, విమానంలోని కీలక సిస్టమ్స్ ను ధ్వంసం చేయడం, ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలకు ముప్పుగా వ్యవహరించడం వంటి వాటిని లెవెల్ 3 గా డీజీసీఏ నిర్ధారించింది. ఈ మూడు లెవెల్స్ లో ఒక్కో లెవెల్ కు ఒక్కో విధమైన శిక్ష ఉంటుంది.