Flights: కాస్తలో తప్పిన విమాన ప్రమాదం.. సమీపంలోకి వచ్చిన రెండు ఫ్లైట్‍లు: ఏం జరిగిందంటే!-air india nepal airlines flights narrowly avert mid air collision full details ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
Telugu News  /  National International  /  Air India Nepal Airlines Flights Narrowly Avert Mid Air Collision Full Details

Flights: కాస్తలో తప్పిన విమాన ప్రమాదం.. సమీపంలోకి వచ్చిన రెండు ఫ్లైట్‍లు: ఏం జరిగిందంటే!

ఎయిర్ ఇండియా విమానాలు (ప్రతీకాత్మక చిత్రం)
ఎయిర్ ఇండియా విమానాలు (ప్రతీకాత్మక చిత్రం) (REUTERS)

Flights: ఎయిర్‌ ఇండియా, నేపాల్ ఎయిర్‌ లైన్స్ విమానాల మధ్య కాస్తలో ప్రమాదం తప్పింది. గగనతలంలో ఒకే ప్రాంతంలో ఈ ఫ్లైట్‍లు కాసేపు ప్రయాణించాయి. వివరాలివే..

Flights: నేపాల్‍లో విమాన ప్రమాదం తప్పింది. గగనతలంలో ఒకే ప్రాంతంలో నేపాల్ ఎయిర్‌లైన్స్ (Nepal Airlines), ఎయిర్‌ ఇండియా(Air India)కు చెందిన విమానాలు సమీపంలోకి వెళ్లాయి. ఈ విషయాలను నేపాల్ పౌర విమానయాన సంస్థ (Civil Aviation Authority of Nepal - CAAN) వెల్లడించింది. ఈ ఘటన ఈ నెల 24న జరిగినట్టు పేర్కొంది. ఇందుకు సంబంధించి ఎయిర్‌ ట్రాఫిక్ కంట్రోల్ డిపార్ట్‌మెంట్‍లో ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేసింది. నిర్లక్ష్యం వహించినందుకు వారిపై వేటు వేసినట్టు పేర్కొంది. వివరాలివే.

ట్రెండింగ్ వార్తలు

ఇదీ జరిగింది

Flights: కఠ్మాండు నుంచి కౌలాలంపూర్ వెళుతున్న నేపాల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎయిర్‌బస్ ఏ-320 విమానం, కట్మాండు నుంచి ఢిల్లీకి వెళుతున్న ఎయిర్‌ ఇండియా విమానం.. శుక్రవారం సమీపానికి వచ్చాయి.

ఒకే లొకేషన్‍లో ఎయిర్‌ ఇండియా విమానం 19,000 అడుగుల ఎత్తులో ఉండగా.. నేపాల్ ఎయిర్‌ లైన్స్ విమానం 15,000 అడుగుల ఎత్తులో ప్రయాణించిందని సీఏఏఎన్ ప్రతినిధి జగన్నాథ్ నిరౌలా వెల్లడించారు. కఠ్మాండు సమీపంలో ఇది జరిగింది. ఆ సమయంలో రెండు విమానాలు ఒకే ప్రదేశంలో ఉన్నట్టు రాడార్ లో కనిపించిందని తెలిపారు. వార్నింగ్ సిస్టమ్.. పైలట్లను అలెర్ట్ చేయడంతో ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు. వెంటనే నేపాల్ విమానాన్ని 7,000 అడుగుల ఎత్తును కిందికి దించినట్టు వెల్లడించారు.

ఈ విషయంపై సీఏఏఎన్ ముగ్గురు సభ్యులతో దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసింది. విమానాలు సమీపంలోకి వచ్చిన సమయంలో కంట్రోల్ రూమ్‍లో విధుల్లో ఉన్న ముగ్గురు అధికారులను విధుల నుంచి తొలగించినట్టు సీఏఏఎన్ తెలిపింది. అయితే ఈ విషయంపై ఎయిర్‌ ఇండియా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.

జనవరిలో..

ఈ ఏడాది జనవరిలో నేపాల్ ఓ ఘోర విమానం ప్రమాదం జరిగింది. యెటి ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఫ్లైట్ కూప్పకూలి 71 మంది చనిపోయారు. ఇందులో ఐదుగురు భారతీయులు కూడా ఉన్నారు. మానవ తప్పిదమే ఈ ప్రమాదానికి కారణమని దర్యాప్తులో తేలింది. కఠ్మాండు త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరిన ఈ విమానం సేతి నదిలో కుప్పకూలింది.