ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ బెన్ గురియన్ విమానాశ్రయం సమీపంలో క్షిపణి దాడి జరిగింది. అనంతరం ఎయిరిండియా విమానాన్ని అబుదాబికి దారి మళ్లించారు. ఈ విమానం దిల్లీ నుంచి టెల్ అవీవ్ నగరం వెళ్తోంది. ఆదివారం విమానాశ్రయం సమీపంలో క్షిపణి దాడి జరిగింది. ఎయిరిండియాకు చెందిన ఏఐ139 విమానం టెల్ అవీవ్‌లో ల్యాండ్ కావడానికి గంట ముందు ఈ దాడి జరిగింది. అధికారులు అబుదాబీకి దారి మళ్లించారు.
విమానాన్ని తిరిగి దిల్లీకి తీసుకురానున్నట్లు పీటీఐ వార్తా సంస్థ వర్గాలు తెలిపాయి. ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ Flightradar24.com అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, విమానం అబుదాబికి దారి మళ్లించిన సమయంలో జోర్డాన్ గగనతలంలో ఉంది. మరోవైపు టెల్ అవీవ్ నుంచి దిల్లీ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానాన్ని ఆదివారం రద్దు చేశారు.
ప్రయాణికులు, సిబ్బంది భద్రత కోసం టెల్ అవీవ్‌కు, అక్కడి నుంచి విమానాలను ఇక్కడకు 6 మే 2025 వరకు నిలిపివేస్తున్నట్టుగా ఎయిరిండియా ప్రకటించింది. క్షేత్రస్థాయిలో తమ సిబ్బంది ప్రజలకు సహాయం చేస్తూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారని పేర్కొంది. మే 4 నుంచి 6 మధ్య ప్రయణాలకు టికెట్లు బుక్ చేసుకున్న వారికి పూర్తి మెుత్తాన్ని రిఫండ్ చేస్తారు.
యెమెన్‌లో హుతీ తిరుగుబాటుదారులు ప్రయోగించిన క్షిపణి బెన్ గురియన్ విమానాశ్రయం సమీపంలో కూలినట్టు ఇజ్రాయెల్ అధికారులు చెప్పారు. ఈ దాడితో భయాందోళనలు నెలకొన్నాయి. గాజాలో జరుగుతున్న యుద్ధంలో పాలస్తీనియన్లకు సంఘీభావంగా హౌతీ తిరుగుబాటుదారులు ఇజ్రాయెల్‌పై దాడి చేస్తున్నారు. క్షిపణి దాడి అనంతరం ఇజ్రాయెల్‌లోని పలు ప్రాంతాల్లో వైమానిక దాడుల సైరన్లు మోగించాయి. ఇజ్రాయెల్ మీడియా షేర్ చేసిన ఫుటేజీ ప్రకారం విమానాశ్రయం సమీపంలో పొగలు కనిపించాయి. ప్రయాణికులు అరుస్తూ దాక్కోవడానికి పరుగులు తీశారు.