Wi-Fi In Flight : ప్రయాణికులకు న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చిన ఎయిర్ ఇండియా.. విమానంలో వైఫై సేవలు
Air India Wi-Fi : విమాన ప్రయాణికులకు ఎయిర్ ఇండియా న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చింది. దేశీయ విమానాల్లోనూ వైఫై సేవలను ప్రారంభించింది. ప్రస్తుతానికి ఈ సేవలను ఉచితంగానే మెుదలుపెట్టింది.
ప్రయాణ సమయంలో ఇంటర్నెట్‌కు కనెక్ట్ అవ్వాలనే ప్రయాణికుల కల ఇప్పుడు సాకారమైంది. ఎయిర్ ఇండియా 2025 జనవరి 1 నుండి తన దేశీయ, అంతర్జాతీయ విమానాలలో వై-ఫై ఇంటర్నెట్ సేవలను ప్రారంభించింది. ఎయిర్ బస్ ఏ350, బోయింగ్ 787-9, ఎంపిక చేసిన ఎయిర్ బస్ ఏ321నియో విమానాల్లో ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. దీంతో దేశంలో విమానాల్లో ఇన్-ఫ్లైట్ వై-ఫైని ప్రవేశపెట్టిన తొలి విమానయాన సంస్థగా ఎయిరిండియా నిలిచింది. విశేషమేమిటంటే ప్రస్తుతానికి ఈ సేవ ఉచితంగా ఉంది. అంటే కాంప్లిమెంటరీగా అందిస్తుంది.
ఎయిరిండియా చీఫ్ కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ ఆఫీసర్ రాజేష్ డోగ్రా మాట్లాడుతూ నేటి ప్రయాణంలో కనెక్టివిటీ ఒక ముఖ్యమైన భాగంగా మారిందని అన్నారు. కొంతమందికి ఇది రియల్-టైమ్ షేరింగ్, మరికొందరికి పని కోసం ఉపయోగపడుతుందని చెప్పారు. తమ ప్రయాణికులు ఈ కొత్త సదుపాయాన్ని స్వాగతిస్తారని, కనెక్టివిటీని ఆస్వాదిస్తారని విశ్వస్తున్నట్టుగా తెలిపారు.
ల్యాప్ టాప్‌లు, టాబ్లెట్లు, స్మార్ట్ ఫోన్లు (ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంలు) వంటి వై-ఫై ఎనేబుల్డ్ డివైజ్‌ల ద్వారా ప్రయాణికులకు ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. 10,000 అడుగుల ఎత్తులో ప్రయాణికులు ఒకేసారి అనేక పరికరాలను కనెక్ట్ చేయగలరు. ప్రయాణికులు దీన్ని ఆస్వాదించేందుకు వీలుగా ఈ సదుపాయాన్ని ఉచితంగా అందుబాటులోకి తీసుకువచ్చారు.
అంతర్జాతీయ రూట్లలో పైలట్ ప్రోగ్రామ్‌గా ఎయిర్ ఇండియా గతంలో ఈ సర్వీసును ప్రారంభించింది. వీటిలో న్యూయార్క్, లండన్, పారిస్, సింగపూర్ వంటి ప్రధాన గమ్యస్థానాలు ఉన్నాయి. ఇప్పుడు దేశీయ రూట్లలో కూడా దీన్ని అమలు చేస్తున్నారు. వై-ఫై సేవలను క్రమంగా ఇతర విమానాలకు కూడా విస్తరిస్తారు.
ఈ కొత్త సర్వీసు ద్వారా ఎయిరిండియా ప్రయాణికులు ఇంటర్నెట్ బ్రౌజ్ చేయడానికి, సోషల్ మీడియాను ఉపయోగించడానికి, ప్రయాణంలో పని చేసుకోవడానికి, స్నేహితులు, కుటుంబ సభ్యులతో కనెక్ట్ అవ్వడానికి అనుమతిస్తుంది. ఈ సదుపాయం ముఖ్యంగా వ్యాపార ప్రయాణికులకు ఒక వరం. ఎందుకంటే వారు విమానంలో కూడా తమ పనిని కొనసాగించవచ్చు.
భవిష్యత్తులో ఈ సర్వీసులో ఛార్జీలు వసూలు చేయవచ్చని ఎయిరిండియా సూచించినప్పటికీ ప్రస్తుతానికి దీన్ని ఉచితంగానే ఉంచింది. ఈ కొత్త సర్వీస్‌తో ఎయిరిండియా తన కస్టమర్లకు గొప్ప ఫ్లైయింగ్ అనుభవాన్ని అందించే దిశగా అడుగు వేసింది.