Waqf Amendment Bill : ఇది వక్ఫ్ ఆస్తులను రక్షించడానికి కాదు.. వక్ఫ్ సవరణ బిల్లుపై అసదుద్దీన్ ఒవైసీ కామెంట్స్
Waqf Amendment Bill : వక్ఫ్ సవరణ బిల్లు 2024పై లోక్‌సభలో గందరగోళం నెలకొంది. ప్రతిపక్షాల అభ్యంతరాలను నివేదికలో చేర్చలేదని నిరసనలు వ్యక్తమయ్యాయి. మరోవైపు దీనిపై ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు.

వక్ఫ్ సవరణ బిల్లు 2024పై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) రూపొందించిన నివేదికను కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. ఈ నివేదికను ప్రతిపక్షాలు విమర్శించాయి. తాము సమర్పించిన అసమ్మతి నోట్‌లలోని కొన్ని భాగాలను తొలగించారని ఆరోపించాయి. రాజ్యసభ నుంచి వాకౌట్ చేశాయి. ఈ గందరగోళం నడుమ నివేదికను రాజ్యసభ ఆమోదించింది. మరోవైపు జేపీసీ ఛైర్మన్ లోక్‌సభ ముందుకు నివేదిను తీసుకొచ్చారు. అక్కడ కూడా నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో కాసేపు సభను వాయిదా వేశారు. అనంతరం సభ ప్రారంభమైనా.. ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి.
మాకు ఎలాంటి అభ్యంతరం లేదు : అమిత్ షా
దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. 'ప్రతిపక్ష సభ్యులు కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను, వివాదం ఏదైనా.. మీరు పార్లమెంటరీ విధానం ప్రకారం తగిన రూపంలో చేర్చాలి. అసమ్మతి నోట్‌లను చేర్చడంపై మాకు ఎలాంటి అభ్యంతరం లేదు.'అని అమిత్ షా అన్నారు.
ముస్లింలను నాశనం చేయడానికే : ఒవైసీ
మరోవైపు పార్లమెంటు వెలుపల మీడియాతో మాట్లాడారు ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. ముస్లింలను నాశనం చేయడానికే ఈ వక్ఫ్ బిల్లును తీసుకొచ్చారని ఆరోపించారు. ఇది వక్ఫ్ ఆస్తులను రక్షించడానికి తీసుకురాలేదని, ముస్లింల వక్ఫ్ ఆస్తులను వారి ఆధీనంలో నుంచి జప్తు చేసి నాశనం చేయడానికి తీసుకువచ్చారని చెప్పారు.
'ప్రభుత్వం ప్రవేశపెట్టిన సవరణలు వక్ఫ్ బిల్లును మరింత దిగజార్చాయి. ముస్లిమేతర సభ్యుడిని ముస్లిం వక్ఫ్ ఆస్తుల్లో ఎలా చేర్చుతారు. ఇది రాజ్యాంగ విరుద్ధం. ముస్లింలను వారి పరిధి నుంచి తొలగించే బిల్లును తీసుకువస్తున్నారు. ప్రతిపక్ష ఎంపీల అసమ్మతి నివేదికల్లో 70 శాతం ఎడిట్ చేస్తామని స్పీకర్ హామీ ఇచ్చారు.' అని అసదుద్ధీన్ ఓవైసీ అన్నారు.
బీజేపీకి కేవలం ఓట్లు మాత్రమే కావాలని జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ అన్నారు. తొలుత ఆర్టికల్ 370, ఆ తర్వాత ఇతర వివాదాలు, ఇప్పుడు వక్ఫ్ బిల్లు పేరుతో చీలికలు సృష్టించి ఓట్లు రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
మల్లిఖార్జున ఖర్గే కామెంట్స్
రాజ్యసభలో ఈ బిల్లును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే మాట్లాడారు. వక్ఫ్ బిల్లుపై జేపీసీ సభ్యులు చేసిన వ్యాఖ్యలను నివేదిక నుంచి తొలగించడం సరికాదని, అది లేకుండా ఈ నివేదిక నకిలీదని, అందువల్ల దానిని అంగీకరించబోమని అన్నారు. వక్ఫ్ బిల్లుపై జేపీసీలో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించేందుకు ప్రయత్నించిందన్నారు.