ఎయిరిండియా విమానం ఏఐ171 టేకాఫ్ అయిన కొన్ని సెకన్ల తర్వాత చివరి సిగ్నల్ వచ్చిందని, అది కూలిపోయే ముందు 625 అడుగుల ఎత్తుకు చేరుకుందని ఫ్లైట్ ట్రాకింగ్ ప్లాట్ఫామ్ ఫ్లైట్ రాడార్ వెల్లడించింది.
ప్రమాదం జరిగిన కొన్ని సెకన్ల తర్వాత అహ్మదాబాద్ ఆకాశంలోకి దట్టమైన పొగలు ఎగసిపడ్డాయి. "ఫ్లైట్ #AI171 నుండి ప్రారంభ ఎడిఎస్-బి డేటా ప్రకారం విమానం గరిష్టంగా 625 అడుగుల బారోమెట్రిక్ ఎత్తుకు (విమానాశ్రయం ఎత్తు సుమారు 200 అడుగులు) చేరుకుంది. తరువాత అది నిమిషానికి -475 అడుగుల వేగంతో నిట్టనిలువుగా కిందకు దూసుకురావడం ప్రారంభించింది" అని ఫ్లైట్ రాడార్ వెల్లడించింది. విమానం టేకాఫ్ కావడానికి కొద్దిసేపటి ముందు మధ్యాహ్నం 1.38 గంటలకు చివరి సిగ్నల్ వచ్చిందని ఫ్లైట్ ట్రాకింగ్ ప్లాట్ ఫామ్ అయిన ఫ్లైట్ రాడార్ తెలిపింది.
ప్రమాదానికి గురైన విమానంలో 52 మంది బ్రిటిషర్లు ఉన్నారని ఎయిర్ ఇండియా తెలింది. అలాగే, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ విమానంలో 12 వ నంబర్ సీట్లో ఉన్నారని వెల్లడించింది. ఈ విమానం అహ్మదాబాద్ నుంచి లండన్ లోని గాట్విక్ కు వెళ్తోందని ఎయిరిండియా తెలిపింది. కాగా, పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. 'మేం అప్రమత్తంగా ఉన్నాం. నేను స్వయంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాను. అన్ని ఏవియేషన్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఏజెన్సీలు వేగంగా, సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ఆదేశించాను’’అని రామ్మోహన్ నాయుడు తెలిపారు.
లండన్ వెళ్తున్న ఏయిర్ ఇండియా ఏఐ 171 విమానం అహ్మదాబాద్ విమానాశ్రయం కు అత్యంత సమీపంలో నివాస ప్రాంతంలో కుప్పకూలింది. కూలిపోయే ముందు ఈ విమానం అక్కడి భవనాన్ని ఢీ కొట్టినట్లు సమాచారం. 242 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఈ విమానం గుజరాత్ లోని అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలోని నివాస ప్రాంతమైన మేఘానీనగర్ ప్రాంతంలో కూలిపోయింది.
ఈ ప్రమాదం అనంతరం అహ్మదాబాద్ విమానాశ్రయాన్ని మూసివేశారు. విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. కాగా, ఈ ఘోర ప్రమాదంలో గాయపడిన లేదా మరణించిన వారి సంఖ్య ఇంకా తెలియరాలేదు. టేకాఫ్ తీసుకున్న ఐదు నిమిషాల్లోనే విమానం కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. విమానంలో ఇద్దరు పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బంది సహా 242 మంది ఉన్నారు.
సంబంధిత కథనం