Jammu and Kashmir elections : జమ్ముకశ్మీర్ ఎన్నికల బరిలో అఫ్జర్ గురు సోదరుడు..
Ajaz Ahmad Guru : జమ్ముకశ్మీర్ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు అజాజ్ అహ్మద్ గురు ప్రకటించారు. ఈయన.. పార్లమెంట్‌పై దాడి కేసులో దోషి అఫ్జర్ గురు సోదరుడు.
2001 పార్లమెంటుపై దాడి కేసులో దోషి అఫ్జల్ గురు సోదరుడు అజాజ్ అహ్మద్ గురు జమ్ముకశ్మీర్ ఎన్నికల్లో పోటీచేయనున్నారు. సోపోర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఇండిపెండెంట్‌గా బరిలో దిగనున్నారు.
2014లో పశుసంవర్ధక శాఖ నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ పొందిన అజాజ్ గురు, ప్రస్తుతం కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నారు. జమ్ముకశ్మీర్ ఎన్నికల్లో పోటీ కోసం మంగళవారం లేదా బుధవారాల్లో ఆయన దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని సమాచారం. నామినేషన్ దాఖలుకు గురువారం చివరి రోజు.
తాను స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయబోతున్నానని, అందరూ ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు తాను ఎందుకు పోటీ చేయకూడదని అజాజ్ ప్రశ్నించారు. “నా సోదరుడి కంటే నాకు భిన్నమైన భావజాలం ఉంది. కానీ కల్పిత కేసులో తొమ్మిది నెలల క్రితం పోలీసులు అరెస్టు చేసిన నా కుమారుడు షోయబ్ సహా పోలీసులు అరెస్టు చేసిన యువకుల కోసం నేను పోరాడతాను,” అని ఆయన అన్నారు.
తప్పుడు ఆరోపణలతో తన కుమారుడు జైలులో మగ్గుతున్నాడని ఆందోళన వ్యక్తం చేసిన అజాజ్.. బారాముల్లా ఎంపీగా పోటి చేసిన గెలిచిన ఇంజినీర్ రషీద్ విషయాన్ని ప్రస్తావించారు.
“ఇంజినీర్ రషీద్ కుమారుడు అబ్రార్ రషీద్ తన తండ్రి తరఫున ప్రచారం చేసినప్పుడు.. పుణెలో చదువుకుంటున్న నా కుమారుడి కోసం నేను ఎందుకు ప్రచారం చేయలేను? నా కుమారుడు ఏ తప్పూ చేయలేదని నిరూపిస్తాను. తప్పుడు అభియోగాలతో జైల్లో ఉన్న ఇతర అమాయకుల కేసులను ఎత్తిచూపుతాను,” అని అఫ్జల్ గురు సోదరుడు అజాజ్ అహ్మద్ చెప్పారు.
2001లో పార్లమెంటుపై దాడి కేసులో దోషిగా తేలిన అఫ్జల్ గురును 2013 ఫిబ్రవరి 9న తీహార్ జైలులో ఉరితీశారు. ఆయన మృతదేహాన్ని ఉత్తర కశ్మీర్‌లోని సోపోర్ పట్టణంలోని కుటుంబ సభ్యులకు అప్పగించకుండా జైలు ఆవరణలోనే ఖననం చేశారు! ఇది కశ్మీర్ లోయలో పెద్ద ఎత్తున నిరసనలకు దారితీసింది. అఫ్జల్ గురు ఉరిశిక్షపై కశ్మీర్‌లోని ఉద్యమకారులు, ప్రజలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
అఫ్జల్ భార్య బారాముల్లా పట్టణంలో వేరుగా నివసిస్తోంది.
అయితే తన సోదరుడి పేరుతో ఓట్లు అడగబోనని అజాజ్ గురు స్పష్టం చేశారు.
“నా ఐడియాలజీ వేరు. స్వయంప్రతిపత్తి, స్వయంపాలన పేరుతో కొందరు, 'ఆజాదీ' పేరుతో కొందరు కశ్మీర్ ప్రజలను మోసం చేశారని నేను నమ్ముతున్నాను. కశ్మీర్ ప్రజలను అందరూ మోసం చేశారు,” అని అన్నారు.
వేర్పాటువాద నాయకుడు, జమాత్ సిద్ధాంతకర్త సయ్యద్ అలీ గిలానీకి కంచుకోటగా భావించిన సోపోర్ గత కొన్ని దశాబ్దాలుగా పోలింగ్‌కు దూరంగా ఉంది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో సోపోర్ అసెంబ్లీ సెగ్మెంట్లో 44 శాతానికి పైగా ప్రజలు తమ ఓటు హక్కును నమోదు చేసుకున్నారు. 2014 ఎన్నికల్లో తక్కువ ఓటింగ్ మధ్య సోపోర్ కాంగ్రెస్ అభ్యర్థి హాజీ రషీద్ గెలిచారు. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలని ఇప్పటికే డజను మంది స్థానికులు తమ ఆకాంక్షను వ్యక్తం చేశారు.
మూడు దశల్లో భాగంగా జమ్ముకశ్మీర్ ఎన్నికలు ఈ నెల 18 నుంచి అక్టోబర్ 1 వరకు జరుగుతాయి. హరియాణా ఎన్నికలతో సహా జమ్ముకశ్మీర్ ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 8న వెలువడతాయి.
సంబంధిత కథనం