Apple prices: టమాటాల తరువాత.. ఇప్పుడు యాపిల్స్ వంతు; కొండెక్కనున్న యాపిల్స్ ధర
Apple prices: సామాన్యులు కొనలేని స్థాయికి పెరిగిన టమాటాల ధర క్రమంగా దిగి వస్తోంది. రూ. 300 వరకు వెళ్లిన కేజీ టమాటా ధర మార్కెట్లలోకి టమాటాలు భారీగా వస్తుండడంతో.. క్రమంగా తగ్గుతోంది. ఇప్పుడు, సామాన్యుల నడ్డి విరిచే డ్యూటీని యాపిల్స్ తీసుకున్నాయి. యాపిల్ ధరలు దేశవ్యాప్తంగా భారీగా పెరుగుతున్నాయి.
Apple prices: సామాన్యులు కొనలేని స్థాయికి పెరిగిన టమాటా (tomato) ల ధర క్రమంగా దిగి వస్తోంది. రూ. 300 వరకు వెళ్లిన కేజీ టమాటా ధర.. మార్కెట్లలోకి టమాటాలు భారీగా వస్తుండడంతో క్రమంగా తగ్గుతోంది. ఇప్పుడు, సామాన్యుల నడ్డి విరిచే డ్యూటీని యాపిల్స్ తీసుకున్నాయి. యాపిల్ ధరలు దేశవ్యాప్తంగా భారీగా పెరుగుతున్నాయి.
వర్షాల కారణంగా..
యాపిల్ తోటలకు హిమాచల్ ప్రదేశ్ ఫేమస్. సిమ్లా యాపిల్ దేశ విదేశాల్లో మంచి డిమాండ్ ఉంటుంది. కానీ, ఇటీవల కాలంలో హిమాచల్ ప్రదేశ్ ను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయి. పెద్ద ఎత్తున ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటిల్లింది. రాష్ట్రంలోని యాపిల్ తోటలు కూడా ధ్వంసమయ్యాయి. దాంతో యాపిల్స్ దిగుబడి కూడా భారీగా తగ్గనుంది. మరోవైపు, కొండచరియలు విరిగిపడడంతో రాష్ట్రంలోని ప్రధాన రహదారుల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాంతోపాటు భారీ వర్షాలతో ప్రయాణాలు కూడా నిలిచిపోయాయి. దాంతో, ఢిల్లీ హోల్ సేల్ మార్కెట్ కు ప్రతీరోజు యాపిల్స్ తీసుకువచ్చే వాహనాలు అక్కడే ఆగిపోయాయి.
ధరలు పెరుగుతున్నాయి..
హిమాచల్ ప్రదేశ్ లో వర్షాలు పడుతున్నాయంటే, మార్కెట్లకు యాపిల్స్ సరఫరా నిలిచిపోతుంది. దాంతోపాటు ప్రతికూల వాతావరణం, రోడ్ల పరిస్థితి బాగాలేకపోవడం వంటి కారణాల వల్ల యాపిల్స్ తదితర పళ్లు, కూరగాయలు త్వరగా పాడైపోతున్నాయి. హిమాచల్ ప్రదేశ్ నుంచి యాపిల్సే కాకుండా, ప్లమ్స్, ఆప్రికాట్స్, పలు రకాల పుష్పాలు దేశ విదేశాలకు ఎగుమతి అవుతుంటాయి. ఢిల్లీ హోల్ సేల్ మార్కెట్లో బాక్స్ యాపిల్స్ ధర సాధారణంగా రూ 1000 వరకు ఉంటుంది. కానీ, హిమాచల్ ప్రదేశ్ లో వర్షాలు, వరదల కారణంగా సరఫరా నిలిచిపోవడంతో ఇప్పుడు బాక్స్ యాపిల్స్ ధర రూ. 2500 నుంచి రూ. 3500 వరకు పలుకుతోంది.
అత్యధిక వర్షపాతం
హిమాచల్ ప్రదేశ్ లో ఈ సంవత్సరం రతుపవనాల కారణంగా అత్యధిక వర్షపాతం నమోదైంది. గత 54 రోజుల్లో 742 ఎంఎం వర్షపాతం నమోదై, గత 50 ఏళ్ల రికార్డును తుడిచిపెట్టేసింది. ఆగస్ట్ 13 - ఆగస్ట్ 15 మధ్య భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడడం వంటి కారణాల వల్ల హిమాచల్ ప్రదేశ్ లో 71 మంది ప్రాణాలు కోల్పోయారు. 1200 కు పైగా రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. రాష్ట్రంలో సుమారు 7500 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లింది.