Bharat Jodo Yatra 2.0: ఈసారి తూర్పు నుంచి పడమరకు.. మరో దేశవ్యాప్త యాత్రకు కాంగ్రెస్ ప్లాన్: వివరాలివే..
Bharat Jodo Yatra 2.0: కాంగ్రెస్ పార్టీ అతిత్వరలో మరో దేశవ్యాప్త యాత్రకు శ్రీకారం చుట్టనుంది. భారత్ జోడో యాత్ర సక్సెస్ తర్వాత మరో భారీ యాత్రకు సిద్ధమవుతోంది.
Bharat Jodo Yatra 2.0: మరో దేశవ్యాప్త యాత్రకు కాంగ్రెస్ (Congress) పార్టీ సన్నద్ధమవుతోంది. పార్టీ ప్రధాన నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi).. దక్షిణం నుంచి ఉత్తరానికి నిర్వహించిన భారత్ జోడో యాత్ర (Bharat Jidi Yatra) విజయవంతంగా పూర్తవటంతో ఇక మరో యాత్రకు శ్రీకారం చుట్టేందుకు సిద్ధమైంది. 2024 లోక్‍సభ ఎన్నికల ముందు ఇది కీలకంగా ఉండనుంది. ఈసారి దేశ తూర్పు దిశ నుంచి పడమరకు యాత్ర (East to West Yatra) రూట్ ఉండేలా ప్లాన్ చేయనుంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ (Jairam Ramesh) వెల్లడించారు. అరుణాచల్ ప్రదేశ్‍లోని పాసిఘాట్ (Pasighat) నుంచి గుజరాత్‍లోని పోరుబందర్ వరకు ఈ యాత్ర సాగే అవకాశం ఉంది. పూర్తి వివరాలు ఇవే..

రాహుల్ గాంధీ గతేడాది సెప్టెంబర్ 7వ తేదీన దక్షిణ భారతం తమిళనాడులోని కన్యాకుమారిలో భారత్ జోడో యాత్రను మొదలుపెట్టారు. జమ్ము కశ్మీర్‌లోని శ్రీనగర్ వరకు ఈ యాత్ర సాగింది. 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల గుండా ఈ యాత్ర సాగింది. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హరియాణా, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్ము కశ్మీర్‌లో భారత్ జోడో యాత్ర జరిగింది. ఈ ఏడాది జనవరి 30న శ్రీనగర్‌లో ముగిసింది. ఈ యాత్రకు అన్ని వర్గాల నుంచి మంచి స్పందన రావటంతో కాంగ్రెస్‍లో జోష్ నెలకొంది. అందుకే వచ్చే ఏడాది లోక్‍సభ ఎన్నికల్లోగా మరో యాత్ర నిర్వహిస్తే పార్టీకి సానుకూలత ఏర్పడుతుందని ప్లాన్ చేస్తోంది.
కాస్త విభిన్నంగా..
Bharat Jodo Yatra 2.0: భారత్ జోడో యాత్రతో పోలిస్తే ఈ తదుపరి యాత్ర కాస్త విభిన్నంగా ఉంటుందని జైరామ్ రమేశ్ సంకేతాలు ఇచ్చారు. తూర్పు భారతం నుంచి పడమరకు ప్లాన్ చేస్తుండగా.. ఈ రూట్‍లో ఎక్కువగా అటవీ ప్రాంతం, నదులు ఉండటంతో మల్టీ మోడల్ యాత్రగా ఉంటుందని ఆయన చెప్పారు. అయితే ఎక్కువ శాతం పాదయాత్రగానే ఉంటుందని పేర్కొన్నారు.
ఈ ఏడాది ఏప్రిల్‍కు ముందే ఈ రెండో దశ యాత్ర ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. లేకపోతే నవంబర్‌కు ముందు మొదలుకానుంది. ఈ ఏడాది మొత్తంగా 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఏడాది లోక్‍సభ ఎన్నికలు జరగనున్నాయి.
కాస్త తక్కువ సమయమే..
Bharat Jodo Yatra 2.0: భారత్ జోడో యాత్ర 136 రోజులు సాగగా.. కాంగ్రెస్ తదుపరి యాత్ర కాస్త తక్కువ కాలమే ఉంటుందని జైరామ్ రమేశ్ చెప్పారు. రానున్న కొన్ని వారాల్లో దీనికి సంబంధించి నిర్ణయాలు జరగుతాయని అన్నారు. ప్రస్తుతం రాయ్‍పూర్ వేదికగా కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాలు జరుగుతున్నాయి.